వదంతులు ప్రచారం చేస్తే కేసులు 

15 Mar, 2020 04:03 IST|Sakshi
పుంగనూరులో టీడీపీ మహిళా అభ్యర్థిని చుట్టూ ఉన్నది టీడీపీ వాళ్లేననడానికి ఆధారాలు చూపిస్తున్న డీజీపీ సవాంగ్‌

డీజీపీ సవాంగ్‌ స్పష్టీకరణ 

సోషల్‌ మీడియాపై నిఘా పెట్టాం 

పుంగనూరులో టీడీపీ అభ్యర్థి పత్రాలు తీసుకెళ్లింది ఆ పార్టీ వారే

సాక్షి, అమరావతి:  స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఏదో జరిగిపోయినట్టు కొందరు ప్రచారం చేస్తుండటం సరికాదని, పని కట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టించేలా వదంతులు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల ఏడీజీ అయ్యన్నార్, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ తిరుమలరావుతో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్నపాటి ఘటనలను పెద్దవిగా చూపుతూ, పుకార్లతో అలజడి రేపే ప్రయత్నాలు సరికాదన్నారు. నిర్దిష్టమైన సమాచారం ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.   

బుద్దా వెంకన్న, బొండా ఉమా కాల్‌ డేటా పరిశీలిస్తాం.. 
- మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ నుంచి మాచర్ల ఎందుకు వెళ్లారో.. అక్కడ దాడి జరిగితే ఎవరికీ ఫిర్యాదు చేయకుండా విజయవాడ ఎలా వచ్చారో.. ఇతరత్రా అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. 
- వారిని మాచర్ల నుంచి పోలీసు వాహనంలోనే బయటకు తీసుకొచ్చాం.   
- ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్‌ 307 కింద సుమోటోగా కేసు నమోదు చేసి, ముగ్గురిని తక్షణం అరెస్టు చేశాం. అయినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తే ఎలా?   
- బొండా ఉమ, బుద్దాల నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుంటాం. వారి కాల్‌ డేటా పరిశీలిస్తాం.  
- పుంగనూరు ఘటనపై టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు. మహిళా అభ్యర్థి చుట్టూ ఉన్నది టీడీపీ నేతలే. (వీడియో క్లిప్పింగ్‌ చూపారు)  
- ఎలక్షన్‌ కమిషన్‌ కార్యాలయంలో మానిటరింగ్‌ సెల్, ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్పీల పర్యవేక్షణలో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు. చిన్న ఘటన జరిగినా ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తాం. 

నిష్పక్షపాతంగా కేసుల నమోదు 
- వారం రోజుల్లో 57 కేసులు (ఇందులో హత్యాయత్నం ఘటనలు 8) నమోదు చేశాం.   
11,386 బైండోవర్‌ కేసులు నమోదు చేసి 1,09,801 మందిని బైండోవర్‌ చేశాం.  
- 10,514 ఆయుధాల్లో (లైసెన్స్‌డ్‌ వెపన్స్‌) 8,015 ఆయుధాలను డిపాజిట్‌ చేసుకున్నాం.  
- నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఉన్న 3,184 మందిని, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ పెండింగ్‌లో ఉన్న 1,117 మందిని బైండోవర్‌ చేశాం.  
- ఎన్నికల కోసం 59,549 మంది పోలీసులు విధులు నిర్వహించబోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను రప్పిస్తు న్నాం. 
- సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం, కించపరిచే వ్యాఖ్యలు చేయడం, తప్పుడు విషయాలను వైరల్‌ చేయడం వంటి వాటిపై సుమోటోగా కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేకంగా నిఘా పెట్టాం. 
- ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై 25 కేసులు నమోదు చేశాం. నిఘా యాప్‌ ద్వారా విజయవాడలో 12 కేసులు నమోదు చేశాం.  

>
మరిన్ని వార్తలు