విదేశీ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి

14 May, 2020 03:49 IST|Sakshi

‘సాక్షి’తో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి  

ఎంఎస్‌ఎంఈలకు గత ప్రభుత్వం బకాయి పడిన రూ. 905 కోట్లను రెండు విడతలుగా ఇస్తాం

ఈ నెల 22న 50 శాతం (రూ. 450 కోట్లు) విడుదల చేస్తాం 

ప్రధాని కంటే ముందే సీఎం చిన్న పరిశ్రమలకు ప్యాకేజీ ప్రకటించారు 

రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తి క్రమేపీ పెరుగుతోంది 

సాక్షి, అమరావతి: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అమెరికా, యూరప్, జపాన్, తైవాన్, వియత్నాం, కొరియా, మధ్య ఆసియా దేశాలకు చెందిన కంపెనీలను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధ్యక్షతన పరిశ్రమలు, ఆర్థిక, జలవనరులు, ఇంధన, ఐటీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

విదేశీ ఇన్వెస్టర్లను గుర్తించి వారితో సంప్రదించే విషయంలో రాష్ట్ర ఎకనామిక్‌ డవలప్‌మెంట్‌ బోర్డు ఈ టాస్క్‌ఫోర్స్‌తో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు సంబంధించి బుధవారం పరిశ్రమలశాఖ మంత్రి చాంబర్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కోవిడ్‌ నేర్పిన గుణపాఠంతో ప్రపంచవ్యాప్తంగా తయారీ కంపెనీలు చైనా వంటి ఒకే దేశంపై ఆధారపడకూడదని నిర్ణయించాయని, వీటికి భారతదేశం ఒక చక్కటి అవకాశంగా కనిపిస్తుండటంతో ఈ అవకాశాన్ని రాష్ట్రం సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. సమావేశ అనంతరం మంత్రి మేకపాటి సాక్షితో మాట్లాడుతూ..

► ఒక పక్క కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూనే లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. 
► ఎంఎస్‌ఎంఈలను ఆదుకుంటూ ఒక ప్రత్యేక పాలసీని ప్రకటించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డులకు ఎక్కింది. పరిశ్రమల అభివృద్ధిపై సీఎం వైఎస్‌ జగన్‌ నిబద్ధతకు ఇది నిదర్శనం.
► ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటన సందర్భంగా మాట్లాడిన మాటల్లో అధిక శాతం ముఖ్యమంత్రి సూచించిన అంశాలే ఉన్నాయి.  2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు బకాయిపడిన రూ. 905 కోట్లు రెండు విడతలుగా ఇవ్వనున్నాం. తొలివిడతగా మే 22న రూ. 450 కోట్లు విడుదల చేస్తాం. దీనివల్ల సుమారు 11,300 ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరుతుంది.
► లాక్‌డౌన్‌ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు తిరిగి ప్రారంభించడం ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తి క్రమేపీ పెరుగుతోంది. 
► ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. 
► ఒక బహుళజాతి సంస్థపై విచారణలో అంతర్జాతీయ నిబంధనలు పాటించాలి. ఇది తెలిసి కూడా ప్రతిపక్షం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది.
► ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో ఉన్న ట్యాంకుల డిజైన్‌లో లోపాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించాం.

మూతపడిన చక్కెర మిల్లులు ప్రారంభిస్తాం
రాష్ట్రంలో మొత్తం 10 సహకార చక్కెర కర్మాగారాలకు గాను 6 మూతపడ్డాయని, వీటిని తిరిగి ప్రారంభించేందుకు నివేదిక తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి మేకపాటి తెలిపారు. రాష్ట్రంలో చక్కెర కర్మాగారాల పరిస్థితిపై పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాల కొండయ్య, కమిషనర్‌ వెలమా రవిలతో మంత్రి సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో జరగే సమీక్ష సమయానికి పూర్తి నివేదికలు సిద్ధం చేసుకొని తీసుకురావాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు