‘గోవాడ’ అద్భుతం

28 Feb, 2014 01:42 IST|Sakshi
‘గోవాడ’ అద్భుతం
  • రికార్డు స్థాయిలో క్రషింగ్
  •      83రోజుల్లో 3లక్షల టన్నులు గానుగాట
  •      సహకార చక్కెర కర్మాగారాల చరిత్రలో ప్రథమం
  •      ఆశాజనకంగా 9.27 సరాసరి రికవరీ
  •      కోటి యూనిట్లకు చేరువలో విద్యుత్ ఉత్పత్తి
  •      ఏప్రిల్‌లోనే లక్ష్యం సాధించే దిశగా ఫ్యాక్టరీ
  •  చోడవరం,న్యూస్‌లైన్ : రాష్ట్ర సహకార చక్కెర కర్మాగారాల చరిత్రలో ‘గోవాడ’ సుగర్ ఫ్యాక్టరీ రికార్డు సృష్టించింది. ప్రైవేటు ఫ్యాక్టరీలకు దీటుగా మునుపెన్నడూలేని విధంగా 83రోజుల్లో మూడు లక్షల టన్నుల చెరకు గానుగాడింది. రైతులకు భరోసాగా నిలబడింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది సహకార చక్కెర కర్మాగారాలు క్రషింగ్ జరుపుతున్నాయి. అందులో జిల్లాలోనే చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి ఫ్యాక్టరీలు ఉన్నారు. ఏటా లక్ష్యం మేరకు మే నెల వరకు గానుగాడేవారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే లక్ష్యం మేరకు క్రషింగ్ ముగించాలని ఈ సుగర్స్ యాజమాన్యం యోచిస్తోంది.

    భారీ తుఫాన్లు, అకాల వర్షాలు వంటి ప్రతి కూల పరిస్థితులు ఈ ఏడాది నెలకొన్నప్పటికీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ గూనూరు మల్లునాయుడు,ఎమ్‌డీ వి.వెంకటరమణరావు ఈ సీజన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధిక దిగుబడి,రికవరీకి కృషి చేశారు. డిసెంబర్ 30న ఇక్కడ రెగ్యులర్ క్రషింగ్ ప్రారంభమైంది. ఓవర్‌హాలింగ్, ఇతర కారణాలతో మూడు రోజులు మాత్రమే గానుగాటకు అంతరాయం ఏర్పడింది. గురువారం నాటికి 83 రోజుల్లో 3.1లక్షల టన్నుల చెరకు గానుగాడి రికార్డు సృష్టించింది. రికవరీ కూడా ఆశాజనకంగానే ఉంది. సరాసరి 9.27శాతం రావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతుల్లో ఆశలు చిగురిస్తున్నారు.
     
    మిల్లు కెపాసిటీకి తగ్గట్టుగా రోజువారీ 3600 టన్నులు దాటి క్రషింగ్ చేయగా, ఒక దశలో రోజుకి 4వేల టన్నులు కూడా ఆడారు. 5.3లక్షల టన్నులు లక్ష్యంతో ఏప్రిల్ నెలాఖరుకు క్రషింగ్ పూర్తిచేయాలని నిర్ణయించారు. మిల్లులో లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవడంతో ఎప్పుడూలేని విధంగా ఫిబ్రవరి ఆఖరునాటికే మూడులక్షల టన్నులు గానుగాడారు. రోజువారీ రికవరీ 11 శాతంగా నమోదుతో మంచి దిగుబడి సాధించే దిశగా సుగర్స్ అడుగులు వేస్తుంది. మరో పక్క కో- జనరేషన్ ప్లాంట్ ద్వారా ఇప్పటి వరకు 93లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. రాష్ట్రంలోని ఏ సహకార చక్కెర కర్మాగారం ఈ స్థాయిలో భారీగా క్రషింగ్‌ను ఎన్నడూ చేపట్టలేదు. ప్రైవేటు ఫ్యాక్టరీల్లోనే సాధ్యమైంది. ఈ పరిణామంతో ఫ్యాక్టరీతోపాటు రైతులకు కూడా మేలు జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
     

మరిన్ని వార్తలు