దోచుకున్న ప్రజాధనాన్ని కక్కించాలి

18 Jul, 2019 07:11 IST|Sakshi
అసెంబ్లీలో మాట్లాడుతున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి

అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు(సెంట్రల్‌): గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల అంచనాలను నిబంధనలకు విరుద్ధంగా పెంచి దోచుకున్న ప్రజాధనాన్ని తిరిగి రాబట్టాలి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు. రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం కాకాణి గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన దోపిడీపై మాట్లాడారు. గత ప్రభుత్వం నీటి పారుదల శాఖ నిర్వహించిందా..లేక నిధుల పారుల శాఖ నిర్వహించిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. రూ.17వేల కోట్లతో పోలవరం, సుజలశ్రవంతి ప్రాజెక్టులను తప్ప అన్ని పూర్తి చేస్తామని చెప్పారని, కానీ కొన్ని నెలలు తిరగక ముందే రూ.68వేలు కోట్లు ఖర్చు చేసి అన్ని పూర్తి చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనాలను పెంచి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో దోచుకున్నారే తప్పా, ఎక్కడా ఏ ఒక్క ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన దాఖలాలు లేవన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని డేగపూడి–బండేపల్లి కాలువ పనులను నిబంధనలకు విరుద్ధంగా రూ.30 కోట్లతో నామినేషన్‌ పద్ధతిలో కాంట్రాక్టర్‌కు అప్పగించారని తెలిపారు. ఈ విషయమైన తాను ప్రశ్నించడంతో తిరిగి అదే టెండర్‌ను 12 శాతం లెస్‌కు వేశారన్నారు. దీంతో దాదాపు రూ.4కోట్లు ప్రభుత్వానికి మిగిలిందన్నారు. ఈ విధంగా గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో భారీగా దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్ట్‌ల పేరుతో సాగించిన దోపిడీపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ పెద్దలు దోచుకున్న రూ.68 వేల కోట్లను తిరిగి రాబడితే రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చన్నారు. ఈ  దిశగా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. 

మరిన్ని వార్తలు