మొక్కుబడి పాలన

9 Jul, 2018 12:18 IST|Sakshi

దుర్గగుడి పాలకమండలి అధికారం చేపట్టి ఏడాది పూర్తి

భక్తులకు ఉపయోగపడే నిర్ణయం ఒక్కటీ లేదు

ఈ పాలక మండలి హయాం లోనే రోడ్డెక్కిన క్షురకులు

గతంలో అధికారులతో ఢీ అంటే ఢీ

సీఎం చీవాట్లతో వెనక్కి తగ్గిన వైనం

అధికారులు తీసుకునే నిర్ణయాలకు ఆమోదముద్రలకే పరిమితం

సాక్షి, విజయవాడ : దుర్గగుడికి సుమారు దశాబ్దకాలం తరువాత ఏర్పడిన పాలకమండలి అధి కారం చేపట్టి ఏడాది దాటుతున్నా  భక్తులకు కానీ, సిబ్బందికి కానీ ఒరిగిందేమీ లేదు. గత ఏడాది జూన్‌ 29న పాలకమండలి బాధ్యతలు స్వీకరిం చింది. ఈ ఏడాది కాలంలో అధికారులతో వివా దాలు పెట్టుకోవడం మినహా చెప్పుకోదగిన నిర్ణయాలు ఏవీ పాలకమండలి తీసుకోలేకపోయింది.

భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు నిల్‌
ఏడాదిలో భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు ఒక్కటి కూడా తీసుకోలేకపోయింది. పెంచిన టిక్కెట్ల ధర తగ్గించడం కానీ, దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రాత్రిళ్లు బస చేసేందుకు కాటేజ్‌లు నిర్మించడం కాని, అమ్మవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడం కాని చేయలేకపోయింది. దసరా, భవానీదీక్షలకు చేసే తాత్కాలిక ఏర్పాట్లను పర్మినెంట్‌ ఏర్పాట్లుగా మార్చి దేవస్థానం ఖర్చులు తగ్గేటట్లు చేయలేకపోయారు.  తమకు ఉన్న పరిచయాలు ఉపయోగించుకుని దేవస్థానం ఆదాయం పెంచలేదు. ఇక పాలమండలి సభ్యులు ప్రభుత్వంలో తమకు ఉన్న పరపతిని ఉపయోగించి దేవస్థానానికి రావాల్సిన నిధులను ప్రభుత్వం నుంచి రాబట్టలేకపోయారు. కనీసం దసరా ఉత్సవాలకు అయ్యే వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టలేకపోయారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఏర్పడిన పాలకమండలి సిబ్బంది అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టేవారు. ప్రస్తుత పాలకమండలి అది కూడా చేయలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి.

అధికారులతో గొడవ..క్షురకుల సమస్య పరిష్కారం నిల్‌
పాలకమండలి ఏడాది కాలంలో అధికారులతో గొడవ పడటం మినహా సాధించింది ఏమీ లేదు. గత ఈఓ ఎ.సూర్యకుమారితో ఢీ అంటే ఢీ అన్నారు. తాంత్రిక పూజలు దేవస్థానంలో జరగకుండా అడ్డుకోలేకపోయారు. పూజలు అయిపోయిన తరువాత పాలకమండలి ఈఓ పై మీడియాలో విరచుకుపడటంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. మరో వైపు దేవస్థానం క్షురకుడిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య దాడిచేయడం చిలికిచిలికి గాలివానగా మారింది. తమకు జీతాలు ఇవ్వాలంటూ క్షురకులు రోడ్డెక్కగా చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు వారిపై వీరంగం వేయడంతో దేవాలయ పాలకమండలితో పాటు రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది.

ముఖ్యమంత్రి ఆగ్రహం
ఈఓ సూర్యకుమారిపై పాలకమండలి సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యు›లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ప్రస్తుతం అధికారులకు ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తూతూమంత్రంగా పాలకమండలి సమావేశాలు ముగుస్తున్నాయి. దసరాకు రూ. 32 లక్షలతో దేవాలయానికి రంగులు వేయాలని, దుర్గగుడిలో వేర్వేరు ప్రాంతాల్లో రూ.10 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రికార్డింగ్‌ స్టోరేజీకి మరో రూ.8 లక్షలు వెచ్చించాలని, దేవాలయంలో అగ్నిమాపక సామగ్రి ఏర్పాటుకు రూ.36 లక్షలు ఖర్చు చేయాలనే తాత్కాలిక నిర్ణయాలు మాత్రమే తీసుకున్నారు.

మరిన్ని వార్తలు