నైపుణ్యాభివృద్ధిరస్తు...

27 Jul, 2019 09:34 IST|Sakshi

నియోజకవర్గానికో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం

నిరుద్యోగ యువత నైపుణ్యానికి సానబట్టే కేంద్రాలు

పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు

నైపుణ్య శిక్షణ అందించే దిశగా పరిశ్రమలతో ఒప్పందాలు

చేతిలో పట్టా ఉంది.. కానీ తగినంత నైపుణ్యం లేదు.. ఇదీ స్థానిక నిరుద్యోగ యువత ఆవేదన. సరిగ్గా ఇదే కారణంతో పరిశ్రమల యాజమన్యాలు స్థానికేతరులకు ఉద్యోగాలు కట్టబెట్టేస్తున్నాయి. ఇప్పటివరకు జరుగుతున్న ఈ తతంగం స్థానిక యువతను నిరుద్యోగులుగానే మిగిల్చేస్తోంది. ఈ దుస్థితిని గమనించిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌ దేశంలోనే సంచలనాత్మకమైన.. ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. అదే పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు.. నిర్ణయం తీసుకున్నదే తడవుగా అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసి చట్టబద్దం చేసింది. అది సరే.. నైపుణ్యం లేకుండా స్థానికులను ఉద్యోగాల్లోకి ఎలా తీసుకుంటారు?.. దీని వల్ల పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా పోతాయన్న ప్రతిపక్షం వాదనను ప్రభుత్వం మరో కీలక నిర్ణయంతో తిప్పికొట్టింది. నోటమాట రాకుండా చేసింది. అదే నియోజకవర్గానికో నైపుణ్యాభివృద్ధి కేంద్రం(స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌) ఏర్పాటు.. ఇలా ఏర్పాటు చేసే కేంద్రాల్లో సాంకేతిక, ఇతరత్రా అర్హతలున్న నిరుద్యోగులు ఆయా రంగాల్లో తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశం కల్పించి.. వారిని పరిశ్రమల్లో  ఉద్యోగాలకు ఎంపికయ్యేలా సహరించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విశాఖ జిల్లాలో 15 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. విశాఖ లాంటి పారిశ్రామిక జిల్లాలోని నిరుద్యోగులకు ఈ చర్యలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని.. ఉద్యోగాలు పొంది స్థానికంగానే నిలదొక్కుకునేందుకు దోహదపడుతాయని యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షనేతగా... ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు పాదయాత్రలో ఏవైతే హామీలిచ్చారో... వాటిని పక్కాగా అమలు చేసే దిశగా కార్యాచరణ ప్రారంభించారు. ఈ క్రమంలో యువతకు ఉపాధి కల్పించేలా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ఓవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధితో పాటు వాటిని అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్యం పొందేందుకు అవసరమైన శిక్షణ తీసుకునే ఏర్పాట్లు చేస్తుండటంతో నిరుద్యోగ యువతలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.

రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉన్న నిరుద్యోగ సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తాను చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే గ్రామ వలంటీర్ల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు.  మరికొద్ది రోజుల్లో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఇది కాకుండా రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు అందించే బిల్లు కూడా ప్రవేశపెట్టారు. పోటీ ప్రపంచంలో యువతకు చదువు మాత్రమే సరిపోదని, తగిన నైపుణ్యాలు ఉన్నప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయన్న విషయాన్ని గుర్తించి ప్రతి నియోజకవర్గంలో నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. వివిధ కోర్సుల్లో చదువు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలనే తపన, ఆకాంక్షతో బయటకు వస్తున్న యువతకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఉపాధి లేకుండా పోతోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో అధిక శాతం విఫలమవుతున్నారు. నిరుద్యోగ యువతకు సరైన మార్గనిర్దేశం చేసేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థను పకడ్బందీగా నడిపేందుకు దృష్టి సారించింది. 

యువత భవితకు భరోసా..
నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచేందుకు వివిధ యూనివర్సిటీలు, సంస్థలతో కలిసి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లను నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల్ని పెంపొందింపజేయడమే కాకుండా వారి దృక్పథం లో మార్పును తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్‌మేళాలు నిర్వహించి, స్కిల్‌ కనెక్ట్, ఎంఎన్‌సీడ్రైవ్‌ ద్వారా ఉపాధి కల్పించనున్నారు. ఇవి కాకుండా యువతీ, యువకులకు వారి ఆసక్తి మేరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తారు.

ఇలాంటి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తూ, రాష్ట్రంలోని యువతీ యువకులకు ఉద్యోగం పొందేందుకు అవసరమైన కోర్సులను అందించే విధంగా పథకానికి రూపకల్పన చేస్తున్నారు. శిక్షణ కేంద్రాలకు వివిధ కంపెనీల ప్రతినిధులను రప్పించి అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.  పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఇకపై పీపీసీ ప్రాజెక్టుల క్రింద చేపట్టిన పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు, జాయింట్‌ వెంచర్లు, ప్రాజెక్టుల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి.  

స్కిల్స్‌ లేక ఇబ్బందులు..
డిగ్రీ పట్టా చేతిలో ఉంది. దానికి అనుబంధంగా మరికొన్ని క్వాలిఫికేషన్లు ఉంటేనే ఉద్యోగం ఇస్తామని చాలా కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికో స్కిల్‌ డెవలప్‌సెంటర్‌ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించడంతో మాకు కొత్త ఊపిరి పోసినట్లయింది.
    – కె. బాలు, డిగ్రీ విద్యార్థి

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
ఉత్తరాంధ్ర యువతకు అన్ని అర్హతలున్నా.. సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్‌ లేక చతికిల పడిపోతున్నారు. ఫలితంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నిరుద్యోగుల కష్టాల్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయనకు మా నిరుద్యోగులందరి తరఫున ధన్యవాదాలు.
    – శ్యామ్, పీజీ విద్యార్థి.

మరిన్ని వార్తలు