'లైంగిక దాడి ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ సీరియస్‌'

26 Oct, 2019 13:47 IST|Sakshi

నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి సుచరిత 

సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీసులు, అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తరపున బాధిత బాలికకి అండగా నిలవాలన్నారు.

ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. లైంగిక దాడి జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్‌ చేశాం. చట్టపరంగా చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించాం. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది. ప్రభుత్వం తరపున బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. 

లైంగిక దాడికి గురైన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ నిన్న (శుక్రవారం) పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సహాయం సత్వరం అందే విధంగా కృషి చేయడంతో పాటూ, గ్రామంలో రక్షణ కూడా కల్పిస్తామని వెల్లడించారు. లైంగిక దాడికి గురై నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలికను పరామర్శించి, సంఘటన గురించి బాలిక తల్లితండ్రుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని చెప్పారు.

ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌తో మాట్లాడానని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయం పూర్తిస్థాయిలో అందే విధంగా మహిలా కమిషన్‌ చొరవ తీసుకుంటుందని తెలిపారు. పోలీసు నివేదిక అందగానే ఆ కుటుంబానికీ మొదట కొంత మొత్తంలో ఆర్థిక సాయం అందుతుందని, చార్జిషీటు పెట్టిన తర్వాత మరికొంత అందుతుందని చెప్పారు.


బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలని గైనకాలజిస్టుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లిలో ఇటువంటి సంఘటనలు గతంలో జరిగాయని, మళ్లీ పునరావృతం కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ఎస్‌ఐతో మాట్లాడామన్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా ఇటువంటి దుశ్చర్యలపై తల్లితండ్రులు, బాలికలకు అవగాహన కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నిందితులకు కఠినమైన శిక్షలు పడే విధంగా మహిళా కమిషన్‌ తరఫున ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడి వయస్సుపై వస్తున్న ఆరోపణలపై కూడా మహిళా కమిషన్‌ విచారిస్తుందని తెలిపారు. గ్రామంలో ఆ కుటుంబానికీ రక్షణ కోసం జిల్లా ఎస్పీతో మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వం ఎవరినీ వెనకేసుకు రాదని హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం గాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆమె కోరారు. 

మరిన్ని వార్తలు