బోగస్‌కు ఇక శుభం కార్డు !

25 Sep, 2019 09:00 IST|Sakshi
తెలుపు రేషన్‌కార్డులు

బోగస్‌ రేషన్‌కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం

ఇప్పటికే పలువురు ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఉన్నట్టు గుర్తింపు

ఆధార్‌ అనుసంధానంతో బయటపడిన వాస్తవాలు

బోగస్‌ కార్డుల అసలు రంగు తేలిపోనుంది. దర్జాగా అనుభవిస్తున్నవారి బండారం బయటపడనుంది. వేలకువేలు జీతాలు తీసుకుంటున్నా... ఇంకా నిరుపేదలకు అందించే సౌకర్యాలకోసం వెంపర్లాడేవారికి గుణపాఠం కలగనుంది. డీలర్ల వ్యవస్థలో గుట్టుగా సాగిపోయిన ఈ వ్యవహారానికి ఇక చెక్‌పడనుంది. ఆధార్‌ కార్డుల అనుసంధానంతో ఈ రహస్యం కాస్తా బట్టబయలవుతోంది. కొందరు ఉద్యోగుల కుటుంబీకులు తాము అర్హులమేననీ... తమ పిల్లలకు ఉద్యోగం ఉన్నంతమాత్రాన తామెలా అనర్హులమని విన్నవించుకోవడంతో సర్వేకు సన్నాహాలు మొదలయ్యాయి.

సాక్షి, విజయనగరం: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ... వేలాది రూపాయల వేతనం తీసుకుంటున్న వారిలో చాలా మంది దారిద్య్రరేఖకు దిగువనున్నవారికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలు పొందుతున్నారు. ఈ విషయం ఆధార్‌ అనుసంధానంతో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అధికారులు వారి కార్డులు తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. కొందరి కార్డులు ఆగిపోగా... తాము అర్హులమేనని, అయినా తమ కార్డులు తీసేశారని పలువురు వినతులు కూడా ఇవ్వడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని అర్హులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించవద్దని అధికారులను ఆదేశించింది. ఇప్పుడు అధికారులు విచారణ చేపట్టి నిజమైన ఉద్యోగులెవరో తేల్చాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతవరకు రేషన్‌ సరుకుల సరఫరా కొనసాగించాలని నిర్ణయించారు. ఉద్యోగుల వద్ద 7,204 కార్డులుప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఇతర అవసరాల కోసం తమ ఆధార్‌ నంబరు లింక్‌ చేశారు. అంతేగాకుండా ఉద్యోగులకు సంక్రమించే పలు ప్రయోజనాల కోసం వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్‌ నంబర్లు నమోదు చేశారు.

ఈ వివరాలను తీసుకున్న పౌరసరఫరాలశాఖ అధికారులు రేషన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఈ విధంగా రరేషన్‌కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు గుర్తించారు. జిల్లాలో మొత్తం 7,12,303 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆధార్‌ అనుసంధానంతో ఇందులో 7,204 రేషన్‌కార్డులు ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ సెప్టెంబర్‌ నెలలో రేషన్‌ ఆపేశారు. రేషన్‌కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగి కార్డుగా గుర్తించారు. అయితే పదేళ్ల కిందట కార్డులు ఇవ్వడంతో ఇందులో కొందరు ఉద్యోగం పొందిన తర్వాత కార్డులు పొందగా కొందరు మాత్రం ఉద్యోగం రాకముందు కార్డులు పొందారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వారు కార్డులు రద్దు చేసుకోపోవడం విశేషం. పిల్లలకు ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు కూడా బీపీఎల్‌ నుంచి బయటకు వస్తారు.

కానీ ఉద్యోగం పిల్లలది కాబట్టి తమకు ఉద్యోగం లేదని వాదిస్తున్నారు. ఈ విధంగా ఇందులో అనేకమంది తాము పేదలమేనని, తమకు ఉద్యోగాలు లేవని అధికారులకు విన్నవించారు. కొందరు మాత్రం తప్పుగా ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు కావడంతో కార్డులు ఆగినట్లు సమాచారం. దీంతో వీరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ తమ కార్డులు కొనసాగించాలని వేడుకున్నారు. దీనిపై గందరగోళ పరిస్థితి తలెత్తడంతో వెంటనే ఆపేసిన కార్డులు పునరుద్ధరించి సరుకులు సరఫరా యధాతథంగా కొనసాగించి, తదుపరి చర్యలు మొదలుపెట్టారు.

వ్యక్తిగతంగా విచారణ
కార్డులన్నింటినీ విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఉన్నతాధికారులు జిల్లా అధి కారులకు ఆదేశాలు జారీ చేసి విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి విచారణ చేయాలని మండల పౌరసరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి వ్యక్తిగతంగా పరిశీలించాలని, అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో గుర్తించాలని ఆదేశించారు. అంతా కలిసి ఉన్నారా? లేకుంటే వేర్వేరుగా ఉన్నారా? అన్నది విచారించాలని ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొనడంతో ఆ విధంగా ముందుకెళ్లాలని జేసీ సూచించారు.

అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత కార్డుకు అర్హులవునో కాదో తేల్చాలి. ఈ మేరకు సర్వే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఇంటిస్థలాలకు లబ్ధిదారులు, స్థలాల గుర్తింపు పనిలో బిజీగా ఉన్నారు. దీనికితోడు ఎన్నికలు, ఇతర విధులు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు పూర్తయిన తర్వాత రేషన్‌కార్డులపై దృష్టి పెడతారని సమాచారం. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ ఉద్యోగుల కార్డుల్లో ఎన్ని బోగస్‌వి ఉన్నా యో తేలిపోతుంది. అందులో తెల్లదొరలు బయటకు వస్తారు.

విచారణ జరగాల్సి ఉంది
ప్రభుత్వ ఉద్యోగులుగా భావంచి ఆపేసిన తెల్లకార్డులను  పదిరోజుల్లోనే పునరుద్ధరించాం. సరుకులు ఇస్తున్నాం. కానీ ఇందులో బోగస్‌ ఎన్ని అన్నది ప్రతి ఇంటికి వెళ్లి విచారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇంకా విచారణ జరగాల్సి ఉంది. అందులో అనర్హులని తేలితే కార్డులు ఆపేస్తారు.
– ఎ. పాపారావు, డీఎస్‌ఓ, విజయనగరం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా