ఖరీఫ్‌పై రైతన్న ఆశలు

31 May, 2014 02:18 IST|Sakshi
ఖరీఫ్‌పై రైతన్న ఆశలు
  • 27 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు
  •  దుక్కి దున్ని పొలం సిద్ధం చేసుకుంటున్న రైతులు
  •  సబ్సిడీ వేరుశెనగ విత్తనాల కోసం ఎదురుచూపులు
  •  2.11లక్షల హెక్టార్లలో  పంటల సాగు లక్ష్యం
  • జిల్లాలో కురుస్తున్న వర్షాలతో   రైతులు ఖరీఫ్ సాగుపై ఆశలు పెంచుకున్నారు. వాస్తవానికి జూన్ రెండో వారంలో వర్షాలు కురవాల్సి ఉన్నా, ముందస్తుగా వర్షాలు రావడంతో రైతులు ఏరువాక పట్టారు. జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో రైతులు దుక్కి దున్ని పొలం సిద్ధం చేసుకుంటున్నారు.
     
    చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : సబ్సిడీపై ఇచ్చే వేరుశెనగ విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురుస్తున్న వర్షాలు   రైతుల్లో ఆశలు నింపాయి. దీనికి తోడు జూన్ నెలలో నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకనున్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

    27 మండలాల్లో నమోదైన సాధారణ వర్షపాతం :

    ఈ ఏడాది మే నెలలో 61.7 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, అడపాదడపా కురుస్తున్న వర్షాలతో  ఇప్పటివరకు జిల్లాలోని 27 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ములకలచెరువు మండలంలో సాధారణం కంటే ఎక్కవ వర్షపాతం నమోదయింది. సాధారణ వర్షపాతం నమోదైన మండలాల్లో పీటీఎం, పీలేరు, గుర్రంకొండ, కేవీ పల్లె, మదనపల్లె, రామసముద్రం, పులిచెర్ల, సోమల, సదుం, తిరుపతి రూరల్, పాకాల, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, తిరుపతి అర్బన్, రేణిగుంట, నారాయణవనం, వరదయ్యపాళెం, పిచ్చాటూరు, పుత్తూరు, నిండ్ర, పెనుమూరు, చిత్తూరు, గుడిపాల, ఐరాల, పలమనేరు, గంగవరం, వి.కోట ఉన్నాయి. మిగిలిన మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
     
    2.11 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగు...
     
    ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని 2 లక్షల 11 వేల 582 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు వివిధ రకాలైన పంటలు సాగు చేయాల్సి ఉందని వ్యవసాయాధికారులు లెక్కలు కట్టారు. ప్రధానంగా వర్షధార పంటగా వేరుశెనగ లక్షా 36 వేల 479 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయాల్సి ఉంది. తర్వాత ప్రధాన పంటగా చెరకు 27 వేల 915 హెక్టార్లు, మూడో ప్రధాన పంట వరి నీటి ఆధారంగా 16 వేల 655 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉంది. మెట్ట పంటలు జొన్న 556 హెక్టార్లు, సజ్జ 2353 హెక్టార్లు, మొక్కజొన్న 1242 హెక్టార్లు, రాగి 7290 హెక్టార్లు, కందులు 8113 హెక్టార్లు, మినుములు 387 హెక్టార్లు, పెసలు 576 హెక్టార్లు, ఇతర చిరుధాన్యాలు 2984 హెక్టార్లు కాగా, మిరప 118 హెక్టార్లు, ఎర్రగడ్డ 175 హెక్టార్లు, పొగాకు 24 హెక్టార్లు, పత్తి 117 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయాల్సి ఉంది.
     
    అందుబాటులో ఎరువులు
     
    ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులను వ్యవసాయాధికారులు అందుబాటులో ఉంచారు. యూరియా 6 వేల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 10,215 టన్నులు, డీఏపీ 1800 టన్నులు, ఎంవోపీ 800 టన్నులు జిల్లాలో సిద్ధంగా ఉన్నాయి. మరో 5 టన్నుల ఎరువులు జూన్ మొదటి వారంలో వస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
     
    విత్తనకాయల కోసం ఎదురుచూపు
     
    సబ్సిడీ వేరుశెనగ విత్తనకాయల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏటా మే నెలలో వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయాలి. అయితే ఈ ఏడాది ఎన్నికల కారణంగా సబ్సిడీ విత్తనాల పంపిణీని జూన్ నెలకు మార్చారు. ఖరీఫ్‌లో జిల్లాలోని లక్షా 36 వేల 479 హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో రైతులు వేరుశెనగ పంట సాగు చేయాల్సి ఉంది. ఇందుకోసం రైతులకు సబ్సిడీపై ఇచ్చేందుకు 1.05 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనకాయలు అవసరమవుతాయని జిల్లా వ్యవసాయాధికారులు వేసిన అంచనాకు రాష్ట్ర స్థాయి అధికారులు ఆమోదముద్ర వేశారు. విత్తనకాయలు సరఫరా చేసే బాధ్యతలను ఆయిల్‌ఫెడ్, ఏపీ ఆయిల్ ఫెడరేషన్, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీ (కంపెనీ)లకు ప్రభుత్వం అప్పగించింది. కిలో రూ.46 చొప్పున  30 కిలోల బస్తా వేరుశెనగ విత్తనకాయల ధర రూ.1380లుగా నిర్ణయించింది. బస్తా వేరుశెనగ విత్తనకాయలు కొనుగోలు చేసే రైతుకు అతని వ్యక్తిగత ఖాతాలో సబ్సిడీ మొత్తం రూ.450 జమ చేస్తుంది. ఒక్కో రైతుకు బస్తా నుంచి మూడు బస్తాల వరకు విత్తనకాయలు అందజేస్తుంది.
     
    ధర పెంచాలి : ఏజెన్సీల డిమాండ్
     
    వేరుశెనగ విత్తనకాయల ధర కిలో రూ.46 నుంచి రూ.50లకు పెంచాలని నోడల్ ఏజెన్సీలు పట్టుపడుతున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో కిలో వేరుశెనగ విత్తనకాయలపై ప్రభుత్వానికి రూ.4లు అదనపు భారం పడుతుంది. ప్రభుత్వం ఇందుకు అనుమతించలేదు. ఏజెన్సీల వద్ద విత్తనాలు స్టాక్ ఉన్నా ధర పెంచని కారణంగా జిల్లాకు విత్తనకాయలు రాలేదు.
     
    ఖరారుకాని పంపిణీ తేదీ :
     
    సబ్సిడీ విత్తనాల పంపిణీకి సంబంధించిన తేదీ ఇంకా ఖరారుకాలేదు. దీనికి సంబంధించి వ్యవసాయాధికారులు సిద్ధం చేసిన ఫైల్ జిల్లా కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉంది. జూన్ 15వ తేదీ నుంచి వేరుశెనగ విత్తనాలు వేసేందుకు అదును కావడంతో పాటు విత్తనాలు శుభ్రం చేసుకునేందుకు వీలుగా 10 రోజుల ముందే రైతులకు అందించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. జూన్ మొదటి వారంలో (5వ తేదీ) విత్తనకాయలు పంపిణీ చేయాలని సిద్ధమయ్యూరు. గత ఏడాది కూడా జూన్ 5 నుంచి వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేశారు. అయితే ఇప్పటివరకు వేరుశెనగ విత్తనకాయలు జిల్లాకు రాకపోవడంతో వాటి పంపిణీ తేదీ ఖరారులో సందిగ్ధం నెలకొంది.
     

మరిన్ని వార్తలు