రైతుల త్యాగంతో సర్కారు వ్యాపారం

20 Mar, 2019 04:58 IST|Sakshi

రాజధానికి రైతులిచ్చిన భూముల్లో కొత్తగా 8,274 ఎకరాల విక్రయం

ఇందులో వాణిజ్య వ్యాపారానికి 5,020 ఎకరాలు..

మరో 3,254 ఎకరాలు ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ పేరిట విక్రయం

ఇప్పటికే పలు సంస్థలకు కేటాయించిన భూములకు ఇది అదనం

రాజధాని బిజినెస్‌ ప్రణాళిక పేరుతో జీవో 

సింగపూర్‌ కంపెనీల రియల్‌ ఎస్టేట్‌కు1,691 ఎకరాలు కేటాయింపు

సాక్షి, అమరావతి: బహుళ పంటలు పండే, కోట్ల విలువ చేసే తమ పంట పొలాల్ని ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని కోసమని ఆ ప్రాంత రైతులు త్యాగం చేశారు. కన్నతల్లిలాంటి భూమిని త్యాగం చేసి నాలుగేళ్లయినా ఇప్పటివరకు వారికిచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ చంద్రబాబు సర్కారు అమలు చేయలేదు. కానీ రైతుల త్యాగాన్ని వెక్కిరిస్తూ వారిచ్చిన భూముల్లోనే రియల్‌ ఎసేŠట్‌ట్, వాణిజ్య వ్యాపారం చేస్తోంది. కావాల్సిన కార్పొరేట్‌ కంపెనీలు, అస్మదీయులకు కారుచౌకగా ఆ భూముల్నే పప్పుబెల్లాల్లా పంచేస్తోంది. ఇప్పటికే సింగపూర్‌ కంపెనీలకిచ్చిన 1,691 ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు రైతులిచ్చిన భూముల్లో 8,274 ఎకరాల్ని అమ్మేయాలని నిర్ణయించింది. ఇందులో వాణిజ్య వ్యాపారానికి 5,020 ఎకరాల్ని వినియోగించాలని, మరో 3,254 ఎకరాల్ని ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌కు వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు సంస్థలకు కేటాయించిన 1,477 ఎకరాలకు ఇది అదనం. వచ్చే సంవత్సరాల్లో దశలవారీగా ఈ 8,274 ఎకరాల్ని విక్రయించనుంది.  

రైతుల భూములతో పక్కా వ్యాపారం..
రాజధాని పేరుతో మూడు పంటలు పండే బంగారంలాంటి భూముల్ని ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రైతుల నుంచి చంద్రబాబు తీసుకున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా భూములిస్తే.. మరికొంత మందిని వ్యవసాయం ఎలా చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడటమేగాక పొలాల్లోని పంటల్ని తగులపెట్టే దాష్టీకాలకు సర్కారే స్వయంగా పాల్పడడం ద్వారా వారి భూముల్ని లాగేసుకుంది. ఇలా మొత్తం 33 వేల ఎకరాలకుపైగా లాగేసుకున్న సర్కారు ఇప్పుడా భూములతోనే వ్యాపారం మొదలుపెట్టింది. ఒకవైపు సింగపూర్‌ కంపెనీలతో 1,691 ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుండగా, ఇప్పుడు వాణిజ్య వ్యాపారం, ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌కోసం వినియోగం కింద పెద్ద ఎత్తున భూములను విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించింది.

ఇందుకు సంబంధించి గత నెల ఐదవ తేదీన ‘రాజధాని బిజినెస్‌ ప్రణాళిక’ పేరుతో జీవో సైతం జారీ చేసింది. ఇతర అవసరాలన్నీ పోగా సీఆర్‌డీఏ దగ్గర 8,274 ఎకరాలుంటాయని, ఇందులో 3,254 ఎకరాల్ని ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌కోసం రిజర్వ్‌ చేయగా మిగతా 5,020 ఎకరాలను వాణిజ్య వ్యాపారానికి కేటాయిస్తున్నట్లు ఈ జీవోలో స్పష్టం చేశారు. ఇందులో తొలిదశలో 3,709 ఎకరాల్ని, రెండోదశలో 1,311 ఎకరాల్ని వినియోగిస్తామని, తద్వారా భారీ ఎత్తున ఆదాయం ఆర్జిస్తామని, దాంతో రాజధాని నిర్మాణాలను చేపడతామని జీవోలో పేర్కొనడం గమనార్హం. ఇందుకోసం రాజధాని భూముల కేటాయింపు విధానంలోనూ సవరణలు చేశారు.

బాబు మాటల్లో నిజం లేదు..
రాజధాని నిర్మాణం కోసమే సింగపూర్‌ కంపెనీలు వచ్చాయని, అవన్నీ తనను చూసి వచ్చాయంటూ ఇన్ని రోజులుగా సీఎం చంద్రబాబు చేసిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. సీఆర్‌డీఏ, సింగపూర్‌ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌(ఏడీపీ) పూర్తిగా రాజధానిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే చేస్తుందని ఆ కంపెనీ వెబ్‌సైట్‌లో స్పష్టం చేయడం ఇందుకు నిదర్శనం. రాజధానిలో భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విక్రయం ద్వారా లేదా లీజు ద్వారా చేయనున్నట్లు ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్ల నిర్మాణంతోపాటు గృహేతర భవనాలు, ప్లాట్లు వేసి విక్రయిస్తున్నట్టు అందులో స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు