గ‘లీజు’ పనులకు బ్రేక్‌!

28 Nov, 2019 10:58 IST|Sakshi
టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం చదును చేస్తున్న ఎన్నెస్పీ స్థలం (ఫైల్‌)

ఉడకని టీడీపీ నేతల పప్పులు

అప్పనంగా రూ.25 కోట్ల భూమిని కాజేసేందుకు నాడు కుయుక్తి

లీజు పేరుతో 1.96 ఎకరాల ఎన్నెస్పీ స్థలాన్ని నొక్కేసే యత్నం

పార్టీ కార్యాలయ నిర్మాణం పేరుతో ఒంగోలు నగరంలో భారీ భూ స్కామ్‌

గత ప్రభుత్వం ఇచ్చిన జీఓను రద్దు చేస్తూ వైఎస్సార్‌ సీపీ సర్కారు నిర్ణయం

తదుపరి చర్యలపై  జిల్లా కలెక్టర్‌కు ఆదేశం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం పేరుతో ఎన్‌ఎస్‌పీ స్థలాన్ని కాజేసేందుకు టీడీపీ నేతలు చేసిన కుట్రను వైఎస్సార్‌ ప్రభుత్వం తిప్పి కొట్టింది. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని లీజు పేరుతో అప్పనంగా కొట్టేసేందుకు పన్నిన పన్నాగాన్ని ప్రభుత్వం తిప్పికొట్టింది. తమ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ జిల్లా నేతలు రూ.25 కోట్ల విలువ చేసే ఎన్‌ఎస్‌పీ స్థలాన్ని కాజేసేందుకు చేసిన ప్రయత్నానికి ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. గత ఏడాది అక్టోబర్‌ 11వ తేదీన అప్పటి ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి చ్చిన 1.96 ఎకరాల స్థలానికి ఇచ్చిన జీఓ ఎంఎస్‌ నెంః 514ను రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఒంగోలు నగరం నడిబొడ్డున నెల్లూరు– కర్నూలు హైవే పక్కన సర్వే నంబర్‌ 68/8లో నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ (ఎన్‌ఎస్‌పీ)కి చెందిన 1. 96 ఎకరాల స్థలం ఉంది. దీని మార్కెట్‌ విలువ రూ. 25 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ స్థలానికి తూర్పున ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ సీఈ కార్యాలయం, పడమర వైపున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టడీ సెంటర్, దక్షిణం వైపున కర్నూలు– నెల్లూరు హైవే ఉన్నాయి. పక్కనే ఉన్న నీటిపారుదల శాఖ సర్కిల్‌ కార్యాలయం శిథిలావస్థకు చేరి చిన్నపాటి వర్షానికే కార్యాలయ ఆవరణ తటాకాన్ని తలపిస్తోంది. దీంతో నూతన కార్యాలయ భవన నిర్మాణానికి 2016 మే నెలలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పట్లో ఈ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రూ. 5.90 కోట్ల నిధులను మంజూరు చేసింది. 2016 ఆగస్టు 20వ తేదీన టెండర్‌లు కూడా పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌. గంగయ్య అండ్‌ కంపెనీ టెండర్‌ను దక్కించుకుని 2017 మార్చి 3న అగ్రిమెంట్‌ కూడా చేసి పనులు మొదలుపెట్టేందుకు సమాయత్తమయ్యారు. పనులకు శంకుస్థాపన చేసేందుకు పునాదులు కూడా తవ్వారు.


స్థలంపై తమ్ముళ్ల కన్ను..
ఈ స్థలంపై అప్పట్లో టీడీపీ జిల్లా నేతల కన్ను పడింది. సదరు స్థలాన్ని పార్టీ జిల్లా కార్యాలయానికి కావాలంటూ అక్కడ జరుగుతున్న నీటిపారుదల శాఖ సర్కిల్‌ కార్యాలయ నిర్మాణ పనులను నిలిపి వేయించారు. అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో అధికారులు సైతం చేసేది లేక మిన్నకుండిపోయారు. ఆ తరువాత టీడీపీ నేతలు చెప్పినట్లుగా 1.96 ఎకరాల స్థలాన్ని ఏడాదికి రూ.1960 చొప్పున అద్దె చెల్లించేలా 33 ఏళ్ళపాటు లీజుకు ఇస్తూ జీఓ జారీ చేశారు. అప్పటి నుంచి ఈ స్థలం టీడీపీ నేతల ఆధీనంలో ఉన్నప్పటికీ ఏడాది దాటినా అందులో పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. దీనికితోడు సదరు స్థలం ఎన్‌ఎస్‌పీ శాఖకు అవసరమైన నేపథ్యంలో టీడీపీ కార్యాలయానికి గతంలో ఇచ్చిన జీఓ ఎంఎస్‌ నం 514ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఛీఫ్‌ కమిషనర్, జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు