రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం

3 Apr, 2015 03:58 IST|Sakshi

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి
సాగునీటి కోసం రైతుల రాస్తారోకో

 
నకరికల్లు : ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేట ముంచుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సాగునీటికోసం రైతులతో కలసి మండలంలోని అడ్డరోడ్డు వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ రుణమాఫీ చేశామని చెబుతున్న చంద్రబాబు ఎక్కడ చేశారో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. అభివృద్ధి పేరిట రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప మరో ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. కొత్తగా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాల్సింది పోయి గతంలో అవినీతి జరిగింది.. ఎంక్వయిరీ చేస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

పంటలు ఎండిపోయి రైతులు అల్లాడుతుంటే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పంటలకు వేలకువేలు పెట్టుబడులు పెట్టి సాగునీరు లేక ఎండిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని ఆవేదనవ్యక్తంచేశారు. నోటికాడికి వచ్చిన పంట చేజారిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అవగాహన రాహిత్యం వలన వేలాది ఎకరాల్లో పంట నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రుణమాఫీ చేస్తారని ఓట్లేస్తే రైతుల కొంపముంచుతున్నారని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తపా ఎద్దేవా చేశారు.

అన్నదాతను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి  లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ పంటపొలాలు కళ్లముందే ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. రైతుల పట్ల వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. వెంటనే సాగునీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి చేస్తామని హామీలపై హామీలు ఇచ్చిన చంద్రబాబు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

పురుగుమందు డబ్బాలతో నిరసన తెలిపిన మహిళారైతులు

వేలకు వేలు పెట్టుబడులు పెట్టి కౌలు చెల్లించి సాగుచేసుకుంటుంటే సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయంటూ మహిళారైతులు పురుగు మందు డబ్బాలతో నిరసన వ్యక్తంచేశారు. వెంటనే సాగునీరివ్వకుంటే ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు రాస్తారోకోను విరమించాలని కోరడంతో తమ ఆవేదనను అర్థం చేసుకోవాలంటూ రైతులు విన్నవించారు. ఓ మహిళ పురుగుమందు డబ్బా చేతబట్టి ఇది తాగాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీరుమున్నీరవుతుండగా ఎమ్మెల్యే ముస్తపా ఆమెను వారించి ఓదార్చారు.

సాగునీరిచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. ఓ దశలో మాకు మీరే న్యాయం చేయాలి.. అంటూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కారు వద్దకు మహిళారైతులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఆయన ఎదుట తమగోడు వెలిబుచ్చారు. రైతుల ఆవేదనను గుర్తించిన గోపిరెడ్డి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం పొలాల్లోకి వెళ్లి పంటలు పరిశీలించారు.కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు రమావత్‌సామ్రాజ్యంబాయి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు భవనం రాఘవరెడ్డి, నకరికల్లు సొసైటీ అధ్యక్షుడు దొండే టి కోటిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు