ఎన్నో ఏళ్ల కల.. సాకారం దిశగా..!

23 Oct, 2019 07:00 IST|Sakshi
వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి  స్థలాలను పరిశీలిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ

వైద్య కళాశాల ఏర్పాటుపై త్వరలో ప్రభుత్వ నిర్ణయం 

నగరంలో స్థల పరిశీలన చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ 

చెల్లూరు, జిల్లా కేంద్రాస్పత్రి ప్రాంతాల్లో అవకాశాలపై సమీక్ష 

కేంద్రాస్పత్రి, పోలీస్, దేవదాయ భూములు 35 ఎకరాలు 

రాష్ట్రస్థాయి అధికారులతో కూడా చర్చిస్తామన్న మంత్రి  

వైద్యకళాశాల... విజయనగర వాసుల ఎన్నో ఏళ్ల కల. అది ఇప్పుడు సాకారం కాబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పయాత్ర సాక్షిగా నాడు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలవుతున్నాయి. అందులోభాగంగా విజయనగరంలో వైద్య కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. రాష్ట్ర మంత్రి బొత్ససత్యనారాయణ దీనికోసం ఇప్పటికే స్థల పరిశీలన చేశారు. రాష్ట్రస్థాయి అధికారులతో చర్చించాక తదుపరి నిర్ణ యం వెల్లడయ్యే అవకాశం ఉంది.  

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అబద్దపు హామీలా గాకుండా ప్రస్తుత ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే రూ.66 కోట్లు నిధులు కేటాయించింది. అక్కడితో ఆగిపోకుండా జిల్లాకు చెందిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చర్యలు వేగం పుంజుకున్నాయి. కళాశాలకు అవసరమైన స్థలాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా అన్వేషిస్తున్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలపై జిల్లా ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షలు జరుపుతున్నారు.  

స్థల పరిశీలన 
జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించేందుకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం, గజపతినగరం ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో కలిసి నగరంలో మంగళవారం విస్తృతం గా పర్యటించారు. చెల్లూరు, జిల్లా కేంద్రాసుపత్రి ప్రాంతాల్లో స్థలాలను గుర్తించారు. వైద్య కళాశాల ఏర్పాటుకు 30 నుంచి 40 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. కేంద్రాస్పత్రిలో 16 ఎకరాల స్థలం ఉంది.

పోలీస్‌ బ్యారెక్స్‌లో ఉన్న భవనాలు ఐదు ఎకరాల్లో ఉన్నాయి. వాటిని అ నుకుని మరో ఐదు  ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఇంకా ఉడాకాలనీని ఆనుకుని దేవదాయశాఖకు చెందిన కొంత భూమి ఉంది. మొత్తంగా 35 ఎకరాల వరకు భూసేకరణ ఇక్కడ సాధ్యవుతుం దని మంత్రి గుర్తించారు. కేంద్రాస్పత్రిని అనుకు ని ఉన్న పోలీస్‌ బ్యారెక్స్‌ స్థలాన్ని వైద్య కళాశాల కు ఇవ్వాలని, దానికి బదులుగా పోలీస్‌శాఖకు వేరేచోట స్థలం ఇప్పిస్తామని ఎస్పీని మంత్రి అడిగారు. అందుకోసం పోలీస్‌ ఉన్నత అధికారులతో కూడా తాను మాట్లాడతానన్నారు.  

అధికారులతో మంత్రి సమీక్ష: 
అంతకుముందు కేంద్రాస్పత్రిని అనుకుని వైద్య కళాశాల ఏర్పాటు చేయాలా, హైవేపై ఉన్న చె ల్లూరు వద్ద ఏర్పాటు చేయాలా అన్నదానిపై కలెక్టర్‌ కార్యాలయంలో, పోలీస్‌ అతిధి గృహాంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవరహర్‌లాల్, ఎస్పీ రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, ఇతర అధికారులతో మంత్రి చర్చించారు. మ్యాప్‌ ఆధారంగా వైద్య కళాశాల ఏర్పాటుకోసం గుర్తించిన స్థలాలపై మంత్రికి జిల్లా కలెక్టర్‌ వివరించారు. దేవదాయ శాఖ స్థలం సేకరించడానికి అనుసరించాల్సిన ప్రక్రియ గురించి మంత్రి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రాస్పత్రికి ఆనుకుని ఉన్న స్థలంలో ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని కలెక్టర్‌ ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.


పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీతో చర్చిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ

నిబంధనల ప్రకారం అక్కడ స్థలం సరిపోతుందా? అని మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఆస్పత్రికి సంబంధించి స్థలంతోపాటు దేవదాయశాఖకు చెందిన 5 ఎకరాలు, పోలీసు డిపార్టుమెంట్‌కు గతంలో ఇచ్చిన స్థలంలో 5 ఎకరాలు కలిపితే 35 ఎకరాల వరకు ఉంటుందని వివరించారు. ప్రభుత్వాన్ని ఈ మేరకు ఒప్పిస్తే సరిపోతుందన్నారు. పోలీసుశాఖకు ఇచ్చిన స్థలంలో పోలీసు వసతిగృహాలు ఉండేవని, వాటి మాటేమిటని మంత్రి ప్రశ్నించగా అవి శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని తొలగించవచ్చన్నారు. ఇందుకు స్పందించిన మంత్రి అంగీకారం తెలిపి స్థల పరిశీలన చేశారు.  

త్వరలోనే నిర్ణయం 
జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలను నగరంలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే అంశంపై త్వరలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. వైద్య కళాశాల ఏర్పాటుకు చెల్లూరు సమీపంలోనూ, జిల్లా కేంద్రాస్పత్రికి అనుబంధంగా ఉన్న స్థలాలను పరిశీలించాం. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే బోధనాస్పత్రిగా కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు 40 ఎకరాల స్థలం అవసరమవుతుండగా ప్రస్తుతం 35 ఎకరాలు గుర్తించాం. కళాశాలను ఒకటిన్నర సంవత్సరంలోగా ప్రారంభించవచ్చని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై వారితో మాట్లాడి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. 
– బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి   

మరిన్ని వార్తలు