రెండు లక్షల మందికి ‘రచ్చబండ’ ఫలాలు

8 Nov, 2013 00:04 IST|Sakshi

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
 ఈ నెల 11 నుంచి జరగ నున్న మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో దాదాపు 2 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులను జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. అర్హులను ఇదివరకే గుర్తించామని, తాజాగా రచ్చబండ కార్యక్రమంలో వీటిని పంపిణీ చేస్తామని చెప్పారు. గురువారం జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి మండలాన్ని యూనిట్‌గా పరిగణలోకి తీసుకొని రచ్చబండ నిర్వహిస్తున్నామని, దీంతో కేవలం మండల కేంద్రాల్లోనే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎంపికైన లబ్ధిదారులను మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రచ్చబండ మొదటి, రెండో  విడతల్లో వచ్చిన అర్జీలను పరిశీలించి.. అర్హులుగా తేలినవారికి తాజాగా ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు.
 
 స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి వారి షెడ్యూల్‌కు అనుగుణంగా మండల కేంద్రాల్లో రచ్చబండ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈసారి రచ్చబండ కేవలం గతంలో గుర్తించిన లబ్ధిదారులకు పథకాల వితరణకు మాత్రమే ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో కేవలం లబ్ధిదారుల వరకే రచ్చబండను పరిమితం చేసినట్లు స్పష్టంచేశారు. కొత్త రేషన్‌కార్డుదారులు డిసెంబర్ నెల నుంచి సరుకులు పొందవచ్చని, వీరికి తొలుత కూపన్లను జారీ చేస్తామని, ఏడు నెలల తర్వాత కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. పింఛన్లను వచ్చే నెల నుంచి అమలు చేస్తామని, అక్టోబర్, నవంబ ర్ నెలకు సంబంధించిన పింఛన్ కూడా జమ చేస్తామని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల యూనిట్ విలువను ప్రభుత్వం పెంచిందని, ఎస్సీలకు రూ. లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షలను విడుదల చేయనున్నట్లు చెప్పారు.  20 నుంచి 29 శాతం వికలత్వం ఉన్నవారికీ నెలకు రూ.200 పింఛన్ వర్తింపజే స్తామన్నారు.
 
   ప్రత్యేక సదరమ్ శిబిరాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ కలలు పథకం కింద జిల్లావ్యాప్తంగా కొత్తగా మంజూరైన ఆరు బాలికల హాస్టళ్లు, 20 కమ్యూనిటీ హాళ్లు, ఒక ఇంటెగ్రేటెడ్ హాస్టల్‌కు శంకుస్థాపనలు చేయనున్నట్లు శ్రీధర్ తెలిపారు. అలాగే 50 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం కింద ఎస్సీలకు రూ.6.40 కోట్లు, ఎస్టీ కుటుంబాలకు రూ.3.89 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆయన వివరించారు.
 
 నియోజకవర్గాలవారీగాసమావేశాలు నిర్వహించాలి
 మూడోవిడత రచ్చబండ కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాల్సిందిగా కలెక్టర్ బి.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయాలని సూచించారు. రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లపై గురువారం జిల్లాపరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్షించారు. నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో రేషన్ కూపన్లు, పింఛన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి మంజూరు పత్రాలు అందజేయాలన్నారు.
 
 ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద మంజూరైన వసతిగృహలు, కమ్యూనిటీ గదులు, హాస్టల్ భవనాల శంకుస్థాపనతో పాటు, రాయితీ పథకాల కింద లబ్ధిదారులకు ఫలాలు అందజేయనున్నట్లు చెప్పారు.  కాగా రేషన్ కార్డుల్లో పేర్లు తప్పుగా ప్రచురితం కావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ప్రస్తావించగా  కలెక్టర్ స్పందిస్తూ సవరణ నిమిత్తం ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించిందన్నారు. గత రచ్చబండలో చాలా దరఖాస్తులకే మోక్షం లేదంటూ తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయగా, మూడోవిడత రచ్చబండ కార్యక్రమంలో వారికి మంజూరు ఇస్తామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం, రాజిరెడ్డి, ప్రకాష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు