చెవిలో పూలు

24 Feb, 2016 02:43 IST|Sakshi
చెవిలో పూలు

అడ్డదారిలో గ్రేడ్లు
* ప్రభుత్వ శాఖల్లో అధికారుల లీలలు
* సమస్యలు పక్కన పెట్టి రికార్డుల సృష్టి
* ప్రజా దరఖాస్తుల దారి మళ్లింపు
* ఒక్కసారిగా ‘ఏ’ గ్రేడ్‌కు ఎగబాకిన వైనం  

 గుంటూరు ఈస్ట్  : జిల్లా యంత్రాంగం వివిధ శాఖల అధికారుల పనితీరుపై నిర్ణయించిన గ్రేడింగ్ విధానం నిరు పేదలకు కష్టాలను మిగుల్చుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు తమ పనితీరు మెరుగ్గా ఉందని పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను తక్కువ చేసి ఉన్నతాధికారులకు  చూపిస్తున్నారు.

సాంకేతిక సమస్యలు చూపి ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి తప్పుడు వివరాలతో కూడిన నివేదికను సోమవారం విజయవాడలో జరిగిన ముఖ్యమంత్రి సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు అందించారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.
 
అమల్లోకి గ్రేడింగ్ విధానం..
మూడు నెలల క్రితం ఉద్యోగులు, అధికారుల పనితీరును పరిశీలించి గ్రేడింగ్ ఇచ్చే విధానాన్ని జిల్లా యంత్రాంగం అమలులోకి తీసుకువచ్చింది. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో జిల్లా వెనుకబడి ఉండడంతో ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లాకు ‘సి’గ్రేడ్‌ను నిర్ణయించింది. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఆన్‌లైన్‌లో ఆయా ప్రభుత్వశాఖల పనితీరును పరిశీలిస్తోంది. ప్రతినెలా ఆయా జిల్లాలకు గ్రేడింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో జనవరి నెలలో సమస్యల పరిష్కారంపై పరిశీలన చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లాకు  ‘సి’ గ్రేడ్ ఇచ్చింది.

దీంతో జిల్లా యంత్రాంగం అందుకు కారణమైన 10 మంది ఎంఆర్‌ఓలకు మెమోలు ఇచ్చి, అక్షింతలు వేసింది.  ఈ గ్రేడ్‌ల గండం నుంచి బయటపడేందుకు అడ్డదారిని ఆశ్రయించారు. జనవరి నెలలో మీసేవ ద్వారా వచ్చిన గడువు దాటిన దరఖాస్తులు 84 వేలు ఉంటే,  ఒక్క నెలలోనే  15వేలు పరిష్కరించి 69 వేలకు చేరినట్లు చూపారు. జన్మభూమి, మీకోసం ద్వారా వచ్చి గడువు దాటిన దరఖాస్తులు ఒక నెలలోనే సుమారు 40 వేల వరకు పరిష్కరించినట్లు చూపారు. నాలుగు నెలలకు కూడా పరిష్కారం కానివి జనవరి నెలలోనే పరిష్కారం అయినట్టు అధికారులు చూపారు.
 
అసలేం జరిగిందంటే..
గడువు దాటినవి, గడువులోపు ఉన్న దరఖాస్తులు జిల్లాలో సుమారు లక్షన్నరకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ గండం నుంచి బయటపడేందుకు జిల్లా వ్యాప్తంగా మీసేవ సెంటర్‌లలో వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సర్వర్ పనిచేయడం లేదంటూ తీసుకోవడం లేదు. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరగకుండా చేశారు. తీసుకున్న దరఖాస్తులను పరిష్కరించే క్రమంలో అవసరమైన డాక్యుమెంట్లు, ఇతర వివరాలు లేవంటూ వాటిని ఆన్‌లైన్ నుంచి తిరస్కరించారు. అలాగే సాంకేతిక ఇబ్బందులు చూపించి భవిష్యత్తులో పరిష్కరిస్తామంటూ రాజీమార్గంలో ఒప్పించి ఆన్‌లైన్ నుంచి తొలగించారు.

మొత్తం మీద జనవరి నెలలో జిల్లాలో 90 శాతం తహశీల్దారు కార్యాలయాలు సి గ్రేడ్‌లో ఉండగా, ఫిబ్రవరి నాటికి 90 శాతం ఏ గ్రేడ్‌కు చేరినట్లు చూపించారు. సమస్యలను పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తొలగించే అంశం పక్కన బెట్టి రికార్డు పరంగా సంఖ్యను తగ్గించుకోవడానికే అధికారులు శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ విషయమై కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, అటువంటి అక్రమ మార్గాలు అనుసరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు