స్వైన్ ఫ్లూ, సార్స్‌ కన్నా ప్రమాదమేమి కాదు

16 Mar, 2020 20:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కరోనా వైరస్‌ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. స్వైన్ ఫ్లూ, సార్స్‌ కన్నా ఇది ప్రమాదకరమైన వ్యాధి కాదని అన్నారు. సోమవారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య నిపుణులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పతి సూపరిండెంట్‌ నాంచారయ్య మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వల్ల బాధితుడికి తొలుత జ్వరం లక్షణాలు వస్తాయని చెప్పారు. పేషెంట్‌కు కరోనా వల్ల జ్వరం పెరిగితే దాని ప్రభావం మెదడుపై ఉంటుందన్నారు. అందుకే ముందుగా జ్వరం నియంత్రించేందుకు పారాసిటమాల్ వాడుతూ.. తర్వాత యాంటీబయాటిక్‌ వాడతామని వివరించారు. ఈ వైరస్‌ నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మందులను సూచించలేదని గుర్తుచేశారు. వ్యాధి లక్షణాలను బట్టి నిపుణులైన వైద్యులు మందులను వాడుతున్నారని చెప్పారు.

పారాసిటమాల్‌ అనేది చాలా సేఫ్‌ డ్రగ్‌ అని.. అది కిడ్నీ మీద ఎటువంటి ప్రభావం చూపించదని తెలిపారు. అంతకు మించిన డ్రగ్స్‌ వాడితే అవి కిడ్నీలపై ప్రభావం చూపుతాయని అన్నారు. జ్వరానికి పారాసిటమాల్‌ సంజీవనిలా ఉపయోగపడుతుందని చెప్పారు. కరోనా వల్ల ప్రారంభమయ్యే జ్వరానికి కూడా ఇదే మందు చక్కగా పనిచేస్తుందన్నారు. కరోనా వైరస్‌ వల్ల ఏపీలో భయానక పరిస్థితులు లేవని వెల్లడించారు. ఇటలీ, దుబాయ్‌, మస్కట్‌ నుంచి విజయవాడ వచ్చినవారికి పరీక్షలు చేశామని తెలిపారు. కాకినాడ, ఒంగోలు నుంచి కరోనా పరీక్షల కోసం విజయవాడలోని వైరాలజీ ల్యాబ్‌కు శాంపిళ్లు వస్తున్నాయన్నారు. ఇక్కడ ముందుగా మూడు గంటల పరీక్షలో వైరస్‌ను గుర్తిస్తామని.. దానిని నిర్ధారించడానికి మరో మూడు గంటల సమయం పడుతుందని వివరించారు. విదేశాల నుంచి వచ్చిన 40 మందికి విజయవాడలో పరీక్షలు చేశామని తెలిపారు. వీరిలో ఎవరికీ పాజిటివ్‌ రాకపోవడంతో వారిని ఇళ్లకు పంపించామన్నారు. ఇంటివద్ద ఉన్న పేషెంట్‌ను ప్రతి రోజు ఆరోగ్య కార్యకర్తలు పరీక్షిస్తారని చెప్పారు. విజయవాడకు ఇప్పటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా రాలేదని స్పష్టం చేశారు. 

ప్రభుత్వం పరంగా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. విజయవాడ ఆస్పత్రిలో కరోనా బాధితులకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. వ్యాధి లక్షణాల లేకపోయినా అనుమానితులు ఇల్లు కదిలి వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నట్టు చెప్పారు. 28 రోజులపాటు జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలో ఇంటి వద్దే ఉండేలా చూస్తున్నామని వివరించారు. యాభై ఏళ్లు పైబడినవారికి, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారికి, మధుమేహం ఉన్నవారికి కరోనా వైరస్‌ సోకడం ప్రమాదమని అన్నారు. మిగిలిన వారికి ఈ వైరస్‌ వల్ల అంతగా ప్రమాదం లేదని తెలిపారు. వైరస్‌ బాధితులకు పారాసిటామల్‌, యాంటీబయాటిక్‌ ఇవ్వడం వల్ల తీవ్రతను తగ్గించవచ్చని అన్నారు. విజయవాడ ఐసోలేషన్‌ వార్డులో 46 బెడ్లతో అత్యాధునిక ఐసీయూలను ఏర్పాటు ఏశామని అన్నారు. 

మరిన్ని వార్తలు