‘నిర్భయ’కు అభయమేదీ!

16 Dec, 2013 02:24 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకొచ్చినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఆ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. చట్టాలు ఎన్ని ఉన్నా వాటిని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల మహిళలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి నెలకొంది. మిస్టరీగా మారిన మహిళల హత్యలు ఫిబ్రవరి 21న రాయచోటి సమీపంలో నాగమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఇప్పటికీ ఆ ఘటన మిస్టరీగానే నిలిచిపోయింది. ఫిబ్రవరి 26న ప్రొద్దుటూరు శ్రీరామ్‌నగర్‌కు చెందిన భీమునిపల్లె లక్ష్మిదేవి హత్యకు గురైంది. ఏప్రిల్ 30న ముద్దనూరు వద్ద శారద అనే మహిళను కిరాతకంగా హత్య చేసి ఆపై తగులబెట్టారు.
 
 ఏప్రిల్ 20న ప్రొద్దుటూరు శ్రీరామ్‌నగర్‌కు చెందిన మేరువ శారద హత్యకు గురైంది. మే 23న ప్రొద్దుటూరుకు చెందిన మరో మహిళ జి.లక్ష్మిదేవిని హత్య చేసి  కిరాతకంగా కాల్చివేశారు. జూన్ 3న  ప్రొద్దుటూరుకు చెందిన గుంటుముక్కల రంగమ్మ హత్యకు గురికాగా, ఇప్పటివరకు ఆ కేసులో అతీగతీ లేదు. అలాగే జులై 29న ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధికి చెందిన తాటిమాకుల రాధాదేవిని ఇంట్లో ఉండగా పట్టపగలు కిరాతకంగా హతమార్చారు. ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి. ఈ కేసులు పోలీసుల పనితీరుకు సవాలుగా నిలుస్తున్నా ఛేదించడంలో విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
 
   పరువు హత్యల్లోనూ అదే తీరు..
 చాపాడు మండలం నెరవాడకు చెందిన విద్యాధికురాలు లలితారాణిని పరువు నేపథ్యంలో హత్యకు గురయ్యారు. ఈ హత్యను సైతం పోలీసులు నీరుగార్చారనే అపవాదు ఇప్పటికీ ఉంది. ఆ ఘటన మరిచిపోకమునుపే సిద్దవటం మండలం కడపపాయపల్లెకు చెందిన కొల్లి శారద పరువు హత్య వెలుగు చూసింది. క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన పోలీసు యంత్రాంగం ఆషామాషీగా వ్యవహరిస్తుండటంతో శారద హత్య మరుగున పడిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పట్టువదలని రీతిలో ఆమె బంధువులు వెంటాడంతో ఉన్నతాధికారుల జోక్యం కారణంగా పరువు హత్య వెలుగులోకి రావడం విశేషం. ఓవైపు మహిళలకు అండగా అనేక చట్టాలున్నా అమలు పరిచే యంత్రాంగం ఆ స్థాయిలో వ్యవహరించకపోవంతో ఇప్పటికీ మహిళలపై హత్యాకాండ కొనసాగుతోందని పలువురు వాపోతున్నారు.
 

>
మరిన్ని వార్తలు