వీధుల్లో నుంచి విధుల్లోకి..

20 Feb, 2014 02:37 IST|Sakshi

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఉద్యోగులు వీధులను వదిలి విధులకు హాజరు కానున్నారు. 15 రోజుల నిరవధిక సమ్మె అనంతరం గురువారం నుంచి యథావిధిగా కార్యాలయాలకు చేరుకోనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లిన విషయం విదితమే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ గత ఏడాది ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు 66 రోజులపాటు ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగిన విషయం విదితమే.

తెలంగాణ  రాష్ట్ర ప్రక్రియ వేగవంతం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మరోమారు సమ్మెబాట పట్టారు. అటెండర్ నుంచి గజిటెడ్ ఆఫీసర్ వరకు ఉద్యోగులు సమ్మె చేశారు. అదే సమయంలో వీధుల్లోకి వచ్చి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. విద్యార్థులతో కలిసి వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ  బిల్లు చర్చకు వస్తుండటంతో ఉద్యోగులంతా ఢిల్లీ బాట పట్టారు.

సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు వేలాదిగా ఢిల్లీ చేరుకొని అక్కడ మహా ధర్నా నిర్వహించారు. పార్లమెంటులో ఏకపక్షంగా తెలంగాణ  బిల్లును ఆమోదించడంతో ఉద్యోగులు తిరుగుముఖం పట్టారు. రెండోమారు నిర్వహించిన నిరవధిక సమ్మెలో ఏపీఎన్‌జీఓ అసోసియేషన్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ కాన్ఫడరేషన్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంతో గురువారం నుంచి ఎన్‌జీఓలు, రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరుకానున్నారు. వారి రాకతో ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి కళకళలాడనున్నాయి.

 ఉద్యమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు:
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు రెండో మారు నిరవధిక సమ్మెకి దిగిన ఉద్యోగులకు ఏపీఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యోగులుగా తమవంతు పోరాటం నిర్వహించామని, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కూడా అంతే పోరాటాన్ని నిర్వహించి ఉంటే విభజన జరిగేది కాదన్నారు.

మరిన్ని వార్తలు