ఎల్‌ఆర్‌‘ఎస్‌’ !

1 Dec, 2019 11:31 IST|Sakshi
భీమవరం పట్టణ ఏరియల్‌ వ్యూ (ఫైల్‌)

లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు కసరత్తు 

ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం 

విధి, విధానాలపై  అధికారుల దృష్టి 

త్వరలో వెలువడనున్న ఉత్తర్వులు 

జిల్లాకు రూ.100 కోట్లకుపైగా ఆదాయం  

పురపాలక సంఘాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న  అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌)ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు మంత్రివర్గం సైతం ఆమోదించింది. 

కొవ్వూరు: ఎల్‌.ఆర్‌.ఎస్‌. అమలుకు విధి, విధానాల ఖరారుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికారులు ముమ్మరంగా కుస్తీ చేస్తున్నారు. రెండు, మూడు వారాల్లో ఉత్తర్వులు సైతం వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న లేవుట్‌లకు మోక్షం లభించే అవకాశం ఏర్పడింది. ఈ పథకం ద్వారా జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ, ఎనిమిది పురపాలక సంఘాలకు సుమారు రూ.100 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. 1997లో ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రారంభమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మరోసారి 2007లో అనుమతి ఇచ్చారు. 2012 వరకు ఈ పథకం కొనసాగింది. అనంతరం వచ్చిన ప్రభుత్వా లు ఎల్‌ఆర్‌ఎస్‌ను పట్టించుకోలేదు. మళ్లీ ఇన్నేళ్లకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై దృష్టి సారించారు.

పట్టణాల్లో మరింతగా విస్తరించి..  
జిల్లావ్యాప్తంగా 2015 నాటికి 38 అనధికారిక లేఅవుట్లను అధికారులు గుర్తించారు. వీటిలో భీమవరంలో 19, తాడేపల్లిగూడెంలో ఏడు, జంగారెడ్డిగూడెంలో మూడు, నిడదవోలులో తొమ్మిది లేఅవుట్లు ఉన్నాయి. కొవ్వూరు, నరసాపురం, తణుకు, పాలకొల్లు, ఏలూరులో నిల్‌ చూపించారు. ఇదిలా ఉండగా 2014 నాటికి ఏలూరు నగరపాలక సంస్థ ఊడా పరిధిలో రూరల్‌ ప్రాంతాల్లో 162 అనధికార లేఅవుట్లను గుర్తించారు. అయితే నాలుగైదేళ్లలో జిల్లావ్యాప్తంగా పట్టణాలు విస్తరించాయి. జనాభా కూడా పెరిగింది. రియల్‌ వ్యాపారం ఆ స్థాయిలోనే విస్తరించింది. ఈ నేపథ్యంలో పల్లెల్లో సైతం లేఅవుట్లు వెలిశాయి. వీటిలో అనధికారిక లేఅవుట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ఇటువంటి లేఅవుట్లన్నీ క్రమబద్ధీకరించుకునే అవకాశం వచ్చింది. దీనిద్వారా ఆయా పురపాలక సంఘాలకు భారీగా ఆదాయం సమకూరనుంది. 2015 నాటికి ఉన్న లెక్కల ప్రకారం చూస్తే రూ.40 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం, అయితే ప్రస్తుతం పెరిగిన లేఅవుట్లను కలుపుకుంటే ఆదాయం రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు ద్వారా సుమారు రూ.2 వేల కోట్ల వరకు పురపాలక సంఘాలకు ఆదాయం సమకూరవచ్చని అంచనా వేస్తున్నారు.

 గైడ్‌లైన్స్‌పై అధికారుల కసరత్తు.. 
ఎల్‌ఆర్‌ఎస్‌ విధివిధానాల ఖరారుపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ కంట్రీప్లానింగ్‌ అధికారులు ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 మంది రియల్టర్ల వివరా లు సేకరించారు. ఆయా పురపాలక సంఘాల పరిధిలో ఉండే రియల్టర్లు, ప్లాట్లు విక్రయించే వ్యక్తులు, మధ్యవర్తులు, రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీ ప్రతిని«ధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి ఫోన్‌ నంబర్లు, వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎల్‌ఆర్‌ఎస్‌ అమలులో తలెత్తే ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. గైడ్‌లైన్స్‌ ఖరారులో వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మునిసిపాలిటీల్లో వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం నూతనంగా నియమించిన ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులైజేషన్‌ కార్యదర్శులకు సైతం ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో మినహా మిగిలిన అన్ని పురపాలక సంఘాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించారు. ముందుగా ఆయా వార్డు సచివాలయ ఉద్యోగుల పరిధిలో మ్యాప్‌లు తయారు చేయిస్తున్నారు. 

త్వరలో ఎల్‌ఆర్‌ఎస్‌ జీఓ 
పురపాలక సంఘాల్లో అనధికారిక లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రియల్టర్స్‌ వివరాలు, ఫోన్‌ నంబర్లను అధికారులు సేకరిస్తున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు సైతం తీసుకుంటున్నారు. వచ్చే నెలలో ఎల్‌ఆర్‌ఎస్‌ జీఓ విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. పురపాలక సంఘాల వారీగా ఉన్న అక్రమ లేవుట్‌ల వివరాలు సేకరిస్తున్నాం. ఈ మేరకు సచివాలయ పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బందికి అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నాం. 2015 నాటికి 38 అనధికారిక లేఅవుట్లు ఉన్నట్టు గుర్తించాం. ఈ సంఖ్య రెండింతలు పెరిగే అవకాశం ఉంది.    – వైపీ రంగనాయకులు, పట్టణ ప్రణాళిక విభాగం ఉపసంచాలకులు   

మరిన్ని వార్తలు