రూ.15 కోట్లు ల్యాప్స్!

26 Feb, 2016 09:34 IST|Sakshi
వ్యవసాయ అనుబంధ రంగాల్లో నిధుల వినియోగంపై దృష్టిపెట్టని అధికారులు
నెలరోజుల్లో ముగియనున్నఆర్థిక సంవత్సరం 
లక్ష్యసాధనలో వెనుకబడిన వ్యవసాయశాఖ 
సింగిల్‌డిజిట్‌లోనే వృద్ధిరేటు!
 
 
వ్యవసాయ అనుబంధ శాఖల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటిని ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వినియోగించాలి. అంటే మార్చినెల చివరిలోగా అన్నమాట. ఈ రోజు నుంచి లెక్కవేస్తే సరిగ్గా 34 రోజులు ఉంది. ఈ విషయం తెలిసీ కూడా అధికారుల నిధుల వినియోగంపై దృష్టిసారించలేదు. ఇప్పుడు వారు అప్రమత్తమైనా వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ, ఫిషరీస్, ఏపీఎంఐపీలలో దాదాపు రూ.15 కోట్లు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
 
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ అనుబంధ రంగాల్లో వివిధ పథకాల కింద మంజూరు అయిన నిధులను ట్రెజరీ ద్వారా వినియోగిస్తారు. ఇప్పటి వరకు దాదాపు 11నెలల కాలంలో 50 శాతం నిధులు కూడా వినియోగించలేదు. మిగిలిన  నెల రోజుల్లో  50 శాతాన్ని ఎలా వినియోగిస్తారనేది ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే ట్రెజరీలపై ఆంక్షలు మొదలయ్యాయి. ముందుగానే అధికారులు అప్రమత్తమై వివిధ పథకాలకు నిధులను ఖర్చుచేసి ఉంటే  కొంతవరకైనా రైతుల అభ్యున్నతికి తోడ్పడేవారు.
 
  వ్యవసాయ శాఖలో..
వ్యవసాయ శాఖలో దాదాపు రూ.10 కోట్లు నిధులు వృథా అయ్యే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.11.50 కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా రూ.2.50 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దాదాపు 8 నెలలుగా వ్యవసాయ యాంత్రీకరణ పూర్తిగా నిలిచిపోయింది. యాంత్రీకరణను ఒకసారి జన్మభూమి కమిటీలతో లింక్‌పెట్టడం, మరోసారి గ్రామ సభల తీర్మానాలు తీసుకోవాలనడంతో సమయమంతా వృథాఅయింది. ఇంతవరకు యాంత్రీకరణ అమలు ఒక కొలిక్కి రాలేదు. ఇటీవలనే ట్రెజరీకి రూ.6.50 కోట్ల యాంత్రీకరణ బిల్లులు పంపారు. అయితే ట్రెజరీలో నిధుల చెల్లింపులపై బ్యాన్ ఉండిపోవడంతో నిధుల వినియోగం ప్రశ్నార్థకమైంది. మరోవైపు ఆత్మకింద వ్యవసాయ ప్రదర్శన కేంద్రాల ఏర్పాటు, శిక్షణలు, ఎక్స్‌పోజర్ విజిట్ తదితర వాటికి 8నెలల క్రితమే రూ.1.30 కో ట్లు విడుదలయ్యాయి. అయితే ఇంతవరకు ఒక్క రూపాయ కూడా వినియోగించలేదు.  
 
  ఉద్యాన శాఖ..
ఉద్యాన శాఖలో ప్రధానంగా నిర్మల్‌స్టేట్ ప్లాన్, స్టేట్ హార్టికల్చర్ మిషన్, ఆర్ కేవీవై కింద కొత్త తోటల విస్తరణ, పాత తోటల పునరుద్ధరణ, పాలీహౌస్, షేడ్‌నెట్‌ల ఏర్పాటు, ఉద్యాన యాంత్రీకరణ కింద రూ.35 కోట్లు వ్యయం చేయాలి. ఇందులో ఇప్పటి వరకు 50 శాతం కూడా ఖర్చు చేయలేదు. ప్రధానంగా టిస్యూకల్చర్ అరటి సాగును ప్రోత్సహించ తలపెట్టారు. అయితే మార్కెట్‌లో అరటికి డిమాండ్ తగ్గి రైతులు నష్టాలను మూటగట్టుకుంటుండటంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదు. దీంతో ఉద్యాన యాంత్రీకరణకు సంబంధించిన రూ.70 లక్షల సబ్సిడీ మిగిలి ఉంది. మిగిలిన నెల రోజుల్లో ఉద్యాన అధికారులు చొరవ తీసుకోకపోతే దాదాపు ఈ విభాగం నుంచి రూ.10 కోట్ల వరకు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది.
 
   ఏపీఎంఐపీ
ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 11800 హెక్టార్లలో డ్రిప్ కల్పించాల్సి ఉంది.  అరటి సాగుపై ఆసక్తి తగ్గడంతో డ్రిప్‌లో లక్ష్యాలను అందుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఏపీఎంఐపీలో దాదాపు రూ.2 కోట్ల నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది.
 
  మత్స్యశాఖ
 వానలు లేకపోవడంతో మత్స్యశాఖ 2015-16లో లక్ష్యాలను అందుకోవడంలో పూర్తిగా వెనుకబడి పోయింది. మత్స్యశాఖ అమలు చేస్తున్న పథకాల ద్వారా మత్స్యకారుల అభివృద్ధికి రూ.5 కోట్లు సబ్సిడీ  ఇవ్వాల్సి ఉంది. ఇందులో రూ.2 కోట్లు కూడా వినియోగించలేదు. దీంతో నిధులు భారీగా ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఏర్పడింది.
 
  సింగిల్ డిజిట్‌లోనే వృద్ధిరేటు
 వ్యవసాయ అనుబంధ శాఖల్లో 2015-16లో రెండంకెల అభివృద్ధి రేటును సాధించాలనేది లక్ష్యం. వ్యవసాయం నిరాశ జనకంగా ఉండటంతో సింగిల్ డిజిట్‌లోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెల రోజుల్లో నిధుల వినియోగంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది.
 
మరిన్ని వార్తలు