మైండ్ సెట్ మార్చుకోండి...

21 Sep, 2013 04:36 IST|Sakshi

ఇందూరు, న్యూస్‌లైన్ : విద్యార్థులకు అనుగుణంగా వార్డెన్‌లు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ అలోక్ కూమార్ సూచించారు. బయటి పనుల్లో నిమగ్నమై వసతి గృహానికి వచ్చా మా... పోయామా అన్నట్లుగా ఉండొద్దన్నారు.  శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నగరంలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా సంక్షేమాధికారులతో, వార్డెన్‌లతో సమావేశం నిర్వహించారు. బీసీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు, సౌకర్యాలను వార్డెన్‌లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను వారికి అందజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో వార్డెన్‌లపై ఉందన్నారు. కొత్తగా అమలు చేస్తున్న మెనూను పక్కాగా అమలు చేయాలని సూచించారు.  జిల్లాలో కొన్ని వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, అక్కడి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారం రోజుల్లో పూర్తి సౌకర్యాలు ఉన్న భవనాల్లోకి మార్చాలని సూచించారు.  అవసరమైతే గ్రామ సర్పంచ్, గ్రామ కమిటీ మెంబర్లతో మాట్లాడి భవనాలను వెతుక్కోవాలన్నారు. ప్రభుత్వ భవనంలో కొనసాగుతున్న వసతి గృహాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజురు చేయిస్తానని అన్నారు. ప్రతి వసతి గృహాంలో అవసరం ఉన్నచోట ఫ్యాన్,బల్బు కచ్చితంగా ఉండాలన్నారు.
 
 కొందరు విద్యార్థులు సగం పగిలిన అద్దాల్లో  చూసుకుంటున్నారని,  వార్డెన్‌లు  ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే కొత్తవి కొనుగోలు చేయాలని ఆదేశించారు.  ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు, యూనిఫాంలు లేని విద్యార్థులకు వెంటనే అవి అందేలా  సహాయ సంక్షేమాధికారులు, వార్డెన్‌లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాస్మోటిక్ చార్జీలు వెంటనే చెల్లించాలని పెండింగ్‌లో ఉంచవద్దన్నారు. విద్యార్థులకు వార్డెన్‌లు స్టడీ అవర్స్ నిర్వహించడం లేదని కారణం ఏంటనీ ప్రశ్నించగా, ఎవరూ సమాధానం చెప్పకపోడంతో అసహనం వ్యక్తం చేశారు. నేటి నుంచి అన్ని  స్టడీ అవర్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారిణి విమలను అదేశించారు. ప్రతి వార్డెన్‌కు ఒక సబ్జెక్టు వచ్చి ఉండాలని, పిల్లలకు రోజు ఒక గంట బోధించడం లేదా, సందేహాలను నివృతి చేయాలన్నారు.  వారికి అన్ని మీరే అన్నట్టుగా ఉండాలన్నారు.
 
 ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
 చదువులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందించాలని తద్వారా వారిలో పోటీ తత్వం పెరుగుతుందన్నారు. విద్యార్థులకు సౌకర్యాలు,మెనూ ప్రకారం భోజనం,స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రతి వసతి గృహంలో ల్యాండ్ ఫోన్ ఉండాలని అప్పుడప్పుడు ఫోన్ చేసి విద్యార్థులను అడిగి తెలుసుకుంటామని, దీంతో మీ పనితనం తెలిసిపోతుందన్నారు. మెస్,విద్యా,తదితర కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని,నెలకు రెండు సార్లు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి తనకు నివేదించాలని సూచించారు. వసతి గృహాలకు సరఫరా అవుతున్న రేషన్ బియ్యం సంచుల్లో తక్కువగా వస్తున్నాయని వార్డెన్లు జేడీకి ఫిర్యాదు చేయగా, అలాంటి బ్యాగులను వెంటనే సివిల్ సప్లయ్‌అధికారులకు అప్పగించి వేరే బ్యాగులను తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు