ఎంపీ చొరవతో బీమాకు కదలిక

23 Sep, 2019 13:04 IST|Sakshi

20,655 మందికి త్వరలో లబ్ధి

సాక్షి, కడప: పంట బీమా సొమ్ము కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి చొరవతో ఇది సాధ్యపడనుంది. 2012 రబీ సీజన్‌లో చాలామంది బుడ్డశనగ సాగు చేశారు. చీడపీడలు, తీవ్ర వర్షాభావం, అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి రాకుండా పోయింది. ఫలితంగా రైతులకు నష్టం వాటిల్లింది. పంట నష్టంపై బీమా చెల్లించలేదు. నాటి నుంచి నేటి వరకూ ఎంపీ అవినాష్‌రెడ్డి ఈ సమస్యపై సుదర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు.  కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, వ్యవసాయ బీమా కంపెనీ డైరెక్టర్‌ బూటానీలను పలుపర్యాయాలు కలిసి విన్నవించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా చెల్లించనందున,  సాగు తేదీలు తప్పుగా రాసినందున బీమా చెల్లించలేక పోయామని అప్పట్లో అవినాష్‌రెడ్డికి బీమా కంపెనీ డైరెక్టర్‌ చెప్పారు. రాష్ట్ర వాటా చెల్లించాలని టీడీపీ ప్రభుత్వంపై ఆయన పలు సందర్భాల్లో ఒత్తిడి చేశారు.

అయినా గత ప్రభుత్వం స్పందించలేదు.  ఎంపీ వినతిని పెడచెవిన పెట్టింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఎంపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒత్తిడి పెంచారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను ఆయన ఇటీవల కలిశారు. ప్రీమియం చెల్లింపుపై కేంద్ర వ్యవసాయ బీమా కంపెనీతో చర్చించారు. ఆ చర్చలు ఫలప్రదమయ్యాయి. ఎంపీ చిరకాల ప్రయత్నాలు కొలిక్కి రానున్నాయి. త్వరలోనే ప్రభుత్వం బీమాకు సంబంధించి రాష్ట్ర వాటా చెల్లించనుందని సమాచారం.  2012నాటి బుడ్డశనగ బీమా చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం, బీమా కంపెనీ కూడా ముందుకు వచ్చాయి. జిల్లాలోని 20,655 మంది రైతులకు బుడ్డశనగ బీమా చెల్లింపు వల్ల లబ్ధి చేకూరుతుందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సాక్షికి చెప్పారు. త్వరలోనే సుదీర్ఘ ప్రయత్నానికి  తెరపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు