గంగపుత్రులకు బెంగలేదు

25 Nov, 2019 08:00 IST|Sakshi

పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్

నెరవేరనున్న దశాబ్దాల కల

రూ.353.10 కోట్ల వ్యయంతో  నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు

నిధుల మంజూరుకు కేంద్రం ఆమోదం

మత్స్యకారులకు సకల సౌకర్యాలతో  రానున్న హార్బర్

భీమిలిలో జెట్టీ ఏర్పాటు అనుకూలతలపై సర్వే 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచడంతోపాటు సముద్ర ఉత్పత్తులకు మరింత విలువ జోడించడమే లక్ష్యంగా ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలోనే దశాబ్దాల కాలంగా కేవలం మాటలకే పరిమితమైన పూడిమడిక ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మొత్తంగా రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు అవసరమైన నిధుల మంజూరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెదం తెలిపాయి. ఇందులో తొలిదశలో నాలుగు, మలిదశలో నాలుగు హార్బర్లను నెలకొల్పనున్నారు. జిల్లాలోని అచ్యుతాపురం మండలంలోని పూడిమడిక వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ను మలిదశలోరూ.353.10కోట్ల నిధులతో ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.

ఎన్నో ఏళ్ల కల.. 
ఇటు విశాఖ హార్బర్‌... అటు ఒడిశా పారాదీప్‌... మధ్యలో ఎక్కడా ఫిషింగ్‌ హార్బర్‌ లేదు. దాదాపు 200 కిలోమీటర్ల దూరం వరకు హార్బర్‌ లేకపోవడంతో మత్స్యకారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా తుపానులు, విపత్తులు వచ్చిన సందర్భాల్లో బోట్లు సురక్షిత హార్బర్‌కు తీసుకువచ్చేందుకు మత్స్యకారులు నరకం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అందులోనూ జిల్లాకు చెందిన మత్స్యకారులు ఎక్కువగా ఫిషింగ్‌కు ఒడిశా వైపునకే వెళ్తుంటారు. మరోవైపు విశాఖలోనే దాదాపు 700కి పైగా మెకనైజ్డ్‌ బోట్లు, 3వేల ఫైబర్‌ బోట్లు, 400 చిన్న పడవలు ఉండటంతో  ఇక్కడి హార్బర్‌ సామర్ధ్యం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అచ్యుతాపురం మండలంలోని పూడిమడిక సమీపాన మొగ ప్రాంతంలో హార్బర్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ దశాబ్దాల కాలంగా ఉంది. కానీ ఇన్నేళ్లూ కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఐదు నెలల కిందట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ హార్బర్‌ ఏర్పాటు అనుకూలతలపై సర్వే చేపట్టింది. ఢిల్లీకి చెందిన వాప్‌కాస్‌ (వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెట్‌) సంస్థ సర్వే చేసి ఇక్కడి ప్రాంతం హార్బర్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పూడిమడకలో హార్బర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపి.. ఆ మేరకు కేంద్ర నిధులతో సంయుక్తంగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.    

భీమిలిలో జెట్టీ ఏర్పాటు అనుకూలతలపై సర్వే..
ఇక భీమిలి ప్రాంతంలో జెట్టీ నిర్మించేందుకు అనుకూలతలపై సర్వే చేయాలని ఇప్పటికే బెంగళూరుకు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కోస్టల్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ ఫిషరీస్‌ (బెంగళూరు) సంస్థకు మత్స్యశాఖ లేఖ రాసింది. ఆ ప్రాంతంలో సముద్రం లోతు, అలల ప్రభావం, ఇసుక తిన్నెల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి సదరు సంస్థ నివేదిక ఇవ్వాల్సి ఉంది. నివేదిక వచ్చిన తర్వాత ఈ జెట్టీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు చెప్పుకొచ్చారు.

పోర్టు ఆధీనం నుంచి తప్పించాలి..
ప్రస్తుతం ఫిషింగ్‌ హార్బర్‌ పోర్టు ఆధీనంలో నడుస్తోంది. హార్బర్లో ఉన్న 11 జెట్టీల్లో నిలిపి ఉంచే బోట్లకు ఏటా పోర్టు సొమ్ము వసూలు చేస్తుంది. వసూలు చేసిన సొమ్ముతో తగిన మౌలిక సదుపాయాల కల్పన, హార్బర్‌లోకి బోట్లు వచ్చేందుకు అనువుగా డ్రెడ్జింగ్‌ పనులు చేపట్టడం లేదు. మత్స్యశాఖ ఆధీనంలో ఉంటే తగిన విధంగా దీన్ని మలుచుకోవచ్చు. మత్స్యకారుల కష్టాలు తీరే అవకాశం ఉంది.
– దూడ ధనరాజు, బోటు యజమాని 

మౌలిక సదుపాయాలు కల్పించాలి..
ఫిషింగ్‌ హార్బర్‌పై ఆధారపడి బతికే వారిలో వీధుల్లో తిరిగి చేపలు అమ్ముకునే మహిళలు అధికంగా ఉన్నారు. వీరికి తగిన మరుగు సదుపాయం లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నూతన ఫిషింగ్‌ హార్బర్లలో మంచినీరు, మరుగుదొడ్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి.
– అల్లిపిల్లి అప్పలస్వామి, కలాసీ

జట్టీ నిర్మాణం చేపడితే మేలు..
పూడిమడక తీరం నుంచి వెయ్యి పడవల్లో వేట సా గిస్తున్నాం. పడవల్ని రోజూ వేటకు తీసుకెళ్లాలంటే ఎనిమిది మంది కలాసీలు మోయాల్సి ఉంటుంది. కలాసీలకు అయ్యే ఖర్చు వేటకు భారంగా మారింది. జట్టీ నిర్మాణం చేపడితే మోత భారం ఉండదు. లంగరు వేసిన పడవల్ని ఇద్దరు తీసుకెళ్లి వేట చేయగలుగుతారు. 
–  చింతకాయల కాసుబాబు, మత్స్యకారుడు, పూడిమడక 

20 ఏళ్లుగా జట్టీ కావాలని అడుగుతున్నాం..
పూడిమడకలో జట్టీ నిర్మాణం చేపట్టాలని 20 ఏళ్లుగా అడుగుతున్నాం. తుపాను వచ్చిందంటే చాలు కంటిమీద కునుకు ఉండదు. సముద్రం ముందుకు వచ్చిన ప్రతిసారీ పడవల్ని భద్రపరుచుకోవడానికి అవస్థలు పడుతున్నాం. పడవల్ని భద్రపరుచుకోకపోతే ఒకదానికొకటి తాకి మరమ్మతులకు గురవుతున్నాయి. మోగకు వెళ్లే రహదారిని బాగుచేయాలి.
–  గనగళ్ల బాపయ్య, మత్స్యకారుడు, పూడిమడక  

పడవలు దెబ్బతింటున్నాయి
ఇదివరకు చిన్నపడవలు వినియోగించేవాళ్లం. ఇప్పుడు కోనాం, సూరల వేటకు పెద్దపడవల్ని వినియోగిస్తున్నాం. పడవని జరపడం ఇబ్బందిగా ఉంది. జట్టీ నిర్మిస్తే కలాసీల అవసరం లేకుండా వేటసాగుతుంది. సముద్రం కోతకు గురైనప్పుడు తీరంలో పడవలు దెబ్బతింటున్నాయి. జట్టీ నిర్మిస్తే సమస్యలన్నీ పోతాయి. 
–  వాడముదుల అమ్మోరు, మత్స్యకారుడు, పూడిమడక

త్వరలో సర్వే చేస్తాం..
పూడిమడకలో హార్బర్‌ను గ్రీన్‌ ప్రాజెక్ట్‌గా చేపడతాం. ఆ మేరకు త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్రమంలోనే మత్స్యశాఖ తరఫున పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌కు లేఖ కూడా రాశాం. త్వరలోనే నోటిఫికేషన్‌ వస్తుంది
–పి.కోటేశ్వరరావు, అడిషనల్‌ డైరెక్టర్, మత్స్యశాఖ

శీతల గిడ్డంగి అవసరం చాలా ఉంది..
విశాఖ ఫిషింగ్‌ హార్బర్లో శీతల గిడ్డంగి అవసరం చాలా ఉంది. ప్రస్తుతం 3 టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగి ఏర్పాటు చేశారు. దీన్ని ఎండు చేపలు నిల్వ చేసేందుకు వినియోగిస్తున్నారు. కనీసం 30 టన్నుల సామర్థ్యం గల గిడ్డంగి ఉంటే రొయ్యలు అధికంగా లభ్యం అయినప్పుడు ఇందులో నిల్వచేసుకుని ధర పలికినప్పుడు అమ్ముకోవచ్చు. గిడ్డంగి లేకపోవడం వల్ల రొయ్యలకు గిట్టుబాటు ధర లభ్యం కావడం లేదు. 
– బర్రి కొండబాబు, అధ్యక్షుడు, విశాఖ కోస్టల్‌ మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోట్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌  

మరిన్ని వార్తలు