‘స్మార్ట్’గా తప్పించారు!

3 Aug, 2015 04:04 IST|Sakshi
‘స్మార్ట్’గా తప్పించారు!

ఒకప్పటి రాజధాని.. రాష్ట్రాలను కలిపే క్రమంలో పోగొట్టుకున్న తన హోదాను రాష్ట్ర విభజన సమయంలో దక్కించుకుంటుందని అందరూ భావించారు. ఆ దిశగా ఈ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు పోరాడారు కూడా. అయితే ఫలితం లేకపోయింది. కానీ కర్నూలుకు ప్రాధాన్యం ఇస్తామంటూ సీఎం చంద్రబాబు ఎన్నో హామీలు గుప్పించారు. అయితే ప్రస్తుతం ఆయన హామీలు ఒక్కొక్కటిగా నీరుగారిపోతుండడం విస్మయాన్ని కల్గిస్తోంది.
 
కర్నూలుకు మరోసారి మొండిచేయి
- ఒకప్పటి రాజధానికి వరుస పరాభవాలు
- హామీలు ఒక్కొక్కటిగా నీరుగారుతున్న వైనం
- అధికార పార్టీ జిల్లా నేతలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
కర్నూలు(హాస్పిటల్):
రాష్ట్ర విభజన తర్వాత ఒకప్పటి రాజధానికి ఆ హోదా దక్కకపోయినా అంతకు మించిన రీతిలో అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం హామీలు గుప్పించింది. ఎయిమ్స్(ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్), క్యాన్సర్ ఆసుపత్రి, హజ్‌హూస్, క్రీడా యూనివర్సిటి,  స్మార్ట్‌సిటి ఇలా ఎన్నో కర్నూలుకే అన్నట్టు ప్రచారం జరిగింది. అధికార పార్టీకి చెందిన ఇక్కడి నేతలు, మంత్రులతోపాటు సీఎం సైతం బల్లగుద్దీ మరీ ఈ మాటలు చెప్పారు. అన్నీ ఒకే ఇక పనులే తరువాయి అన్నంతగా పరిస్థితిని తెచ్చారు.

రాజధాని చాన్స్ మిస్సయినా అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి తథ్యమన్నట్లు జిల్లా ప్రజలు భావించారు. కాని అచరణకు వచ్చే సరికి పరిస్థితి ఇందుకు పూర్తి వ్యతిరేకంగా సాగుతోంది. అర్భాటంగా ప్రకటించిన హామీలన్నీ ఒక్కోక్కటిగా ఇతర జిల్లాలకు తరలిపోతుండడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం సార్మ్‌సిటి జాబితాలో కూడా లేకపోవడంతో కర్నూలుకు మరో భంగపాటుగా భావిస్తున్నారు. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో టార్చ్‌లైట్ వేసి వెతికినా కర్నూలు కనిపించకపోవడం గమనార్హం.
 
రూ.300 కోట్ల ప్రతిపాదనలు బుట్టదాఖలు
రెండున్నర నెలల క్రిత మే స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం స్మార్ట్ సిటీగా కర్నూలును ఎంపిక చేసింది. సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. నగర జనాభా, మంచినీటి అవసరాలు, డ్రెయినేజీ సిస్టం, మురికివాడల పరిస్థితి, వ్యక్తిగత మరుగుదొడ్ల వివరాలు, సమగ్రాభివృద్ధికి కావాల్సిన అవసరమైన నివేదికలు తయారు చేయాల్సిందిగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రత్యేకదృష్టి సారించి రూ.300 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు.

నగరంలో ప్రధానంగా మురుగు కాల్వ వ్యవస్థ, భూగర్భ డ్రెయినేజి, నీటిశుద్ధి కేంద్రాలు, అన్ని వీధులకు రోడ్లు, కాల్వలు, కల్వర్టులు, ఖాళీ స్థలాల్లో పార్కుల ఏర్పాటు వంటి వాటితో నివేదికలు రూపొందించారు. అయితే అవేవీ కార్యరూపం దాల్చకపోవడంతో అధికార పార్టీకి చెందిన జిల్లా నేతలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా స్మార్ట్ సిటీల ఎంపికలో కూడా కర్నూలును విస్మరించడం గమనార్హం. రాష్ట్రంలో స్మార్ట్ సిటీలను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతికి మాత్రమే చోటు దక్కింది.

మరిన్ని వార్తలు