‘వన’గూరిందేమీ లేదు

30 Mar, 2019 10:00 IST|Sakshi
నగరవనం

గుర్తుందా సారు !

సాక్షి, అమరావతి : టీడీపీ నేతల బురిడీ మాటలకు శిలాఫలకాలు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అభివృద్ధి పేరిట వారు చెప్పిన మాటలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. ప్రచార ఆర్భాటం కోసం అనేక హామీలు గుప్పించి ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలను బుట్టలో వేసుకొన్నారు. అభివృద్ధి మంత్రం అని చెప్పి మాయ మాటలతో నమ్మించి వారు చేసిన అభివృద్ధి పనులు శిలాఫలకాల్లో మాత్రమే  దర్శనమిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని పేరేచర్లలో 531 ఎకరాల్లో విస్తరించి ఉన్న నగరవనంలో పర్యాటకుల కోసం అనేక వసతులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినా అడుగు ముందుకు పడలేదు. పర్యాటకులను ఆకర్షించటానికి మాత్రం ముఖ ద్వారాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. లోపలకు వెళ్లితే మాత్రం కొండలు, రహదారులు, ఎండిపోయిన మొక్కలు పర్యాటకులను వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. కుటుంబాలతోపాటు వనాన్ని వీక్షించటానికి వచ్చిన వారు ఇక్కడ పరిస్థితిని చూసి నోరెళ్ల బెడుతున్నారు.

అనవసరంగా వచ్చామని బాధ పడుతున్నారు. కేవలం ప్రచార ఆర్భాటానికి మాత్రమే నిధులు ప్రకటించారా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక రకరకాల ఔషధ మొక్కలు పెంపకం అని చెప్పారేగానీ అక్కడ అలాంటివేమీ కనిపించకపోగా ఉన్న మొక్కలు కూడా నీరులేక ఎండిపోయాయి. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సైక్లింగ్‌ చేయటానికి అక్కడ సైకిళ్లు, ట్రెక్కింగ్, స్విమ్మింగ్‌పూల్‌ లాంటివి ఏమీ లేవు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా
నగరవనం గుంటూరు కేంద్రానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ జంటల విడిది ఎక్కువగా కనిపిస్తుంది. వారు తప్పితే వనంలో ఎక్కడా పర్యాటకులు కనిపించకపోవటం గమనార్హం. చుట్టూ ఎత్తయిన కొండలు, పొదలు ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది.  

అనుకున్నంత ఏమీ లేదు
నగరవనం అని అనేక మంది చెబితే వారాంతంలో సేద తీరటానికి బాగుంటుందని వెళ్లాను. కనీస వసతులు కూడా అక్కడ కనిపించలేదు. అభివృద్ధి చేస్తే పర్యాటకులు దూరం నుంచైనా వస్తారు కానీ ఇలా ఉంటే ఎవరూ రారు. ఇక్కడ కాలుష్యం మినహా ఏమీ లేదు. ప్రచార ఆర్భాటానికి నిధులు కేటాయించామని చెప్పడమేగానీ వాటితో ఏమి అభివృద్ధి చేశారో ఇక్కడ మాత్రం కనిపించడం లేదు.  – షేక్‌ఇమామ్‌వలి, మేడికొండూరు

అభివృద్ధి ఆనవాళ్లేవీ ?
నగరవనం అని ఇక్కడకు వచ్చాం. పిల్లలను కూడా తీసుకొచ్చాం. కానీ వనం లోపలకు వెళితే చెట్లు, కొండలు తప్పితే ఏమీ లేవు. కనీసం పిల్లలు ఆసక్తిగా తిలకించటానికి, వారు ఆడుకోవటానికి ఎలాంటి సదుపాయాలు లేవు. ప్రభుత్వం చెప్పిన మాటలకు, ఇక్కడ వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు.        

మరిన్ని వార్తలు