ప్రభుత్వ విద్యార్థులకే ‘ప్రతిభ’ అవార్డులు

6 Nov, 2019 09:41 IST|Sakshi

ప్రైవేట్‌ పాఠశాలలు పక్కకు

ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ 

ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం 

సాక్షి, ఒంగోలు : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి ఫలితాల్లో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులకు అందించే ఏపీజే అబ్దుల్‌కలాం ప్రతిభ అవార్డులను ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ఇస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంతోపాటు అక్కడ చదువుకునే పదో తరగతి విద్యార్థులను మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతిభ అవార్డులను వారికే ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులకే ప్రతిభ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

విద్యార్థుల్లో ఉత్సాహం 
ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని జిల్లాపరిషత్, ప్రభుత్వ, కేజీబీవీ, మున్సిపల్, ఏపీ మోడల్‌ స్కూల్స్, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ హాస్టల్స్, ఏపీఆర్‌ఈ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుకుంటూ అత్యధిక జీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులు ప్రతిభ అవార్డులకు ఎంపిక కానున్నారు. ప్రతిభ అవార్డుకు ఎంపికైన విద్యార్థి బ్యాంకు ఖాతాల్లో  రూ. 20 వేల చొప్పున నగదు జమకానుంది. ట్యాబ్, మెడల్, సర్టిఫికెట్, విద్యార్థి కెరీర్‌కు ఉపయోగపడే పుస్తకాన్ని బహుమానంగా ఇవ్వనున్నారు. పదో తరగతి చదివే ప్రతి విద్యార్థి తాను ప్రతిభ అవార్డుకు ఎంపిక కావాలని కష్టపడుతుంటాడు. ప్రతిభ అవార్డును గర్వంగా అందుకొని తాను నివసించే ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుంటారు.  

ఫిఫ్టీ ఫిఫ్టీ 
ఇంతకు ముందు వరకు ప్రతిభ అవార్డులను ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు చెరో సగం పంచుకున్నట్లుగా ఇచ్చేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ పదో తరగతిలో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రతిభ అవార్డు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లవుతోంది. మండలానికి ఆరు చొప్పున ప్రతిభ అవార్డులను ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలో 56 మండలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 336 ప్రతిభ అవార్డులు జిల్లాకు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆ 336 అవార్డుల్లో ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో సగం మంది కొట్టుకొనిపోయేవారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పాటశాలల కంటే ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులే ఎక్కువగా ప్రతిభ అవార్డులను సొంతం చేసుకోవడం జరిగేది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కొంత నిరుత్సాహానికి గురువుతూ ఉండేవారు. 

ప్రతిభను ఎలా గుర్తిస్తారంటే 
మార్చిలో జరిగిన పదో తరగతి ఫలితాల్లో అత్యధిక జీపీఏలు సాధించిన విద్యార్థులను ప్రతిభ అవార్డు కింద ఎంపిక చేయడం జరుగుతోంది. మండలానికి ఆరు చొప్పున ప్రతిభ అవార్డులు కేటాయిస్తాయరు. జిల్లాలో 56 మండలాలు ఉండటంతో 336 మంది విద్యార్థులు ప్రతిభ అవార్డులను పొందనున్నారు. మండలానికి ఇచ్చే ఆరు ప్రతిభ అవార్డుల్లో ఎస్సీ విద్యార్ధికి ఒకటి, ఎస్టీ విద్యారి్ధకి ఒకటి, బీసీ విద్యార్థికి ఒకటి, ఓసీ విద్యార్థికి ఒకటి, ప్రత్యేకంగా బాలికలకు సంబంధించి ఇద్దరికి ఇవ్వనున్నారు. అయితే ఆయా కేటగిరిల వారీగా ప్రతిభ అవార్డులు ఇచ్చే క్రమంలో ముందుగా ఆ విద్యార్థి సాధించిన జీపీఏ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఆ మండలంలో ఎక్కువ మంది విద్యార్థులు సమానంగా జీపీఏ సాధించి ఉంటే, వారి పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. పుట్టిన తేదీలో వయస్సు ఎక్కువగా ఉన్న వారికే ప్రతిభ సొంతం అవుతోంది.  

సీఎస్‌ఈ ద్వారానే ఎంపిక 
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ అవార్డులకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. పదో తరగతికి సంబంధించిన విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ అన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ఉంటాయి. ఆ నామినల్‌ రోల్స్‌లో విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారం అందులో పొందుపరచి ఉంటుంది. పదో తరగతి ఫలితాలు వెలువడిన అనంతరం పాఠశాలల వారీగా ఏ విద్యార్థి జీపీఏ ఎంత సాధించారన్న వివరాలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలోనే ఉంటాయి. ప్రతి ఏటా నవంబర్‌ 11వ తేదీ ఏపీజే అబ్దుల్‌ కలాం పేరిట ప్రతిభ అవార్డులను విద్యార్థులకు అందించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం విద్యార్థులకు సకాలంలో ప్రతిభ అవార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. దానికితోడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ అవార్డులకు ఎంపికైన విద్యార్థులను ఒకచోటకు రప్పించి అక్కడ భారీ ఎత్తున సభ ఏర్పాటుచేసి ప్రతిభ అవార్డులు అందిస్తూ వచ్చింది. సుదూర ప్రాంతాల్లో ప్రతిభ అవార్డులు ఇస్తుండటంతో  విద్యార్ధులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. 

ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఏ జిల్లాకు ఆ జిల్లాలో నిర్వహించాలని ఆదేశించారు. ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు, వారికి తోడుగా వచ్చే తల్లిదండ్రులు ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ సమయంలో రెండు రోజులపాటు గతంలో ఇబ్బందులు పడ్డారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవాన్ని కూడా రాజకీయ వేదికగా మార్చుకున్నారు. దీంతో ప్రతిభ అవార్డులు అందుకునేందుకు వచ్చిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిభ అవార్డులను ఏ జిల్లాకు ఆ జిల్లాలో అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా