నిర్లక్ష్యంపై ఆపరేషన్‌ షురూ

2 Nov, 2017 15:29 IST|Sakshi

నెల్లూరు (బారకాసు): జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోగి కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేసిన నిర్లక్ష్య వైఖరిపై గురువారం నుంచి ‘విచారణ ఆపరేషన్‌’ జరగనుంది. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) తీవ్రంగా స్పందించింది. నవంబర్‌ 6వ తేదీలోపు సమగ్ర విచారణ నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు, జిల్లా వైద్యాధికారి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ ఒకమిటీని నియమించారు. జేసీ ఇంతియాజ్‌ అధ్యక్షతన జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్‌ రమాదేవి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధాకృష్ణరాజు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సుబ్బారావును సభ్యులుగా నియమించినట్లు తెలిసింది. కమిటీ విచారణకు రోగి చలపతికి మొదటి సారి ఆపరేషన్‌ చేసిన సమయంలో వైద్యులు, నర్సులు ఎవరైతే ఉన్నారో వారందరిని, రెండో సారి ఆపరేషన్‌ చేసిన సమయంలో ఉన్న వైద్యులు, నర్సులు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించారు.

తప్పించుకునే యత్నాలు
ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తప్పు చేసిన డాక్టర్లు తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తున్నారు. కడుపులో కత్తెర పెట్టి ఆపరేషన్‌ చేసిన జనరల్‌ సర్జన్‌ హెడ్‌ డాక్టర్‌ పద్మశ్రీ మంగళవారం ఆస్పత్రికి హాజరయ్యారు. ఆమెతో పాటు సహచర వైద్యులు, వైద్యాధికారులంతా సమావేశమై ఈ తప్పిదం నుంచి తప్పించుకునేందుకు ఏఏ మార్గాలు ఉన్నాయో వాటిపై సుధీర్ఘంగా చర్చించుకున్నట్లు సమాచారం. సహజంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వైద్యులంతా ఒక్కటై జరిగిన తప్పిదంలో తమకు సంబంధం లేదని, అంతా నర్సులదేనని, లేకుంటే కింది స్థాయి సిబ్బందని వారిపై మోపి తప్పించుకునేవారు. అయితే ఈ ఘటనలోనూ అదే జరుగుతుందని అని తెలుస్తోంది. వాస్తవాలను తప్పదోవ పట్టించకుండా సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటారో లేక వైద్యులను తప్పించి వైద్య సిబ్బందిని బలి చేస్తారో వేచి చూడాల్సిందే.  

రోగికి చేయాల్సిన ఆపరేషన్‌పైనే స్పష్టత లేదు
రోగికి చేసిన ఆపరేషన్‌ విషయంలో జరిగిన నిర్లక్ష్యంపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నాయి. రోగి చేయాల్సిన ఆపరేషన్‌పైనే డాక్టర్లకు స్పష్టత లేదు. తొలుత చలపతికి 24 గంటల కడుపునొప్పి ఆపరేషన్‌ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని నర్సులకు తెలియజేసి అందుకు అవసరమైన పరికరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. చలపతికి ఆపరేషన్‌ ప్రారంభించిన సమయంలో 24 గంటల కడుపునొప్పి ఆపరేషన్‌ కాదు మరో పెద్ద ఆపరేషన్‌ చేయాలని అప్పటికప్పుడు వైద్యులు నిర్ధారించారు. దీంతో చేయబోయే ఆపరేషన్‌కు సంబంధించిన పరికరాలు కావాలని వైద్యులు నర్సులను ఆదేశించడం, వారు ఆయా పరికరాలను సహాయకులతో అందుకుని ఆపరేషన్‌ పూర్తి చేశారు. ఇది ఆపరేషన్‌ థియేటర్‌లో జరిగిన విషయం. ఆపరేషన్‌కు ఉపయోగించే పరికరాలను లెక్కకట్టి సరి చూసుకోవాలని నర్సులకు చెప్పాల్సిన బాధ్యత వైద్యులదే. అటువంటిది ఇక్కడి జరిగిన దాఖాలు లేవని సమాచారం.

కేస్‌షీట్‌లో ‘కత్తెర’ విషయం రహస్యం
పోలీస్‌ కేసుల విషయంలో ఎఫ్‌ఐఆర్‌ ఎంత ముఖ్యమో.. వైద్యులు రోగికి అందించే వైద్య సేవల్లో కేస్‌ షీట్‌ అంతే ముఖ్యం. వ్యక్తికి ఏమి బాగలేదు, అందుకు అవసరమై చేసిన వైద్య పరీక్షలు, నిర్ధారైన జబ్బు, అందుకు అవసరమైన అందించాల్సిన, అందించిన వైద్యసేవలు ఇలా పూర్తి వివరాలన్ని కేస్‌షీట్‌లో వైద్యులు పొందుపరుస్తారు. అటువంటి కేస్‌షీట్‌ రెండో సారి చలపతికి ఆపరేషన్‌ వివరాలన్నీ కేస్‌షీట్‌లో పొందుపరిచారు. అయితే కడుపులో ఎక్స్‌రేలో కత్తెర ఉన్నట్లు గుర్తించినా ఆ విషయం మినహా ఇతర సాధారణ విషయాలన్నీ  కేస్‌షీట్‌లో పొందుపరిచారు. చలపతి కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని ఎక్స్‌రేలో గుర్తించిన వైద్యులు  కేస్‌షీట్‌లో ఎందుకు పొందు పరచలేదు. ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం ఏముంది. అంటే వైద్యులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తోటి వైద్యులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారని ఆస్పత్రి వైద్యులే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జరగబోయే విచారణలో ఎవరు దోషులో వెల్లడికానుంది. 

మరిన్ని వార్తలు