ప్రభుత్వ హాస్టళ్లలో భయంకరమైన పరిస్థితులు

10 Nov, 2013 02:17 IST|Sakshi

పై ఫొటోలో ఆరుబయట స్నానం చేస్తున్నది ఎర్రగుంట్ల బీసీ హాస్టలు విద్యార్థి. ఇక్కడ 50మంది విద్యార్థులు ఉన్నారు. అయితే మరుగుదొడ్లు, స్నానపుగదులు లేవు. దీంతో అందరూ మలవిసర్జనకు ఆరుబయటకు వెళ్లాల్సిందే..బయటే స్నానం చేయాల్సిందే. కనీసం కుళాయి సౌకర్యం కూడా లేదు. ఉన్న ఒక్క చేతిపంపు సాయంతో విద్యార్థులంతా స్నానం చేయాలి. ఈ హాస్టలు అద్దె భవనంలో ఉంది. దోమలు విపరీతంగా పెరగడం, ఒక్క దోమతెర కూడా లేకపోవడంతో విద్యార్థులు అల్లాడుతున్నారు. పైగా వార్డెను రాత్రి బసచేయడం లేదు.
 
 క్రింది ఫొటోలో ఇరుకుగదిలో కూర్చున్న అమ్మాయిలంతా ముద్దనూరు బీసీ బాలికల హాస్టలు విద్యార్థినులు. ఈ హాస్టలు అద్దె భవనంలో నడుస్తోంది. నిజానికి ఈ భవనంలో కూర్చున్నా 40మందే పడతారు. అలాంటిది రోజూ 73మంది అక్కడ నిద్రిస్తున్నారంటే వారు ఎంత నరకం అనుభవిస్తున్నారో ఇట్టే తెలుస్తుంది. మరో దారుణమైన విషయమేంటంటే వీరందరికీ ఒక్క లెట్రిన్, ఒకే బాత్‌రూం ఉంది. ఇక్కడ రాత్రి వేళల్లో వార్డెన్ ఉండటం లేదు.
 
 సాక్షి, కడప : జిల్లాలోని  హాస్టళ్లలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి.  ఒక్క చోట ఒకే లెట్రిన్ ఉంటే...ఇంకొన్ని చోట్ల కుళాయిల సౌకర్యం లేదు..మరికొన్ని చోట్ల తలుపులు..కిటికీలు లేవు. ఎక్కడా దోమతెరలు లేవు. ఆర్థిక స్థోమత లేక చదువుకుందామనే ఆశతో హాస్టళ్లను ఆశ్రయిస్తున్న విద్యార్థులు...అందులో రోజూ నరకం అనుభవిస్తున్నారు. ఈ అపరిశుభ్రత మధ్య ప్రతి హాస్టలులో రోజూ 5-10మంది జ్వరాలు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
 
 కడప నగరంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో తలుపులు లేవు. ట్రంకుపెట్టెలు అడ్డుపెట్టుకుని నిద్రిస్తున్నారు.మ అలాగే కిటికీలకు తలుపులు లేవు. వర్షాకాలం కావడంతో విష పురుగులు వస్తే పెద్ద ప్రమాదమే జరిగే పరిస్థితి. ఉప్పలూరుతో పాటు ముద్దనూరులోని మూడు ఎస్సీ హాస్టళ్లలో కూడా మరుగుదొడ్ల సమస్య వేధిస్తోంది. తాగునీటి వ సతి కూడా చాలా హాస్టళ్లలో లేదు. దీంతో భోజనానికి కూడా అపరిశుభ్రమైన నీటిని వినియోగిస్తున్నారు. విద్యార్థులు నీళ్లు తాగలేక భోజనం తర్వాత బయటకు వెళ్లి చుట్టుపక్కల వారి ఇళ్లలో అడిగి తాగడం, లేదంటే పల్లెల్లోని వీధికుళాయిల నీటిని తాగుతున్నారు. ఏ హాస్టలులోనూ దోమ తెరలు లేవు. దీంతో దోమకాటుకు విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. చాలాచోట్ల కప్పుకునేందుకు దుప్పట్లు లేవు. ఇటీవల బెడ్‌షీట్‌లు మాత్రమే ఇచ్చారు. దుప్పట్లు ఇవ్వలేదు.
 
 భోజనం అధ్వానం:
 హాస్టళ్లలో రోజువారీ మెనూను దాదాపు ఏ హాస్టలూ పాటించడం లేదు. ఇదేంటని అడిగితే రోజూ పెడుతున్నామని, సరుకులు అయిపోవడంతో ఈ రోజు మెనూ ప్రకారం భోజనాలు లేవని ఒకరంటే... ఇంకొంతమంది రోజూ ఇలాగే ఉంటుందని బాహాటంగానే అంగీకరిస్తున్నారు. దీంతో పోషకాహారం లేక విద్యార్థుల్లో రక్తహీనత సమస్య కూడా ఎక్కువగా ఉంది. గతేడాది జవహర్ బాల ఆరోగ్యరక్ష ద్వారా విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు నిర్వహిస్తే రక్త హీనతతో బాధపడే వారిలో అధిక శాతం మంది హాస్టలు విద్యార్థులు ఉన్నారు. అలాగే ఏ హాస్టలులోనూ వార్డెన్లు రాత్రివేళల్లో నిద్రించడం లేదు. కనీసం బాలికల హాస్టలులో కూడా ఉండటం లేదు. కేవలం వాచ్‌మన్ మాత్రమే ఉంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే...రాత్రి వేళల్లో ఉండాల్సిన పనిలేదంటున్నారు.  
 
 హాజరుపట్టిలో ఎక్కువ.. హాస్టళ్లలో తక్కువ:
 జిల్లాలోని దాదాపు అన్ని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యకూ, హాజరుపట్టిలోని లెక్కకు పొంతనే లేదు. హాజరుపట్టిలో కంటే దాదాపు 40 శాతం తక్కువగా ఉన్నారు. ఇదేంటని అడిగితే ‘ఇది మామూలే సార్.. అన్ని హాస్టళ్లలోనూ ఉండేదే.. అంటూ తాపీగా సమాధానం చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం 750-850 రూపాయలు ఇస్తోంది. (3-7తరగతులు:750, 8-10తరగతులకు 850) ఈ డబ్బుతో మెనూను అమలు చేయడం అసాధ్యమే. ఈ పరిస్థితుల్లో వార్డెన్లు విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపి వచ్చిన డబ్బును స్వాహా చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 సమస్యలు ఉన్నాయి... తీర్చుతాం: సీఎస్‌ఏ ప్రసాద్, జేడీ, సాంఘిక సంక్షేమశాఖ
 ‘సాక్షి’ విజిట్‌లో మీ దృష్టికి వచ్చిన సమస్యలన్నీ వాస్తవాలే. కూరగాయల ధరలు పెరగడం వల్ల మెనూను పాటించడం లేదు. అందుకే మళ్లీ టెండర్లు వేస్తున్నాం. 15 రోజుల్లో మెనూ కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం. మరుగుదొడ్లు, కిటికీలు, తలుపులు కూడా చాలావాటిలో లేవు. వీటి మరమ్మతుల కోసం 4కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. దోమతెరలు ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయింపులు లేవు. ఎవరైనా దాతలు ఇస్తే స్వీకరిస్తాం.
 

మరిన్ని వార్తలు