దర్జాగా కబ్జా! 

17 Apr, 2018 09:42 IST|Sakshi
కంబకాయ మార్గంలో వంశధార కాలువను కప్పేస్తున్న ఆక్రమణదారులు

నరసన్నపేటలో ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన అక్రమార్కులు

అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోతున్న వైనం

కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు

చేతులెత్తేస్తున్న అధికారులు

నరసన్నపేటలో అధికార పార్టీ నాయకులు, వారి అనుయాయులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులే లక్ష్యంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. నయానో.. భయానో అధికారులకు చెప్పి తమ పనులు కానిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రెవెన్యూ అధికారులు కాపాడుకుంటూ వస్తున్న ప్రభుత్వ ఆస్తులు తాజాగా కబ్జాకు గురవుతున్నాయి. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందామన్న చందంగా... అధికారం ఉన్నప్పుడే భూములను ఆక్రమించేసేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విలువైన స్థలాలు కబ్జాకారుల చేతుల్లోకి చేరిపోయాయి. అయినా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. 

నరసన్నపేట : వాణిజ్య కేంద్రమైన నరసన్నపేటలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే..పాగా వేయడానికి కొంతమంది అక్రమార్కులు కాచుకుకూర్చున్నారు. ఇప్పటికే విలువైన భూములను కొల్లగొట్టారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకుల అండతోనే ఆక్రమణలు అధికమైనట్టు పట్టణవాసులు చెప్పుకుంటున్నారు. నరసన్నపేట నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ స్థలాలు పలు కుల సంఘాలకు అనధికారికంగా అధికారులు అప్పజెప్పారు. దీంతో మరింతగా ఆక్రమణలు పెరిగాయి. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం  నరసన్నపేటలో సెంటు స్థలం రూ. నాలుగు లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ ఉంది. దీంతో అధికార పార్టీ కార్యకర్తలు, వారి అనుయూయులు అంతా తమ ఇష్టం అని అంటూ ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు.

 ‘వంశధార’ కాలువను కప్పేస్తున్నారు!
ఆక్రమణదారులు ఎంతకైనా బరితెగిస్తున్నారు. రైతులకు ఉపయోగపడే కాలువలను సైతం ఆక్రమించేందుకు వెనుకంజ వేయడం లేదు. తాజాగా జాతీయ రహదారి నుంచి కంబకాయకు వెళ్లే మార్గంలో ఉన్న వంశధార కాలువను కప్పేస్తున్నారు. ఇక్కడ సెంటు రూ. 4 లక్షలు పలుకుతోంది. 30 సెంట్లకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేయడానికి కొంతమంది స్కెచ్‌ వేశారు. కాలువను కప్పేసే క్రమంలో మట్టి వేస్తున్నారు. ఈ కాల్వ ఆక్రమణ జరిగితే నీటి సరఫరాకు తీవ్ర ఆటంకం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. చిన్న వర్షం పడినా నీరు రోడ్డు మీదకు వచ్చే ప్రమాదం ఉంది.   ఈ ఆక్రమణను అడ్డుకొని కాలువను అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు. రెవెన్యూ, వంశధార అధికారులు సమన్వయంతో వ్యవహరించి కాల్వకు పూర్వ వైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

జలగల చెరువులోనూ ఆక్రమణలు..
కంబకాయ రోడ్డుకు ఆనుకొని జాతీయ రహదారికి రెండు వైపులా జలగల చెరువు విస్తరించి ఉంది. 10 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన ఈ చెరువును అన్ని వైపుల నుంచి కబ్జాకారులు కప్పేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకొని కంబకాయ వైపు ఉన్న స్థలంలో మట్టి, గ్రావెల్‌ వేశారు. గతంలో నరసన్నపేట తహసీల్దార్‌గా దేవీమణి ఉన్నప్పుడు ఇక్కడ ఆక్రమణలకు కొందరు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి. దీనిపై కూడా అధి కారులు దృష్టి పెట్టి ప్రభుత్వ చెరువులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

శ్రీరామనగర్‌లో రోడ్డు మార్గం ఆక్రమణ 
స్థానిక లక్ష్మీనగర్‌ పరిధిలో ఉన్న రెవెన్యూ గోర్జిని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణకు పాల్పడుతున్నారు. శ్రీరామనగర్‌–లక్ష్మీనగర్‌లకు మధ్య రహదారిగా ఈ గోర్జి వినియోగిస్తుండగా ఇది తమదంటూ అని కొందరు ఆక్రమించేస్తున్నారు. దీనిపై దృష్టిసారించి ఆక్రమణకు అడ్డుకట్ట వేయాలని  స్థానికులు కోరుతున్నారు. శ్రీరామనగర్‌– లక్ష్మీ నగర్‌లకు రహదారిగా దీనిని వినియోగించేందుకు అవకాశం ఇవ్వాలని విన్నవిస్తున్నారు. దీనిపై స్థానికులు నరసన్నపేట తహసీల్దార్‌ రామారావుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

11 ఆర్‌ కిళ్లాం చానల్‌ పరిస్థితి దారుణం 
నరసన్నపేట పట్టణం మధ్య ఉన్న 11 ఆర్‌ కిళ్లాం చానల్‌ పూర్తిగా ఆక్రమణలకు గురైంది. కాలువ ఆధునికీకరణలో భాగంగా ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అధికార పార్టీ నాయకులు ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో ఏం చేయలేక మిన్నుకుండిపోతున్నారు. హడ్కో కాలనీ, దేశవానిపేట, వజ్రంపేట, శివనగర్‌ కాలనీల పరిధిల్లో భూ ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి.  
–కామేశ్వర భుక్త చెరువు వద్ద..
 సత్యవరం రెవెన్యూ గ్రామం సర్వే నంబర్‌ 338/1లో ఉన్న ఈ చెరువు వద్ద ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతోంది. అయితే ఆక్రమణలకు అవకాశం ఇవ్వమని అధికారులు హెచ్చరిస్తున్నారు. చెరువులో ఆక్రమణలు గుర్తించి ట్రెంచ్‌ కొట్టారు. పనులు ఆగినట్లే కనిపించినా ప్రస్తుతం ఆక్రమణలు దారులు వారు అనుకున్నట్లే లేఅవుట్లు వేసి ప్రభుత్వం చెరువును అమ్ముకుంటున్నారు. చెరువుకు ఆనుకొని కొందరు తమ జిరాయితీ పొలాల్లో ఇళ్ల ప్లాట్లు వేయగా దీనికి రోడ్డు మార్గం కామేశ్వర భుక్త చెరువు స్థలంలో  వేశారు. ఈ స్థలాన్ని మినీ స్టేడియం నిర్మాణానికి మొదట్లో అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇప్పుడు స్టేడియం నరసన్న చెరువులో నిర్మిస్తుండటంతో విలువైన ఈ చెరువు ఆక్రమణలకు గురవుతోంది. 

ఆక్రమణలకు తావివ్వం..
నరసన్నపేట మేజరు పంచాయతీ పరిధిలో ఆక్రమణలకు ఆవకాశం ఇవ్వమని తహసీల్దద్‌ జల్లేపల్లి రామారావు స్పష్టం చేశారు. సమాచారం వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆక్రమణలపై ప్రత్యేక దృష్టిపెట్టి అడ్డుకట్ట వేస్తామన్నారు.

ఇందిరాగనర్‌లో కాలువలో ఆక్రమణలు 
స్థానిక ఇందిరా నగర్‌లో విలువైన వంశధార కాలువ ఆక్రమణలకు గురైంది. గతేడాదిలో ఇది వెలుగు చూసినా రెవెన్యూ, వంశధార అధికారులు పట్టించుకోవడంలేదు. దీనికి కారణం ఆక్రమణదారులంతా అధికార పార్టీ అనుయూయులు కావడమే. ఆక్రమణలపై రైతులు ఫిర్యాదు చేయగా హడావుడిగా వంశధార ఇంజినీర్లు పరిశీలించినా తరువాత వదిలేశారు. దీంతో ఆక్రమణదారులు మరింత రెచ్చిపోతున్నారు. కాలువ ఆనవాళ్లు లేకుండా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వంశధార కాలువపై పక్కా భవనాలు నిర్మించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 10 అడుగులకు పైగా విస్తీర్ణంలో కాల్వ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కాల్వ ఆనవాళ్లే లేవు. 

మరిన్ని వార్తలు