వెబ్‌ల్యాండు.. అక్రమాలకు సులువుగనుండు

14 Jul, 2018 03:14 IST|Sakshi

రాత్రికి రాత్రి మారుతున్న భూముల వివరాలు

ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ భూములు

బ్యాంకుల్లో రుణాల కోసం మోసాలు

టీడీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్న అధికారులు

సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖలో వెబ్‌ల్యాండ్‌ పేరుతో జరుగుతున్న మోసాల్లో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వెబ్‌ల్యాండ్‌లో మార్పు చేర్పులు చేయాలంటే పాస్‌వర్డ్‌ ఉండాలి. తహసీల్దార్ల వద్ద మాత్రమే ఉండాల్సిన ఆ రహస్య పాస్‌వర్డ్‌ చాలా మండలాల్లో మీసేవ కేంద్రాల దగ్గర, కంప్యూటర్‌ ఆపరేటర్ల వద్ద, మాజీ రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నాయి. దీంతో వారు డబ్బు తీసుకుని రాత్రికి రాత్రే ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరుతో నమోదు చేస్తున్నారు. ఏదైనా సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తి పేరుతో మార్చితే ఆ సమాచారం వెంటనే సంబంధిత అధికారులకు ఎస్సెమ్మెస్‌ రూపంలో వెళ్లాలి. అయితే ఇలా మార్చిన వారు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి మెసేజులు వెళ్లకుండా చేస్తున్నారని తెలిసింది. 

తహసీల్దార్ల పాత్రపై ఆరోపణలు..
అక్రమాల్లో కొందరు తహసీల్దార్లకు కూడా పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వెబ్‌ల్యాండ్‌లో ప్రైవేటు వ్యక్తుల పేరుతో చేరిపోయాయి. ఇందుకోసం కొందరు రిటైర్డు రెవెన్యూ అధికారులతో కలిసి ప్రస్తుత రెవెన్యూ అధికారులు రికార్డులను కూడా తారుమారు చేశారని తెలుస్తోంది.

‘12 – 13 ఏళ్ల అడంగళ్లను కూడా మార్చి వేశారు. ఇంత దారుణంగా పకడ్బందీగా చేస్తే ఎవరు మాత్రం పట్టుకోగలరు. గతంలో అనంపురం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల కుంభకోణం జరిగింది. ఇప్పుడు వెబ్‌ల్యాండ్‌ కుంభకోణం. పాసు పుస్తకాలు నకిలీవి ముద్రించాలంటే చాలా కష్టం. వెబ్‌ల్యాండ్లో తప్పులు చేయడం చాలా సులభం. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి పట్టుబట్టి వెబ్‌ల్యాండ్‌ అమల్లోకి తెచ్చేలా చేశారు. ఇప్పుడు ఇదే అక్రమాలకు సులువైన మార్గంగా తయారైంది. ’ అని ఓ జిల్లా జాయింట్‌ కలెక్టరు ఆవేదన వ్యక్తం చేశారు. 

- నెల్లూరు జిల్లా మర్రిపాడులో పదెకరాల ప్రభుత్వ భూమి రాత్రికి రాత్రే ఒక తెలుగుదేశం నాయకుడి పేరుతో వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కిపోయింది. వెంటనే ఆ నాయకుడు మీసేవ నుంచి భూ అనుభవపత్రం (అడంగల్‌), భూ యాజమాన్య హక్కు పత్రం (1–బి) డౌన్‌లోడ్‌ చేసుకుని బ్యాంకులో రుణం తీసుకున్నారు.

గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో ప్రభుత్వ భూమినే ఓ వ్యక్తి ల్యాండ్‌ పూలింగ్‌ కింద సీఆర్‌డీఏకి ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వ భూమిని వెబ్‌ల్యాండ్‌లో తనపేరుతో నమోదు చేయించుకుని రికార్డులు మార్పించారు. పూలింగ్‌ కింద ఇచ్చిన భూమికి ప్రతిగా సీఆర్‌డీఏ ప్లాటు కేటాయించే సమయంలో ఫిర్యాదు రావడంతో విచారణ చేస్తే వాస్తవం బయటపడింది. ఫిర్యాదు అందకపోతే ప్రభుత్వ భూమికే ఆ వ్యక్తి సీఆర్‌డీఏ నుంచి ప్లాటు పొందేవారు. 

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుదిపుట్లలో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తి పేరుతో ఆన్‌లైన్‌లో నమోదైంది. ఆ భూమిపై ఆ వ్యక్తి బ్యాంకులో రుణం తీసుకున్న తర్వాత విచారణ మొదలైంది. 

మరిన్ని వార్తలు