ఆక్రమణ మళ్లీమళ్లీ..!

18 Jun, 2019 09:54 IST|Sakshi
తాజాగా మూడోసారి చెరువు స్థలం ఆక్రమించి టీడీపీ నాయకులు నిర్మించిన ఇళ్లు

మూడోసారి చెరువు స్థలం కబ్జా 

సర్కారు భూమిపై టీడీపీ నాయకుల కన్ను 

ప్రశ్నించే వారిపై దాడులకూ వెనకాడని వైనం

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం

సర్కారు జాగా కనిపిస్తే దర్జాగా కబ్జాచేయడం టీడీపీ నాయకులకు రివాజుగా మారింది. ప్రభుత్వం మారినా.. వారి ఆక్రమణలు, ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. బడిభూమి, గుడిమాన్యం, చెరువులు, కాలువలు, వంకలు, వాగులు అన్న భేదం లేకుండా.. ఖాళీగా ఉంటే కబ్జా చేసేస్తున్నారు. ఆక్రమించడం, పునాది రాళ్లు వేయడం.. ప్రశ్నిస్తే.. భూమి తనదేనని బెదిరించడం.. సంబంధిత పత్రాలు చూపమంటే.. బెదిరింపులకు దిగడం అలవాటైపోయింది. రెవెన్యూ అధికారులు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. 

సాక్షి, తిరుపతి, మంగళం : ఆధ్యాత్మిక నగరంలో టీడీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకీ శృతిమించిపోతున్నాయి. చెరువు భూములే లక్ష్యంగా ఆక్రమణలకు తెగబడుతున్నారు. తిరుపతి అర్బన్‌ మండలం కొంకచెన్నయ్‌గుంట లెక్కదాఖలా సర్వే నెం.173లో చెరువు స్థలం ఆక్రమణకు గురైంది. సుమారు ఎకరం స్థలంలో పదిహేను ఇళ్లు యథేచ్ఛగా నిర్మించుకున్నారు. గతంలో రెండుసార్లు ఇళ్లు నిర్మించగా.. రెవెన్యూ అధికారులు అతికష్టం మీద ఆక్రమణలను తొలగించారు. మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ ఒత్తిడి మేరకు కొంతకాలం రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినా, సార్వత్రిక ఎన్నికల కోడ్‌ సమయంలో రెండుసార్లు ఆక్రమణలు తొలగించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైనప్పటికీ టీటీడీకి చెందిన ఓ మహిళా నాయకురాలి ఆధ్వర్యంలో ముచ్చటగా మూడోసారి ఆక్రమించి ఇళ్లు నిర్మించడం వీరి దౌర్జన్యాలకు నిదర్శనం.

రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి... 
సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న తరుణంలో అక్కారంపల్లి వీఆర్వో పురుషోత్తం, రామచంద్ర ఆక్రమణపై ఉక్కుపాదం మోపారు. తిరుపతి అర్బన్‌ తహసీల్దార్‌ ఎం.చంద్రమోహన్‌ ఆదేశాల మేరకు కొంక చెన్నయ్‌గుంట చెరువు స్థలంలో జేసీబీలతో ఆక్రమణలు తొలగించేందుకు వచ్చారు. ఆక్రమణలు తొలగించారన్న నెపంతో టీడీపీ నాయకులు రాత్రంతా రెవెన్యూ సిబ్బందిని ఓ రూమ్‌లో నిర్బంధించి, నానా చిత్రహింసలకు గురిచేసి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరోజు రాత్రి అలిపిరి పోలీసులు అతి కష్టంమీద రెవెన్యూ సిబ్బందిని టీటీడీ నాయకుల కబంధ హస్తాల నుంచి విడిపించినట్లు సమాచారం. దీన్ని బట్టి సమస్య ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు