‘గీత’ దాటి ఆక్రమణలు

18 Jun, 2017 02:31 IST|Sakshi
‘గీత’ దాటి ఆక్రమణలు
పేదల ఇళ్లకు కేటాయించిన భూముల్లో..
 
తెలుగుదేశం పాలనలో ప్రభుత్వ ‘ముఖ్య’పెద్దల అండతో కబ్జాలు దర్జాగా సాగిపోతున్నాయి. విశాఖ జిల్లాలో రుషికొండ వద్ద రూ. వెయ్యి కోట్ల విలువ చేసే 55.24 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గీతం సంస్థల అధినేత, సీఎం చంద్రబాబు బంధువు ఎంవీవీఎస్‌ మూర్తి.. పేదల ఇళ్ల నిర్మాణం కోసం రాజీవ్‌  స్వగృహ కార్పొరేషన్‌కు  కేటాయించిన భూములనూ వదల్లేదు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశానని, దాన్ని నామమాత్రపు ధరకు ఇచ్చేయాలంటూ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరడం, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్ధం కావటం చకచకా జరిగిపోతోంది.
 
విశాఖపట్టణంలోని గీతం యూనివర్సిటీలో సర్కారు భూమి ఆక్రమణలే అధికమనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ జిల్లా రుషికొండ, ఎండాడ గ్రామాల్లో రూ. వెయ్యి కోట్ల విలువ చేసే 55.24 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గీతం కాలేజీ చైర్మన్, ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు ఎంవీవీఎస్‌ మూర్తికి నామమాత్రపు ధరతో కట్టపెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన విషయాన్ని ‘సాక్షి’ ఇటీవలే పాఠకులకు తెలియజేసింది. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలకు గతంలో కేటాయించిన 15 ఎకరాలను రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా సాక్షి వెలుగులోకి తెచ్చింది. అయితే ఈసారి రాజీవ్‌ స్వగృహ భూములపై ‘గీతం’ కన్ను పడింది.  
 
ప్రభుత్వ భూమిని పేదలు ఆక్రమిస్తే ఇచ్చేస్తారా?
ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేయటం, సామాన్యుల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన భూమిని గీతం యూనివర్సిటీ పరం చేయటాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న గీతం వర్సిటీ సామాజిక సేవలేమీ అందించడం లేదని, అలాంటి సంస్థకు నామమాత్రపు ధరకు భూములు ఎందుకు అప్పగించాలని ప్రశ్నిస్తున్నారు. పేద ప్రజలు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నామమాత్రపు ధరకు ఇవ్వాలని కోరితే ఇదే ప్రభుత్వ పెద్దలు  ఇస్తారా? అని వ్యాఖ్యానిస్తున్నారు.
 
భూములు కాపాడుకోవాలంటూ రాజీవ్‌ స్వగృహకు కలెక్టర్‌ లేఖ
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం 2009లో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములను కూడా గీతం యూనివర్సిటీ ఆక్రమించింది. అప్పట్లో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు ప్రభుత్వం 7.61 ఎకరాలను  కేటాయించింది. సుమారు వంద కోట్ల రూపాయలు విలువైన ఈ భూమిని ఆక్రమించడమే కాకుండా ఆ భూమిని తమకు కేటాయించాలంటూ గీతం వర్సిటీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఎండాడలోని రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు కేటాయించిన 7.61 ఎకరాలను గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించిందని, ఇది ప్రభుత్వ భూమి అయినందున గీతం యూనివర్సిటీకి కేటాయించడం సాధ్యం కాదని గతంలో విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఉన్న యువరాజ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

రాజీవ్‌ స్వగృహకు చేసిన భూముల కేటాయింపులను రద్దు చేసి గీతం యూనివర్సిటీకి ఇవ్వడం సాధ్యం కాదంటూ కలెక్టర్‌ యువరాజ్‌ గత ఏడాదే భూమి పరిపాలన ప్రధాన కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని పరిరక్షించుకోవాల్సిందిగా కూడా రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు యువరాజ్‌ సూచించారు. సర్వే నెంబర్‌ 16లో 1.95 ఎకరాలు, సర్వే నెంబర్‌ 20లో 5.66 ఎకరాలను రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు కేటాయిస్తూ 2009 ఫిబ్రవరి 20వ తేదీన జీవో 219 జారీ చేసినట్లు కలెక్టర్‌ యువరాజ్‌ ప్రభుత్వానికి పంపిన నివేదికలో స్పష్టం చేశారు.

అయితే గీతం యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఎలాగైనా ఆ భూమిని కాజేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసి ఆ భూమిని నామమాత్రపు ధరకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ అధికారులను ప్రభుత్వ పెద్దలు ఆదేశించారని, త్వరలోనే రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ భూములను గీతం యూనివర్సిటీ పరం చేయనున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
మరిన్ని వార్తలు