రూ.30 వేల కోట్ల స్వాహాకు సర్కారు పెద్దల స్కెచ్‌

11 Dec, 2017 02:29 IST|Sakshi
విశాఖ జిల్లా సరుగుడు వద్ద కొండల్లా తవ్వి పోసిన బాక్సైట్‌ గుట్టలు

లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ లూటీ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.30 వేల కోట్ల లూటీకి సర్కారు పెద్దలు స్కెచ్‌ వేశారు. విశాఖ జిల్లాలో లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ దోపిడీకి పక్కాగా వ్యూహం పన్నారు. అత్యంత విలువైన బాక్సైట్‌ ఖనిజం తవ్వకాలకు నిబంధనల ప్రకారం అనుమతుల్లేవు. దీంతో అక్కడున్న ఖనిజం బాక్సైట్‌ కాదు, లేటరైట్‌ అంటూ ధ్రువపత్రాలు తెచ్చుకుని  తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకు మినీ మైనింగ్‌ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ ముసుగులో  లీజులు దక్కించుకునేందుకు 30 మంది బినామీలతో దరఖాస్తులు చేయించారు. ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న ఆ ఫైల్‌కు నేడో రేపో ఆమోదముద్ర పడనుంది. విశాఖ జిల్లాలో ఒక్క పంచాయతీలోనే రూ.30 వేల కోట్లకు పైగా విలువైన బాక్సైట్‌ను కొల్లగొట్టేందుకు సాగుతున్న కుతంత్రమిది..  

విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీలోని సుందరకోట, అసనగిరి, బమిడికలొద్ది, తొరడ గ్రామాల్లో 2 కోట్ల టన్నులకు పైగా బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాలున్నాయి. దేశంలో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రభుత్వరంగ సంస్థలకే తప్ప ప్రైవేట్‌ వ్యక్తులకు అనుమతులివ్వడానికి వీల్లేదు. ముడి ఖనిజంలో అల్యూమినియం 40 శాతంలోపు ఉంటే లేటరైట్‌గా, అంతకు మించి ఉంటే బాక్సైట్‌గా పరిగణిస్తారు. లేటరైట్‌ను సిమెంట్‌ తయారీలో, బాక్సైట్‌ను అల్యూమినియం తయారీకి ఉపయోగిస్తారు. 

నాలుగేళ్లలో ఖనిజం మారిపోయింది 
సుందరకోట గ్రామంలోని ఖనిజంలో అల్యూమినియం 40 శాతంలోపే ఉందని, అందువల్ల తమకు లేటరైట్‌ తవ్వకాలకు అనుమతివ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన సింగం భవానీ గతంలో మైనింగ్‌ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అధికారులు అక్కడున్నది లేటరైట్‌ కాదు, బాక్సైట్‌ అని నిర్ధారించారు. ఆమె దరఖాస్తును 2010 ఏప్రిల్‌లో తిరస్కరించారు. కానీ, విచిత్రంగా నాలుగేళ్ల అనంతరం ఆ ప్రాంతంలో ఉన్నది లేటరైట్‌గా పేర్కొంటూ అధికారులు 2014 ఫిబ్రవరి 3న సుందరకో టలో 4.97 హెక్టార్లలో 20 ఏళ్లపాటు తవ్వకాల కు ఆమెకు అనుమతులిచ్చేశారు. దీంతో అప్పటి నుంచి లీజుదారు లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వేస్తున్నారు. ఒడిశాలోని వేదాంత అల్యూమినియం కర్మాగారానికి సరఫరా చేస్తున్నారు. దాదాపు 1.50 లక్షల టన్నుల బాక్సైట్‌ను తవ్వి తరలించేశారని అంచనా. 

వాటాలివ్వకుంటే అంతేమరి! 
2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పెద్దల కళ్లు బాక్సైట్‌ నిక్షేపాలపై పడ్డాయి. లీజుదారు సింగం భవానీని భారీగా వాటాలడిగారు. బేరం కుదరకపోవడంతో అధికార బలం ప్రయోగించారు. భవానీకి అనుకూలంగా పంచాయతీ సర్పంచ్‌ ఏకపక్షంగా ఎన్‌ఓసీ ఇచ్చారంటూ టీడీపీ నేతలు అప్పటి కలెక్టర్‌ యువరాజ్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కలెక్టర్‌ పంచాయతీ తీర్మానం బోగస్‌ అని తేల్చారు. 2015 డిసెంబర్‌లో భవానీ లీజును రద్దు చేశారు. కానీ, బమిడికలొద్ది, తొరడ గ్రామాల్లో తవ్వకాలకు టీడీపీ నేతల బినామీలు చేసుకున్న దరఖాస్తులకు మాత్రం అనుమతిలిచ్చేశారు. 

తేలని వాటాలు.. ఆగిన తవ్వకాలు 
తొరడలో 20 లక్షల టన్నుల ఖనిజ నిల్వలున్న 25 హెక్టార్లను విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పిట్టాచలం గ్రామస్తుడు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడు కిల్లో లోవరాజుకు 2015లో 20 ఏళ్లపాటు లేటరైట్‌ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారు. దాంతో అప్పటినుంచి అక్కడ లేటరైట్‌ పేరిట బాక్సైట్‌ తవ్వకాలు  జరుగుతున్నాయి. ఇక బమిడికలొద్దిలో 121 హెక్టార్ల విస్తీర్ణంలో లేటరైట్‌ తవ్వకాలకు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడు జర్తా లక్ష్మణరావుకు లీజు అనుమతిలిచ్చారు. ఈ లీజు విషయంలో టీడీపీ నేతల మధ్య వాటాల కోసం విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటాల వంచాయతీ తేలకపోవడంతో తవ్వకాలు మొదలు కాలేదు. 

లేటరైట్‌కే లీజులిచ్చాం..
‘‘విశాఖ జిల్లా సరుగుడు పంచాయతీ పరిధిలో ఉన్నది లేటరైట్‌గానే గుర్తించి తవ్వకాలకు అనుమతులిచ్చాం. గతంలో ఆ ప్రాంతంలో ఉన్నది లేటరైట్‌ కాదు, బాక్సైట్‌ అని మైనింగ్‌ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల గురించి నాకు తెలియదు. ప్రస్తుతం తొరడ గ్రామంలో లేటరైట్‌ మైనింగ్‌ జరుగుతున్న మాట వాస్తవమే’’  
– సూర్యచంద్రరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్, మైనింగ్‌ శాఖ 

మరిన్ని వార్తలు