మాజీ ఎంపీ వైరిచర్ల రికార్డులను ప్రభుత్వానికి అందజేయాలి

26 Feb, 2017 04:52 IST|Sakshi

సాలూరు: అరకు మాజీ ఎంపీ వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌ కులానికి సంబంధించిన రికార్డులను ప్రభుత్వానికి కలెక్టర్‌ అందజేయాలని ఉత్తరాంధ్ర గిరిజన ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వరరావు, భారతీయ రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప ప్రకాశరావు, గిరిజన నాయకులు ఆదయ్య, రామ, బీసు డిమాండ్‌ చేశారు. స్థానిక విలేకరులతో వారు శనివారం మాట్లాడారు. వైరిచర్ల ఎస్టీ కాదని, విచారణ జరిపి  కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేయాలని 2008లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం 3 నెలల్లో విచారణ జరపాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. అప్పటి డీఎల్‌ఎస్‌సీ విచారణలో తను కొండరాజులుగా వైరిచర్ల చెప్పుకున్నారన్నారు.  కొండరాజులు, కొండదొరలు ఒక్కటి కాదని నిర్దారించిన కమిటీ నివేదిక రూపొందించిందన్నారు. అప్పటి కలక్టర్‌ నారాయణరెడ్డి తనకున్న విచక్షణాధికారాల మేరకు వైరిచర్ల ఎస్టీగా నిర్ధారిస్తున్నట్టు వెళ్లడించారన్నారు. దీనిపై ప్రభుత్వానికి అప్పీలు చేశామన్నారు. నాటి నుంచి సదరు అప్పీలు పెండింగ్‌లోనే ఉందన్నారు. దీనికి వైరిచర్లకు సంబంధించిన రికార్డులను కలెక్టర్‌ ప్రభుత్వానికి అందజేయకపోవడమే కారణమన్నారు. ఎస్టీగా నిర్ధారించే విచక్షణాధికారం కలక్టర్‌కు లేదని స్పష్టం చేశారు. వైరిచర్ల కేసు విచారణకు సంబంధించిన రికార్డులను ప్రభుత్వానికి త్వరితగతిన అందజేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు