-

రిలీవ్డ్‌ విద్యుత్‌ ఉద్యోగులకు మొండిచెయ్యి

23 Feb, 2017 02:21 IST|Sakshi

ఏపీ సంస్థల్లోకి తీసుకునేందుకు సర్కార్‌ విముఖత

సాక్షి, అమరావతి: ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్‌ సంస్థలు తొలగించిన 1,252 మంది విద్యుత్‌ ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైంది. వారిని ఏపీ విద్యుత్‌ సంస్థల్లోకి తీసుకునేందుకు ఆస్కారం లేదని విద్యుత్‌ అధికారులకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న సంకేతాలు పంపారు. తమను ఏపీ సంస్థల్లోకి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రిలీవ్‌ చేసిన ఉద్యోగులు 12 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో విద్యుత్‌ సంస్థల పాలన వ్యవహారాలపై బుధవారం విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  ఉద్యోగుల అంశాన్ని  అధికారులు అజయ్‌జైన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమవ్వాలని గవర్నర్‌ చేసిన సూచనపైనా అధికారులు చర్చించారు.అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ.. ఇది రెండు ప్రభుత్వాలు రాజకీయంగా తేల్చుకోవాల్సిన అంశమని, వారిని తీసుకునేందుకు సీఎం సానుకూలంగా లేరని స్పష్టం చేసినట్టు తెలిసింది. అనంతరం  ఇతర అంశాలపై చర్చించారు.

మరిన్ని వార్తలు