నిధుల్లో కోత విద్యాశాఖపై సర్కార్ నిర్లక్ష్యం

13 Dec, 2013 00:49 IST|Sakshi


 ఆదిలాబాద్‌టౌన్, న్యూస్‌లైన్ :
 ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ విద్యా సంవత్సరం మండల వనరుల కేంద్రాలు(ఎమ్మార్సీ), పాఠశాల సముదాయాల(స్కూల్ కాంప్లెక్స్)కు నిధుల కేటాయింపుల్లో భారీ కోతలు విధించి విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తోంది. సర్కారు తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
 
 50 శాతానికి..
 రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ప్రతీ విద్యా సంవత్సరంలో స్కూల్ కాంప్లెక్స్‌లు, ఎమ్మార్సీలు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ఎమ్మార్సీలు, స్కూల్ కాంప్లెక్స్‌లకు కేటారుుంచే నిధుల్లో 50 శాతం కోత విధించగా, ఉపాధ్యాయులకు కేటాయించే గ్రాంట్‌లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీని ప్రభావం విద్యావ్యవస్థపై పడనుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు కృత్యధారణ బోధన చేసి విద్యార్థులకు పాఠాలు బోధించాలి. మాదిరి చిత్రాల బోధనతో విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమవుతాయి. నిధుల కోతతో పిల్లలకు నైపుణ్యత విద్య అందకుండా పోనుంది.
 
 ఎమ్మార్సీలకు..
 జిల్లాలో 52 మండల రిసోర్స్ సెంటర్లు (ఎమ్మార్సీ) ఉన్నాయి. ఇదివరకు వీటికి రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించేవారు. ఈ విద్యా సంవత్సరం ఆ నిధులను రూ.50 వేలకు కుదించారు. నిధులు విడుదల చేసిన వాటిలో సంవత్సరానికి ఇంటర్నెట్ కోసం రూ.9వేలు, స్టేషనరి కోసం రూ.8,600, విద్యుత్ బిల్లు కోసం రూ.7200, ఎంఈవో ఫోన్ బిల్లు, టీఏ, ఇతర ఖర్చుల కోసం రూ.7200, మిగితా ఖర్చులు మెయింటనెన్స్ గ్రాంట్, ఎంఈవో ఎఫ్‌టీఎ, సమావేశాల కోసం రూ.18 వేలు చొప్పున కేటారుుంచారు.
 
 స్కూల్ కాంప్లెక్స్‌లకు..
 జిల్లాలో 275 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. నె లకోసారి ఆ మండల ఆవాస పరిధిలోని స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు నెలనెలా సమావేశాలు నిర్వహిస్తారు. ఆ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యే ఉపాధ్యాయులు కృత్యాధారణలతో పాఠాలు బోధించే విధానంపై మిగితా ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తారు. దీనికి సంబంధించి టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం) కోసం నిధులు కేటాయిస్తారు. ఇదివరకు ఒక్కో స్కూల్ కాంప్లెక్స్‌కు రూ.27 వేలు చొప్పున విడుదల చేసేవారు. ఈ విద్యా సంవత్సరం రూ.10వేలు మాత్రమే విడుదల చేశారు. కాంటింజెన్సీ కోసం గతంలో రూ.10 వేలు విడుదల చేయగా, ప్రస్తుతం రూ.6500లకు కుదించారు. సమావేశాలు, టీఏ గ్రాంట్స్ కోసం రూ.12 వేలు ఉండగా రూ.2 వేలకు, కృత్యధారణ కోసం రూ.3 వేల నుంచి రూ.1500లకు తగ్గించారు.
 
 ఉపాధ్యాయులకు కేటాయించని నిధులు..
 పాఠశాలలో విద్యార్థులకు కృత్యాలు తయారు చేసి బోధించేందుకు ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రతీ ఉపాధ్యాయుడికి రూ.500 చొప్పున ఇదివరకు నిధులు విడుదల చేసేవారు. ఈ విద్యా సంవత్సరం ఎలాంటి నిధులు కేటాయించలేదు. జిల్లాలో 9 వేల మంది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ నిధులు కేటాయించకపోవడంతో కృత్యాధారణ బోధన లేకుండా బోర్డుపైనే బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు గుణాత్మక బోధించాల్సిన విద్య దూరమయ్యే పరిస్థితి ఉంది.  నిధు ల కోతపై  మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
 పెంచడంపోరుు తగ్గించారు..
 స్కూల్ కాంప్లెక్స్‌లు, ఎమ్మార్సీలకు నిధులు పెంచాల్సింది పోయి సగానికి తగ్గించారు. ఉపాధ్యాయులకు ఒక్క రూపాయి కూడా గ్రాంట్ విడుదల చేయలేదు. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడనుంది. మాదిరి పాఠ్య బోధన సామగ్రి కోసం నిధులు లేకపోవడంతో నాణ్యమైన విద్య కష్టమే.
 
 - పి.సత్యనారాయణ, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
 పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేం..
 కఠినతర అంశాలను సులభంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు బోధన సామగ్రి అవసరం. ఏటా ఉపాధ్యాయుల గ్రాంటు కింద రూ.500 విడుదల చేశారు. ఈ ఏడాది నిధుల్లో కోత విధించారు. దీంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కష్టంగా మారింది. నిధులు పెంచాలి.
  ప్రతాప్, ఉపాధ్యాయుడు, గిమ్మ పాఠశాల
 
 కుదింపుతో నష్టం లేదు..
 మానవ వనరుల శాఖ నుంచి కుదించి జిల్లాకు బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్ ప్రకారం స్కూల్ కాంప్లెక్స్‌లు, ఎమ్మార్సీలకు నిధులు కేటాయించారు. నిధుల కుదింపుతో విద్యార్థుల ప్రగతికి ఎలాంటి నష్టం వాటిల్లదు. గతంలో ఇచ్చిన నిధులతోనే బోధన చేయవచ్చు. 50 శాతం పరికరాలు పాఠశాలలో ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
 - పెర్క యాదయ్య, పీవో, ఆర్వీఎం  
 
 
 

మరిన్ని వార్తలు