ఆందోళన విరమించిన సాక్షర భారత్‌ ఉద్యోగులు

6 Jul, 2018 16:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించడంతో ఆందోళన బాట పట్టిన సాక్షర భారత్‌ ఉద్యోగులు ఎట్టకేలకు తమ ఆందోళనలను విరమించారు. శుక్రవారం వారితో అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించి,15 రోజుల్లో విధుల్లోకి తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతోనే ఆందోళన విరమించామని, సాక్షర భారత్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీ ప్రకారం పదిహేను రోజుల్లో ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకపోతే మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సాక్షర భారత్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తొలిగించినట్లు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ సాక్షర భారత్‌ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ‘ఏపీ స్టేట్‌ లిటరసీ మిషన్‌ అథారిటీ’ పరిధిలో పని చేస్తున్న 20,503 మంది జిల్లా, మండల, గ్రామ సమన్వయకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ.. వారిని విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలను నియమించి, వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందేలా వ్యూహం కూడా రచించింది. సాక్షర భారత్‌ ఉద్యోగులందరినీ తొలగించాలని వయోజన విద్యావిభాగం డైరెక్టర్‌ను ఆదేశిస్తూ జూన్‌ 1న రాష్ట్ర ప్రభుత్వం మెమో (నం.574896/ ప్రోగ్రాం–3/2017) జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని సమన్వయకర్తలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వయోజన విద్యా విభాగం డైరక్టర్‌ ఎం.అమ్మాజీరావు జూన్‌ 14న సర్క్యులర్‌ మెమో (నెంబర్‌ 600) విడుదల చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతూ.. సాక్షర భారత్‌ ఉద్యోగులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. దీంతో రాజకీయంగా దుమారం రేగడంతో ప్రభుత్వం దిగొచ్చింది.

మరిన్ని వార్తలు