నీరున్నా.. కరెంటు లేదు

24 Dec, 2013 03:14 IST|Sakshi

మోర్తాడ్, న్యూస్‌లైన్: వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అమలు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయానికి ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వ్యవసాయానికి అవసరమైన కొత్త విద్యుత్ కనెక్షన్‌లను జారీ చేయడంలో వాల్టా చట్టాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిసి భూగర్భ జలమట్టం పెరిగినా గతంలోని నివేదికలను ఆధారం చేసుకుని కొత్త కనెక్షన్‌ల జారీకి అడ్డంకులను ప్రభుత్వమే సృష్టిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌పీడీసీఎల్) కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ల జారీకి నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొత్త విద్యుత్ కనెక్షన్‌లను జారీ చేయడాన్ని నిషేధించగా, ఈ నిషేధాన్ని ఏడాది కాలం నుంచి అమలు చేస్తున్నారు. అయితే నిషేధం అమలులో ఉన్న గ్రామంలో తహశీల్దార్ అనుమతితో వేసిన వ్యవసాయ బోరుకు మాత్రం ఎన్‌పీడీసీఎల్ అధికారులు కొత్త కనెక్షన్‌లను ఇచ్చేవారు.
 
 ఇప్పుడు మాత్రం తహశీల్దార్ అనుమతి ఉన్నా వాల్టా చట్టం అమలు అవుతున్న గ్రామాలలోని వ్యవసాయానికి కొత్త కనెక్షన్‌లను ఇవ్వకూడదని ఎన్‌పీడీసీఎల్ యాజమాన్యం క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించింది. ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని నిజామాబాద్ జిల్లాలో తక్కువగా భూగర్భ జలాల శాతం నమోదు అయిన 167 గ్రామాలలో కొత్త విద్యుత్ కనెక్షన్‌లను జారీ చేయడం పూర్తిగా నిలిపివేశారు. ఈ సంవత్సరం భారీగా వర్షపాతం న మోదు కాగా భూగర్భ జలమట్టం అభివృద్ధి చెందిం ది. జిల్లాలో సాధారణ వర్షపాతం 168 మిల్లీమీటర్లు కాగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 260 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయ్యింది. గత సంవత్సరం 12.27 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జల మట్టం ఇప్పుడు 7.60 మీటర్లపైకి వచ్చింది. జిల్లా అంతటా భూగర్బ జల మట్టం భారీగానే వృద్ధి చెం దింది. భూగర్భ జల మట్టం అభివృద్ధి చెం దినా దీనిని పరిగణలోకి తీసుకోని ఎన్‌పీడీసీఎల్ యాజమాన్యం వాల్టాచట్టాన్ని అమలు చేస్తున్న గ్రామాలలో కొత్త కనెక్షన్‌ల జారీకి నిషేధాన్ని వర్తింప చేస్తోంది. ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురియడంతో రైతులు బీడు భూములను అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసి న బీడు భూముల్లో పంటలను సాగు చేయడానికి బోరుబావులు వేస్తున్నారు. బోరుబావులు వేసిన తరువాత పంపుసెట్లను అమర్చాలంటే విద్యుత్ కనెక్షన్ తప్పనిసరి. కొత్త విద్యుత్ కనెక్షన్‌లను పొందడం కోసం రైతులు విద్యుత్ అధికారుల వద్దకు వెళితే అక్కడ తిరస్కరణ ఎదురవుతోంది.
 
 వాల్టా చట్టం అమలు అవుతున్న గ్రామాలలో కొత్త విద్యుత్ కనెక్షన్‌లు జారీ చేసేది లేద ని అధికారులు మొండిగా చెబుతున్నారు. గ్రామాలలో భూగర్భ జలాల మట్టం భారీగా వృద్ధి చెందినా కొత్త విద్యుత్ కనెక్షన్‌ల జారీకి నిషేధాన్ని అమలు చేయడంలో అర్థం లేదని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ భారాన్ని తప్పించుకునేందుకు ఈ నిషేధాన్ని అమలు చేస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. కేంద్ర జల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే వాల్టా చట్టాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఇప్పటివరకు కేంద్ర జల సంఘం భూగర్భ జలమట్టంపై ఇంకా నివేదిక ఇవ్వలేదని తెలిసింది. అందువల్లనే కొత్త కనెక్షన్‌లు జారీ చేయడంపై నిషేధం అమలు అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త విద్యుత్ కనెక్షన్‌ల జారీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు