వడ్డీలేని రుణం.. అందనంత దూరం! 

22 Jan, 2018 17:06 IST|Sakshi

వడ్డీలు కట్టలేక డ్వాక్రా మహిళలు కుదేలు 

 పొదుపు సంఘాలకు అరకొరగా వర్తింపు వడ్డీకి చక్ర వడ్డీలు 

ఆందోళనలో పొదుపు గ్రూపులు 

కోవెలకుంట్ల :  అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళల రుణాలన్నీ భేషరుతుగా మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి గద్దెనెక్కిన సర్కార్‌ అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది. పొదుపు సంఘాల మహిళల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వడ్డీ రుణాలు ఇస్తామని ప్రకటించి పట్టించుకోకపోవడంతో సంఘాలపై వడ్డీభారం పడి కుదేలవుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 4,770 పొదుపు సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో పది నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. బ్యాంకు లింకేజి,ఎస్‌ఎస్‌జీ, స్త్రీనిధి, గ్రామైక్య సంఘం నుంచి రుణాలు తీసుకొని, ఆ రుణాలతో  చీరెల వ్యాపారం, కిరాణ, కొవ్వొత్తుల తయారీ, పాడిపరిశ్రమ, తదితర యూనిట్లు స్థాపించి జీవనంసాగిస్తున్నారు. 

పొదుపు సంఘాలకు అరకొరగా వర్తింపు 
బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను వడ్డీతో సహా సక్రమంగా చెల్లించే గ్రూపులకు ప్రభుత్వం వడ్డీలేని రుణం వర్తింప చేయాల్సి ఉండగా అరకొరగా వర్తింపజేస్తుండడంతో డ్వాక్రా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు . ఐదవ విడత జన్మభూమిని పురస్కరించుకొని ప్రభుత్వం వడ్డీలేని రుణాలను మంజూరు చేయగా నియోజకవర్గంలో కొన్ని సంఘాలకు మాత్రమేవర్తించడంతో మిగతా గ్రూపులు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2016 జూన్‌ వరకు రుణాలు సక్రమంగా చెల్లించిన గ్రూపులకు ఈ రుణం విడుదల అయినట్లు చెబుతున్నారు. వడ్డీలేని రుణం వర్తించినా కొన్నిగ్రూపుల్లోని  సభ్యుల ఖాతాల్లో జమ కాకపోవడంతో దిగాలు చెందుతున్నారు.  సకాలంలో వడ్డీతో సహా రుణాలు చెల్లించినా నాలుగు మండలాల్లో 1,884 గ్రూపులకుమాత్రమే  వడ్డీలేని రుణాలు వర్తించగా మిగిలిన గ్రూపులకు  మంజూరు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీలేని రుణం వర్తిస్తుందని పొదుపు మహిళలు అప్పులు చేసి నెలనెలా వడ్డీతో సహా రుణాలు చెల్లించినా రుణం వర్తించకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పొదుపు గ్రూపులన్నింటికీ వడ్డీలేని రుణంవర్తింపజేయాలని సభ్యులు కోరుతున్నారు. 

వడ్డీలేని రుణం వర్తించలేదు 
పొదుపు గ్రూపు ద్వారా రూ. 7 లక్షల రుణం తీసుకొని బర్రెలు కొనుగోలు చేసి పాడి పరిశ్రమ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం పసుపు, కుంకుమ పథకం కింద రూ. 6వేలు అందజేసింది. వడ్డీలేని రుణం ఇప్పటి వరకు వర్తించలేదు. వడ్డీలకు వడ్డీలు చెల్లించడం కష్టమవుతోంది.  
– లక్ష్మిదేవి, చందన గ్రూపు సభ్యురాలు, నిచ్చెనమెట్ల 

ఇప్పటికైనా రుణం అందించాలి 
పొదుపు గ్రూపులకు వడ్డీలేని రుణం వర్తింపజేసి సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలి. మా గ్రూపు ద్వారా రూ. 5 లక్షలు రుణం తీసుకొని పశుపోషణతో జీవనంసాగిస్తున్నాం. అన్ని గ్రూపులకు వడ్డీలేని రుణం అందించి ఆదుకోవాలి. 
– వెంకటలక్ష్మి, రామలక్ష్మిగ్రూపు సభ్యురాలు, నిచ్చెనమెట్ల 

జమ అవుతోంది  
పొదుపు గ్రూపు సభ్యుల ఖాతాల్లో వడ్డీలేని రుణం జమ అవుతోంది. 2017 మార్చి నెలాఖరు వరకు గ్రూపులకు వడ్డీలేని రుణం మంజూరైంది. విడతలవారీగా అన్ని గ్రూపులకు వర్తిస్తుంది.  
– బాబు, ఏపీఎం, కోవెలకుంట్ల 

మరిన్ని వార్తలు