రూ. 25 కోట్ల స్థలం..ఏడాది లీజు రూ. వెయ్యి

20 Oct, 2018 04:28 IST|Sakshi
కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయానికి ప్రభుత్వం కట్టబెట్టిన ఆటో నగర్‌లోని జలవనరుల శాఖ స్థలం ఇదే. ఇక్కడ దాదాపు కోటి రూపాయల విలువ చేసే కలపను సైతం అమ్ముకొని తెలుగుతమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నారు

కృష్ణాజిల్లా టీడీపీ కార్యాలయానికి సర్కారు నజరానా

విజయవాడ ఆటోనగర్‌లో 93 సెంట్ల జలవనరుల శాఖ స్థలం లీజుకు

33 ఏళ్లపాటు లీజు.. ఆపై 99 ఏళ్ల వరకు పెంచుకునే అవకాశం

ఆటోనగర్‌లో స్థలాలు పరిశ్రమలకు మినహా ఇతర అవసరాలకు వినియోగించకూడదన్ననిబంధన గాలికి..

నేడు మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన

సాక్షి, విజయవాడ: అది రాష్ట్ర రాజధాని విజయవాడ నగరం నడిబొడ్డునున్న ఆటోనగర్‌లోని విలువైన స్థలం. ఎకరం పాతిక కోట్లు పైమాటే. ‘వడ్డించే వాడు మనవాడైతే..’ అన్నట్లు ఇప్పుడు ఈ స్థలం కారుచౌకగా టీడీపీకి రాష్ట్ర ప్రభుత్వం ధారాదత్తం చేసింది. ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల చొప్పున 33ఏళ్లపాటు లీజుకిచ్చింది. అంతేకాదు.. ఆ లీజును 99ఏళ్లకు పొడిగించుకునే సౌలభ్యం కూడా కల్పించింది. పరిశ్రమలు ఉండాల్సిన చోట పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించిన సర్కారు భూపందేరం కథాకమామిషు వివరాలు..

విజయవాడ ఆటోనగర్‌లో జలవనరుల శాఖకు చెందిన 93 సెంట్లు ( సుమారు 4,500 గజాల) స్థలం ఉంది. దీని ఖరీదు కనీసం రూ.25 కోట్లు ఉంటుంది. 2016 జూలైలో జారీచేసిన జీవో 340 ప్రకారం ఈ స్థలాన్ని తమకు కేటాయించాలంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అప్పట్లో దరఖాస్తు చేశారు. అంతే.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని జలవనరుల శాఖ అందుకు క్లియరెన్స్‌ ఇచ్చేసింది. ఆ వెంటనే రెవెన్యూ శాఖ, నగరపాలక సంస్థలూ ఓకే చెప్పేశాయి. ఇంకేముంది.. ప్రభుత్వ ఆమోదంతో ఈ స్థలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల చేతికి వెళ్లిపోయింది. మంత్రి నారా లోకేశ్‌ శనివారం ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఏడాదికి రూ.1000 అద్దె.. 33 ఏళ్లకు లీజు..
ఇంత ఖరీదైన స్థలాన్ని కేవలం వెయ్యి రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం తన ఆధ్వర్యంలోని టీడీపీకి కట్టబెట్టింది. 340 జీవో ప్రకారం సీఆర్‌డీఏ పరిధిలో రాజకీయ పార్టీలకు కేటాయించే ఎకరా స్థలానికి ఏడాదికి రూ.1000 అద్దె చెల్లిస్తే సరిపోతుంది. అయితే, అన్ని రాజకీయ పార్టీలు స్థలాలు అడగకుండా ఉండేందుకు పార్టీ బలాబలాలను బట్టి స్థలం కేటాయించాలని జీవోలో పేర్కొన్నారు. ఈ జీవో ప్రకారం 33 ఏళ్లకు స్థలాన్ని తొలుత లీజుకు తీసుకుని తరువాత దాన్ని 99 ఏళ్లకు లీజును పొడిగించుకోవచ్చు. వాస్తవంగా ఈ స్థలాన్ని ప్రైవేట్‌ సంస్థలకు అద్దెకిస్తే ఏడాదికి ఎంతలేదన్నా రూ.30 లక్షలు అద్దె వస్తుందని ఆటోనగర్‌ పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. అంత విలువైన స్థలాన్ని కేవలం ఏడాదికి రూ.వెయ్యికే అద్దెకు ఇవ్వడంపై వారు విస్తుపోతున్నారు. 

మంత్రి ఉమా డైరెక్షన్‌లోనే..
ఇదిలా ఉంటే.. కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీకి విజయవాడలో శాశ్వత భవనంలేదనే అపవాదును తొలగించేందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తమ శాఖకు చెందిన స్థలాన్ని కట్టబెట్టి, అక్కడ తన ఆధ్వర్యంలోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు రంగం సిద్ధం  చేస్తున్నారని కొందరు ఇరిగేషన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. సుమారు ఎకరం మేర ఉన్న ఇక్కడ.. ఇరిగేషన్‌ కార్యాలయాలు కట్టాలని ఆ శాఖ ఉద్యోగ సంఘాలు గతంలో డిమాండ్‌ చేశాయి. ఈ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించి కేసీ డిజన్, కేఈ డివిజన్, స్పెషల్‌ డివిజన్, పులిచింతల డివిజన్‌ తదితర శాఖలను ఇక్కడకు మార్చాలని రెండేళ్ల క్రితం అధికారులు కూడా భావించారు. అయితే, అప్పట్లోనే మంత్రి దేవినేని ఉమా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఆయా కార్యాలయాలను జిల్లాకు తరలించాలంటూ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రూ.25 కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి కట్టబట్టేందుకే అప్పట్లో ఇరిగేషన్‌ కార్యాలయాల ప్రతిపాదనను మంత్రి తోసిపుచ్చారని ఆ శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు.

కలపనూ వదలి పెట్టలేదు..
మరోవైపు.. ఈ స్థలంలో సుమారు వందేళ్ల నాటి చెట్లు ఉన్నాయి. అలాగే, ఇరిగేషన్‌ శాఖకు చెందిన షెడ్లు ఉన్నాయి. వీటి కలప విలువ సుమారు రూ.కోటి వుంటుందని అంచనా. వీటిని కూల్చివేసి వచ్చిన కలపనంతా తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా మౌనంగా వున్నారు. మంత్రి లోకేష్‌ వస్తుండడంతో మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు రాత్రి, పగలు అక్కడే మకాం వేసి పనులు చకచకా చేయిస్తున్నారు. 

నిబంధనలకు విరుద్ధంగా..
ఇదిలా ఉంటే.. విజయవాడ ఆటోనగర్‌కు ఆసియాలోనే అతిపెద్దదిగా గుర్తింపు ఉంది. ఇక్కడ పరిశ్రమలు మినహా ఇతర వేటికీ అనుమతించకూడదనే నిబంధన ఉంది. అయితే, ఈ నిబంధనను ప్రభుత్వ పెద్దలు తుంగలో తొక్కి టీడీపీ కార్యాలయానికి కట్టబెడుతూ జీవో ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఆటోనగర్‌లో పార్టీ కార్యాలయం నిర్మిస్తే.. పరిశ్రమలకు పొందే అన్ని రాయితీలు పొందవచ్చని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. కాగా, అధికారంలో ఉండగానే జిల్లా పార్టీకి విజయవాడలో ఒక కార్యాలయం నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒత్తిడి మేరకే పార్టీ నేతలు ఈ స్థలాన్ని ఎంపిక చేసి ముఖ్యమంత్రికి చెబితే ఆయన అందుకు ఆమోదించారని పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. భవిష్యత్తులో ఇక్కడ భారీ భవనాన్ని నిర్మిస్తామని వచ్చే ఎన్నికలకు ఇక్కడ నుంచే జిల్లా కార్యాక్రమాలన్నీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు