జనం నెత్తిపై ‘బాండ్ల’ కుంపటి

19 Aug, 2018 03:19 IST|Sakshi

అమరావతి బాండ్ల వెనుక ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాలు 

వాణిజ్య బ్యాంకులు తక్కువ వడ్డీకే ఇస్తున్నా బాండ్లపైనే మోజు

తీసుకున్న అప్పు ఎంతో వడ్డీ కూడా అంతే.. 

పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువ వడ్డీ నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం అప్పు రూ.2,000 కోట్లు.. 

పదేళ్లలో చెల్లించాల్సిన వడ్డీ రూ.2000.80 కోట్లు 

సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంకుతో సహా జాతీయ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో బాండ్లు జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ వడ్డీ అయినప్పటికీ బాండ్ల జారీ ద్వారానే అప్పులు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రాజెక్టు కోసం విదేశీ, స్వదేశీ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటే ఈ సొమ్మును అదే ప్రాజెక్టుకు ఖర్చు చేయాలి. ఇతర అవసరాలకు మళ్లించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వీలుండదు. ఈ నిబంధన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అస్సలు నచ్చలేదు. బాండ్ల జారీ ద్వారా అప్పులు చేస్తే ఇష్టానుసారంగా ఆ డబ్బును వాడుకోవచ్చని నిర్ణయానికొచ్చారు. అందుకే బాండ్ల ద్వారానే అప్పులు తీసుకురావాలని ఆదేశించారు. 

సీఆర్‌డీఏ ప్రామిసరీ నోట్‌ 
ఆర్థిక శాఖ ఒప్పుకోకపోయినా అమరావతి బాండ్ల జారీకే ముఖ్యమంత్రి మొగ్గు చూపారు. ఆర్థిక శాఖ చేసిన సూచనలను పట్టించుకోలేదు. అమరావతి బాండ్ల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేస్తోందో అంతే మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అంటే బాండ్ల ద్వారా రూ.2,000 కోట్ల అప్పులు చేస్తుండగా అసలు కాకుండా వడ్డీ, దళారీ ఫీజు కలిపి పదేళ్లలో రూ.2,000.80 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అసలు బాండ్లు అంటే మేము ఇంత వడ్డీ చెల్లిస్తామంటూ అప్పులు ఇచ్చే సంస్థకు ప్రామిసరీ నోటు రాసివ్వడం లాంటిదే. అమరావతి బాండ్ల జారీలో 10.32 శాతం వడ్డీ ఇస్తామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ప్రామిసరీ నోటు రాసిచ్చేసింది. ఎక్కడా లేనివిధంగా ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని చెప్పడం, అప్పుతోపాటు వడ్డీకి సైతం గ్యారెంటీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అమరావతి బాండ్లకు అప్పు ఇవ్వడానికి చాలా సంస్థలు ముందుకొచ్చాయి. ఏడాదికి 10.32 శాతం వడ్డీ అంటే.. రూ.2,000 కోట్ల అప్పునకు ఏడాదికి వడ్డీ కింద రూ.247.68 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీని ప్రతి మూడు నెలలకోసారి ఆరేళ్ల పాటు చెల్లించాలి. ఏడాదికి రూ.247.68 కోట్ల చొప్పున ఆరేళ్లలో వడ్డీ కింద రూ.1,486.08 కోట్లు చెల్లించక తప్పదు. ఆ తరువాత ఏడాది నుంచి అసలు అప్పులో 20 శాతం అంటే రూ.400 కోట్లతోపాటు వడ్డీ కింద రూ.198.14 కోట్లు చెల్లించాలి. ఆ మరుసటి ఏడాది మరో రూ.400 కోట్ల  అసలుతోపాటు వడ్డీ కింద రూ.148.60 కోట్లు చెల్లించాలి. ఆ తరువాత ఏడాది అసలు రూ.400 కోట్లతోపాటు వడ్డీ కింద రూ.99.07 కోట్లు కట్టాలి. చివరి ఏడాది అసలు రూ.400 కోట్లతోపాటు వడ్డీ కింద రూ.49.53 కోట్లు చెల్లించాలి. అంటే మొత్తం అసలు రూ.2,000 కోట్లతోపాటు వడ్డీ కింద రూ.1,981.42 కోట్లు, బ్రోకరేజీ సంస్థ ఫీజు, జీఎస్టీ కలిపి రూ.19.40 కోట్లు చెల్లించాలి. బాండ్ల ద్వారా ఎంత అప్పు తీసుకుంటున్నామో అంతే మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. 

ఆర్థిక శాఖ సూచనలు బేఖాతర్‌ 
8 శాతం కంటే ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవద్దని సీఆర్‌డీఏకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. హడ్కో దగ్గర తీసుకునే అప్పులపైనా వడ్డీ 8 శాతం లోపే ఉండాలని, ఈ మేరకు హడ్కోతో సంప్రదింపుల జరపాలని సూచించింది. వడ్డీ శాతాన్ని హడ్కో తగ్గించకపోతే ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి ప్రభుత్వ గ్యారెంటీతో 8 శాతం కంటే తక్కువ వడ్డీకి అప్పులు ఇప్పిస్తామని స్పష్టం చేసింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లు జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని, అలా చేస్తే కేంద్రం ఇచ్చే పన్ను రాయితీతో 6 శాతం కంటే తక్కువ వడ్డీకే ఆ బాండ్ల ద్వారా అప్పులు వస్తాయని ఆర్థిక శాఖ వెల్లడించింది.

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అప్పుల కోసం ఆర్థిక శాఖ పలు మార్గాలను సూచించినప్పటికీ ప్రభుత్వం మాత్రం అత్యధిక వడ్డీకి అమరావతి బాండ్లు జారీ చేయడం వెనుక లోగుట్టు ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరో ఆరు నెలల్లో టీడీపీ ప్రభుత్వం పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో అందిన చోటల్లా అప్పులు చేసి కమీషన్లు దండుకోవడమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రభుత్వ పెద్దలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

పొరుగు రాష్ట్రాలను చూసైనా నేర్చుకోరా? 
ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే రెవెన్యూ లోటుతో సతమతమవుతోంది. మరోవైపు ప్రభుత్వం గత నాలుగేళ్లలో భారీగా అప్పులు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి బాండ్ల పేరుతో అత్యధిక వడ్డీ చెల్లించేందుకు ముఖ్యమంత్రి సిద్ధపడడాన్ని ఉన్నతాధికారులు తప్పుపడుతున్నారు. ‘‘పొరుగు రాష్ట్రం తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ లేకుండానే బాండ్లు జారీ చేస్తే కేవలం 9.38 శాతం వడ్డీకే అప్పులు ఇవ్వడానికి పలు సంస్థలు ముందుకొచ్చాయి.

కర్ణాటక ప్రభుత్వం 5.85 శాతం వడ్డీకే అప్పులు తెచ్చుకుంటోంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ ఏకంగా మనమే కూపన్‌ రేటుగా అమరావతి బాండ్లకు 10.32 శాతం వడ్డీని ఎలా నిర్ధారిస్తారు?’’ అని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అమరావతి బాండ్ల దళారీకి ఇస్తున్న ఫీజు కూడా తెలంగాణాతో పోల్చి చూస్తే భారీగా ఉంది. జీహెచ్‌ఎంసీ బాండ్లలో బ్రోకరేజీ సంస్థకు అప్పులో 0.1 శాతం ఫీజు చెల్లిస్తుండగా, అమరావతి బాండ్లలో బ్రోకరేజీ సంస్థకు 0.85 శాతం చెల్లిస్తుండడం గమనార్హం. 

మరిన్ని వార్తలు