‘ఇసుక’ దుమారంలో అధికారులే బలి

9 Sep, 2015 01:05 IST|Sakshi
‘ఇసుక’ దుమారంలో అధికారులే బలి

నియమ నిబంధనలు కాలరాస్తోన్న ప్రభుత్వ పెద్దలు
♦ డబ్బులు దండుకుంటున్న టీడీపీ నేతలు
♦ వారి పాపం అధికారుల మెడకు చుట్టుకుంటున్న వైనం
♦ క్రయవిక్రయాల నుంచి తప్పించాలంటున్న సిబ్బంది
 
 సాక్షి, హైదరాబాద్ : సర్కారు ఇసుక వ్యాపారంలో ప్రభుత్వ అధికారులు బలైపోతున్నారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో దోచుకుతింటున్న టీడీపీ ప్రజాప్రతినిధుల వల్ల వ్యాపారం చేస్తోంది ప్రభుత్వమే కాబట్టి వారి పాపం అధికారులు, కిందిస్థాయి సిబ్బంది మెడకు చుట్టుకుంటోంది. ఇసుక అమ్మకాల్లో అక్రమాలను అరికట్టడం కోసం రూపొందించిన నియమ నిబంధనలను ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు కాలరాస్తున్న కారణంగా తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కోర్టు ముందు దోషిగా నిలబడాల్సి వస్తోంది. గతంలో కృష్ణా జిల్లాలో ఎమ్మార్వో వనజాక్షి ఇసుక మాఫియా చేతుల్లో దాడికి గురికావాల్సి వచ్చింది.

ఇసుక మాఫియా ఆగడాలకు తాళలేక చివరకు రీచ్‌ల వద్ద ఇసుక క్రయవిక్రయాలను పర్యవేక్షించాల్సిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సిబ్బంది తమను విధుల నుంచి తప్పించాలని కోరుతున్నారు. ఈమేరకు ప్రకాశం జిల్లాలో కిందిస్థాయి సిబ్బంది తమను ఈ విధుల నుంచి త ప్పించాలని ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది కిందట కొత్త ఇసుక విధానాన్ని ప్రకటించిన తర్వాత కొంతకాలంగా దీని ద్వారా వచ్చే ఆదాయంపై దృష్టి కేంద్రీకరించడం మొదలుపెట్టింది. వ్యాపారం చేస్తోంది ప్రభుత్వమే కాబట్టి ఇందులో నియమ నిబంధనలు పూర్తిగా పక్కకుపోయాయి. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది.

 అక్రమాలకు ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం
 పలు నియమ నిబంధనలతో గతేడాది ఆగస్టు 28న కొత్త ఇసుక విధానం తెచ్చిన సర్కారు.. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో  వాటిని అమలు చేయకుండా పూర్తిగా గాలికొదిలేసింది.

  రీచ్‌లో కూలీల ద్వారా ఇసుక తవ్వకం వీలుకాని చోట్ల పొక్లెయిన్లను నామమాత్రంగా ఉపయోగించాలని స్పష్టంగా పేర్కొంది. వాస్తవ పరిస్థితుల్లో దాదాపు అన్ని ప్రధాన రీచ్‌ల్లోనూ పొక్లెయిన్ల వాడకం యథేచ్చగా కొనసాగుతోంది. నదులకు పరిసరాల్లోని దాదాపు 101 పెద్ద రీచ్‌లకుగాను అందులో 74 చోట్ల పొక్లెయిన్ల ద్వారానే ఇసుక తవ్వకాలకు అనుమతించారు. గోదావరి, కృష్ణా నదులున్న ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కటి మినహా అన్ని రీచ్‌ల్లో పొక్లెయిన్లను వాడుతున్నారు.

  ఇసుక అమ్మకాలు కేవలం స్టాక్ పాయింట్ వద్దనే జరగాలని పేర్కొన్నా... దాదాపు అన్ని చోట్ల రీచ్‌లోకి అనుమతి ఇస్తూ, అక్కడే వినియోగదారుల వాహనాలకు ఇసుకను లోడ్ చేస్తున్నారు. 359 ఇసుకరీచ్‌లు ఉంటే స్టాక్ పాయింట్‌లు కేవలం 22 మాత్రమే ఉన్నాయి.
 
రీచ్‌లో కేవలం ఒక మీటరు లోతు మాత్రమే ఇసుక తవ్వకం జరపాలి. పొక్లెయిన్ల వాడకంతో దాదాపు అన్ని చోట్లా ఇసుక దొరికినంత వరకు లోతున తవ్వకాలు జరుగుతున్నాయి.
  ప్రతి ఇసుక రీచ్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా... కేవలం 37 చోట్లే వాటిని అమర్చారు.

మరిన్ని వార్తలు