సర్‌చార్జీలపై ప్రభుత్వానికే అధికారం : దొర

6 Nov, 2013 02:38 IST|Sakshi


 గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ :
 ఇటీవల కాలంలో  పెంచుతున్న సర్‌చార్జీలు ప్రభుత్వ నిర్ణ యం మేరకే జరిగాయని... తామేమీ చేయలేమని  ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్.వై.దొర అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం నూజివీడు, గుడివాడ డివిజన్లలోని ఎలక్ట్రిసిటీ శాఖకు చెందిన డీఈ, ఏఈలతో ఆయన సమావేశాలను ఏర్పాటు చేశారు.ఆయనతో పాటు డెరైక్టర్ జె.నాగేశ్వరారవు, కృష్ణా-గుంటూరు-ప్రకాశం చీఫ్ ఇంజినీర్ రాజబాపయ్య,  జేఈ ఆర్.మోహాన్‌కృష్ణ ఉన్నారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని సబ్ స్టేషన్లో జరిగిన సమావేశంలో దొర మాట్లాడుతూ సర్‌చార్జీల విషయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించాల్సిందేనని  స్పష్టం చేశారు. వ్యవసాయానికి 7గంటల విద్యుత్ అందించి రైతులకు మేలు చేస్తామన్నారు. అలాగే గ్రామాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని  ఏపీ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్-327 సభ్యులు  దొరను కోరారు.  సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.  యూనియన్ అధ్యక్షుడు వి.కృష్ణారావు, కార్యదర్శి ఓ.రాఘవ, వర్కింగ్ ప్రెసిడెంట్ జి.విన్సెంట్, ట్రెజరర్ శ్రీరామ్, జిల్లా వైస్‌ప్రెసిడెంట్ కృష్ణమోహాన్, సత్యప్రసాద్  పాల్గొన్నారు.
 
 నాణ్యమైన విద్యుత్ అందిస్తాం...
 నూజివీడురూరల్ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని హెచ్‌వై దొర అన్నారు.  స్థానిక డీఈ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వినియోగ దారుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.  నూజివీడు డివిజన్ పరిధిలో 14 సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు.  డిస్కం పరిధిలోని 6జిల్లాలో ‘హెచ్‌విడిఎస్’ పూర్తిచేయడానికి రూ.వెయ్యికోట్లతో  చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించుకునేందుకు సెంట్రలైడ్ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని, విద్యుత్ బిల్లుల కోసం ఆన్‌లైన్‌లో ‘స్పందన’ కార్యక్రమం ద్వారా సమస్యలను రికార్డు చేయవచ్చన్నారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది తక్షణం స్పందిస్తారని ఆయన పేర్కొన్నారు.  ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ, డీఈలు వెంకటేశ్వరరావు, కమలకుమారి, పలువురు ఏఈలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు