ఎల్‌ఆర్‌ఎస్ లేకున్నా.. భవన నిర్మాణాలకు అనుమతి

23 Sep, 2013 03:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  అనధికార లే-అవుట్‌లలో ప్లాట్లు కొనడం వల్ల భవన నిర్మాణాలకు అనుమతి రావడం లేదని మీరిక బాధపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు కొన్న ప్లాట్లు 2008 జనవరి కంటే ముందు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అప్పుడు అపరాధ రుసుము వసూలు చేసుకుని ఇంటి నిర్మాణాలకు అనుమతించేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లతోపాటు పట్టణాభివృద్ది సంస్థలకు సర్క్యులర్ రూపంలో అధికారులు సమాచారం అందించారు. అనధికార లేఅవుట్‌లోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఇదివరకు ఇచ్చిన గడువు ముగియడంతో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీనితో ప్లాట్లు కొన్నా.. వాటికి అనుమతులు రాని పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలోనే.. ఖాళీ ప్రదేశ రుసుము(ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్)ను దరఖాస్తు చేసుకున్న తేదీన రిజిస్ట్రేషన్ విలువలో 14 శాతం జరిమానాను, అలాగే ప్లాటు క్రమబద్ధీకరణ కింద అపరాధ రుసుము 14 శాతంతోపాటు భవన నిర్మాణ అనుమతికి సంబంధించి చార్జీలు చెల్లించిన పక్షంలో వారిని నిర్మాణానికి అనుమతించనున్నారు.
 
 అయితే ఇదంతా 2008 జనవరికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు అందులో స్పష్టం చేశారు. 2008 జన వరి తరువాత రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2008 జనవరి తరువాత ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు ఇళ్ల నిర్మాణం చేయడానికి వీలుగా నాలుగైదు సూచనలతో అధికారులు ప్రభుత్వానికి సిఫారసులు చేశారు. కాని వాటిపై దృష్టి పెట్టేందుకు పాలకులకు సమయం చిక్కడం లేదు. ఒక లేవుట్‌లోని క్రమబద్ధీకరణ కాని ప్లాట్ల యజమానులంతా కలిసి తిరిగి లేఅవుట్ రూపొందించుకుని, నిబంధనల ప్రకారం ఖాళీ స్థలాలకు 10 శాతం, రహదారుల కోసం 30 శాతం స్థలాన్ని వదిలేసి తిరిగి లే అవుట్ చేసుకుని అన్ని రకాల చార్జీలు చెల్లిస్తే కొత్త లే అవుట్ మంజూరు చేయాలని, లేని పక్షంలో అనధికార లే అవుట్‌లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిబంధన విధించాలని, మరోసారి కటాఫ్ డేట్ విధించి తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని కూడా అనుమతించాలని నివేదించారు. ప్రభుత్వం దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు