బాక్సైట్‌ లూటీకి సర్కారు ఎత్తుగడ!

27 Sep, 2017 02:19 IST|Sakshi
థాట్రాజ్‌ ఎస్టీ కాదంటూ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీం తీర్పు

 టీఏసీలో టీడీపీ నేతలను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం 

మండలిలో మెజారిటీ కోసం ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించిన సర్కారు

సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లుగా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయకుండా నాన్చిన ప్రభుత్వం.. ఇప్పుడు టీడీపీ నేతలతో మండలిని నింపేయడంపై గిరిజన సంఘాల నేతలు, మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గిరిజన సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసిందని దుయ్యబడుతున్నారు. మూడేళ్లుగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తున్నా సలహా మండలి ఊసెత్తని ప్రభుత్వం ఇప్పుడు తనవారిని మండలిలో నియమించడం స్వప్రయోజనాల కోసమేనని మండిపడుతున్నారు. విశాఖ మన్యంలో లక్షల కోట్ల విలువైన బాక్సైట్‌ను, గిరిజన ప్రాంతాల్లో అత్యంత విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడ వేసిందని అంటున్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ఉద్దేశించిన సలహామండలిలో గిరిజనేతరులను, టీడీపీ వారిని నియమించడాన్ని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ తప్పుబట్టారు. దీనిపై కేంద్ర గిరిజన సంక్షేమ మండలికి ఫిర్యాదు చేస్తానని శర్మ చెప్పారు.

బాక్సైట్‌ కోసం ఆనవాయితీకి విరుద్ధంగా
రాష్ట్ర అత్యున్నత చట్టసభల్లో సభ్యులుగా ఉన్న గిరిజన ప్రజా ప్రతినిధులను టీఏసీలో సభ్యులుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా, గిరిజన ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమిస్తూ 2009, 2012లో కూడా ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటే గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై శ్రద్ధ చూపుతారనే ఉద్దేశంతో వారిని నియమించడం సాధారణంగా జరుగుతూ వస్తోంది. అడవిలో ఎలాంటి ఖనిజాన్ని తవ్వాలన్నా గిరిజన సలహా మండలి తీర్మానం తప్పనిసరి. గతంలోలా గిరిజన ఎమ్మెల్యేలను మాత్రమే టీఏసీ సభ్యులుగా నియమిస్తే ప్రభుత్వం మాట చెల్లదు. ఎందుకంటే శాసనసభలో మెజారిటీ గిరిజన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందినవారు. వీరు సభ్యులుగా ఉంటే ప్రభుత్వం గిరిజన వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుకాదు. నిజానికి గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అనేకమార్లు డిమాండ్‌ చేశారు. గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం కూడా సమర్పించారు. జగన్‌ పోరాటం, కోర్టు జోక్యంతో మూడేళ్ల తర్వాత విధిలేక టీఏసీని ఏర్పాటు చేసింది.  

గిరిజన ఎమ్మెల్యేలకు అదనంగా... 
ప్రస్తుతం రాష్ట్రంలో ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలు ఉండగా ఆరుగురు వైఎస్సార్‌సీపీ వారే. వీరిలో అరకు ఎమ్మెల్యే కె. సర్వేశ్వరరావును టీడీపీ ప్రలోభపెట్టి తనవైపు తిప్పుకుంది. టీడీపీ నుంచి ముడియం శ్రీనివాసరావు(పోలవరం) మాత్రమే ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం నాన్‌ అఫిషియల్‌ సభ్యులు(లెజిస్లేటివ్‌ అసెంబ్లీ) కింద టీఏసీలో స్థానం కల్పించింది. అయితే వీరితో పాటు మరో ఎనిమిది మంది టీడీపీ ప్రతినిధులను నామినేటెడ్‌ సభ్యులుగా చేర్చింది. ఇందులో గుమ్మడి సంధ్యారాణి మాత్రం అధికార పక్ష ఎమ్మెల్సీగా ఉన్నారు. మిగిలిన ఏడుగురు (నిమ్మక జయకృష్ణ, జనార్దన్‌ థాట్రాజ్, మత్సరాస మణికుమారి, కేపీఆర్‌కే ఫణీశ్వరి, మునావత్‌ ధౠరు నాయక్, ఎం.జీవుల నాయక్, వేలూరు రంగారావు) టీడీపీ వారే. వాస్తవానికి జనార్దన్‌ థాట్రాజ్‌ ఎస్టీ కాదని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీర్పు చెప్పింది. అయినా ఖాతరు చేయకుండా ప్రభుత్వం ఆయన్ను గిరిజన సలహా మండలిలో నియమించింది.

మరిన్ని వార్తలు