రైతుల జీవితాలతో చెలగాటం

17 Jun, 2017 01:11 IST|Sakshi
రైతుల జీవితాలతో చెలగాటం
సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
 
సాక్షి ప్రతినిధి, కడప: ‘రైతుల పంటలకు గిట్టుబాటు ధరల్లేవు. మూడేళ్లుగా ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. ఇన్సూరెన్సు లేదు. రైతుల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెలగాటం అడుతున్నారు. ఇన్సూరెన్సు వర్తిస్తే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వరాదని స్వయంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అవకాశం ఉండి కూడా ప్రాజెక్టులు పూర్తిచేయలేదు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితు లు కల్పిస్తున్నారు.రైతుల పట్ల ఇంతటి దారుణంగా వ్యవహరిస్తున్నారు’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ జిల్లా వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లె గ్రామానికి చెందిన సిరిగిరెడ్డి హర్షవర్థన్‌రెడ్డి (32) అప్పులబాధ తాళలేక మే 5న ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రైతు కుటుంబానికి శుక్రవారం సాయంత్రం  జగన్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.వివరాలు  జగన్‌మోహన్‌రెడ్డి మాటల్లో...
 
గండికోట పూర్తి చేసి ఉంటే...
‘‘అప్పుల బాధ తాళలేక ఉసురు తీసుకున్న హర్షవర్థన్‌రెడ్డికి ఎల్‌కేజీ, 1వ తరగతి చదువుతున్న పిల్లలు. 3.50 ఎకరాల పొలంలో చీనీచెట్లు వేశాడు. ఆ చెట్లను బతికించుకునేందుకు బోర్లు వేసి అప్పులపాలయ్యాడు. ఎనిమిది బోర్లు వేశారు. ఒక్క బోరుకూ నీరు పూర్తిగా రాలేదు. మరోవైపు భార్య పేరుపై ఉన్న రూ.1లక్ష డ్వాక్రా రుణం కూడా మాఫీ కాలేదు. చివరకు అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రబాబు మూడేళ్లల్లో గండికోట ప్రాజెక్టు పూర్తిచేసి ఉంటే ఈ రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు.

సర్వరాయసాగర్‌లో నీరుంటే భూగర్భజలాలు పెరిగి ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. మూడేళ్లైనా దాన్ని పట్టించుకున్నోళ్లు లేరు. ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ (వరద కాలువ) పూర్తి చేయాలనే ఆలోచన లేదు. గండికోట పూర్తిచేసి ఆ ప్రాజెక్టులో 26 టీఎంసీలు నీరు నింపాలన్న ఆలోచన అసలే లేదు. రైతు చనిపోయి నెలదాటినా ఇప్పటివరకూ ఒక్క అధికారి రాలేదు. చివరకు ఎమ్మెల్యేనే పూర్తి సమాచారంతో కలెక్టర్‌కు దరఖాస్తు చేసినా ఒక్క రూపాయి పరిహారం దక్కలేదని రైతు భార్య చెప్పింది. చంద్రబాబు ఇస్తాడు, చేస్తాడు అనే నమ్మకం పోయింది’’ అని అన్నారు.