ఎనిమిదేళ్లకు బడి తీశారు..!

12 Jun, 2019 08:41 IST|Sakshi

కార్పొరేట్‌ హంగులకు ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం మూతపడిన ఓ పాఠశాల ఉపాధ్యాయుల కృషితో మళ్లీ ఈ ఏడాది పునఃప్రారంభం కాబోతోంది. పిల్లలు లేక తలుపులు మూతపడి బోసిపోయిన పాఠశాల మళ్లీ విద్యార్థులతో కళకళలాడనుంది. 
సాక్షి,ప్రకాశం : సంతమాగులూరు  పరిధిలోని రామిరెడ్డిపాలెం గ్రామంలో 20 సంవత్సరాల కిందట ప్రభుత్వం ఓ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో 28 విద్యార్థులతో కొనసాగిన పాఠశాల... ప్రైవేట్‌ స్కూళ్ల దెబ్బకు ఏడాది ఏడాది పిల్లల సంఖ్య తగ్గిపోతుండటంతో 2013 లో పాఠశాలను మూసివేశారు. అప్పటి నుంచి బోసిపోయిన పాఠశాల ఈ ఏడాది మళ్లీ తీస్తుండటంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది 17 మంది విద్యార్థులు ఇటీవల చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా చేరారని ఎంఈవో కోటేశ్వరరావు తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలలను ఆదరించండి
ప్రైవేట్‌ పాఠశాలల్లో వేలకు వేలు ఖర్చు చేస్తున్న వారు ప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రోత్సహించాలని ఎంఈవో అన్నారు.  రెండు నెలల నుంచి ఈ పాఠశాలను మళ్లీ తెరవాలనే ఉద్దేశంతో ఉదయం సాయంత్రం తేడా లేకుండా ఉపాధ్యాయులందరూ రామిరెడ్డిపాలెంలోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ తిరిగి పాఠశాలను తెరవాలని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు.

17 మందితో మళ్లీ ప్రారంభం 
రామిరెడ్డిపాలెంలోని ప్రభుత్వ పాఠశాలకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది. తల్లిదండ్రులు కేవలం మంచి విద్యాబోధన ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉందని అటు వైపు వెళ్లిన వారంతా ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటంతో తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలవైపే చొరవ చూపుతున్నారు. దీంతో ఈ సంవత్సరం 17 మంది విద్యార్థులు బడిలో చేరారు. 12వ తేదీ నుంచి ఈ పాఠశాలను తెరుస్తున్నామని ఒక ఉపాధ్యాయుడుతోపాటు వాలంటరీని కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎంఈవో తెలిపారు.

ఫలించిన ఉపాధ్యాయుల కృషి
ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలను ఎలాగైనా తెరిపించాలనే లక్ష్యంతో రామిరెడ్డిపాలెం గ్రామంలో రెండు నెలల నుంచి  ఉపాధ్యాయులు, ఎంఈవో కలిసి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తామని హామీ ఇవ్వటంతో ఉపాధ్యాయుల కృషి ఫలించింది. 

>
మరిన్ని వార్తలు