ఆరునూరైనా అ‘ధనం’ తెండి..

8 Jul, 2014 01:19 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి : జనం నుంచి పన్నుల ద్వారా వచ్చే సొమ్ములను ముక్కు పిండి వసూలు చేయడమే ప్రస్తుత ప్రభుత్వం కర్తవ్యంగా మారింది. దీంతో ఖజానా సంబంధ శాఖలు సర్కారు గల్లాపెట్టె ఎలా నింపాలా అని మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయ మార్గాలకు కీలకమైన వాణిజ్య పన్నుల శాఖపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. ఆ శాఖకు భారీ లక్ష్యాలను నిర్దేశించింది. ‘పాత బకాయిలు వసూలు చేస్తారో లేక మరింత మందిని పన్ను పరిధిలోకి తెస్తారో తెలీదు.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికాంతానికి రూ.పది కోట్లకు పైగా అదనపు ఆదాయం తేవా’లని జిల్లా అధికారులపై భారం మోపింది. దీంతో ముందుగా పాత బకాయిలను ముక్కు పిండి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఆ శాఖ అధికారులు.
 
అంతే కాక పన్నుల పరిధిలోకి రాని వారిని గుర్తించి పన్నుల చట్రంలోకి లాగేందుకూ కసరత్తు చేస్తున్నారు. కాకినాడ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలో 11 సర్కిళ్లుండగా ఒక్కో దాన్నుంచి ప్రతి త్రైమాసికంలో రూ.నాలుగు కోట్ల నుంచి  రూ.ఆరు కోట్ల ఆదాయం లభిస్తుంది. పన్ను లక్ష్యంలో 60 నుంచి 80 శాతం వసూలవుతుంటుంది. 13 జిల్లాలతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆదాయ మార్గాల్లోనే అదనపు సొమ్ము రాబట్టే పనిలో పడింది. తూర్పుగోదావరి వంటి పెద్ద జిల్లా నుంచి వచ్చే ఆదాయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల నుంచి పాత టార్గెట్‌లకు మించి పన్ను వసూలు చేయాలని వాణిజ్యపన్నుల శాఖను ఆదేశించింది.
 
సీటీఓల కసరత్తు
అదనపు ఆదాయాన్వేషణలో భాగంగా సర్కిళ్ల వారీ సీటీఓలు రెండు రోజులుగా ఇదే కసరత్తులో నిమగ్నం అయ్యారు. కోర్టు కేసుల్లో ఉన్న బకాయిలు మినహా మిగిలిన వాటిని ముక్కు పిండి వసూలు చేసేందుకు కార్యాచరణ తయారు చేస్తున్నారు. జూలై నుంచి సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికానికి ఒక్కో సర్కిల్ నుంచి కనీసం రూ. కోటి   అదనంగా రాబట్టాలని చూస్తున్నారు. పన్ను బకాయిదారులకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. సీటీఓల వారీ ప్రస్తుతం వరకూ ఉన్న బకాయిల చిట్టాలను డిప్యూటీ కమిషనర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. కాగా వివిధ వ్యాపారాలు, వాణిజ్య కార్యలాపాలు నిర్వహిస్తూ పన్ను చెల్లింపు పరిధిలోకి రాని వారిని గుర్తించి పన్ను పరిధిలోకి తీసుకురావడంతో పాటు ఎంత కాలం నుంచి పన్ను పరిధిలోకి రాకుండా ఉన్నారో గుర్తించి అప్పటి నుంచే పన్ను విధించాలని చూస్తున్నారు.  
 
వస్త్రాలపై మళ్లీ ‘వ్యాట్’ వడ్డన..?
మిల్లు తయారీ వస్త్రాలపై విధించే ఐదు శాతం విలువ ఆధారిత పన్నును వస్త్ర వ్యాపారులు ఆందోళన చేసి రద్దు చేయించుకున్నారు. ఇందు కోసం 2011, 2012 సంవత్సరాల్లో జరిగిన  ఉద్యమంలో హోల్‌సేల్ వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరైన తూర్పుగోదావరి జిల్లా కీలక పాత్ర పోషించింది. విభజనానంతరం ఆర్థిక దుస్థితిని సాకుగా చూపి ఇప్పుడు వస్త్రాలపై వ్యాట్‌ను పునరుద్ధరించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారులు అలాంటిదేమీ లేదని పైకి చెబుతున్నా.. కాదేదీ పన్ను కనర్హం అంటూ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు