ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉపాధి కరువు

14 Jun, 2015 04:19 IST|Sakshi
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉపాధి కరువు

- ఫార్మా-డి డాక్టర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
లబ్బీపేట :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉపాధి మార్గం లేక ఫార్మా-డి కోర్సు చేసినవారు బజారున పడాల్సిన దుస్థితి నెలకొందని అసోసియేషన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫార్మశీ, ఫార్మా-డి డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫార్మా-డి కోర్సు పూర్తిచేసి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బం దులు పడుతున్నామంటూ విద్యార్థులు శనివారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పుష్పా హోటల్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు చర్యలు లేకుండా ఎంతో ఆర్భాటంగా కోర్సు ప్రవేశపెట్టి, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలను అయోమయంలోకి నెట్టిందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతి 50 పడకల ఆస్పత్రిలో క్లినికల్ ఫార్మశిస్టును నియమించాలని, ప్రతి జిల్లాకు 3, 4 డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఏర్పాటుచేయాలని, వైద్యులకు, రోగులకు వారు వినియోగించే మందులపై అవగాహన తెచ్చేందుకు ఇవి దోహదపడతామని వారు ప్రభుత్వానికి సూచించారు.

ప్రతి ఆస్పత్రిలో పేషెంట్ కౌన్సెలింగ్ సెంటర్లు, ప్రతి జిల్లాకు ఒక ఫార్మకో విజిలెన్స్ సెం టర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో 200 మందికిపైగా ఫార్మా డాక్టర్లు, నగర వైద్యులు జగదీష్, ప్రశాంత్, కృష్ణవేణి, హర్షవర్ధన్, ప్రవీణ్, చంద్రశేఖర్, సత్యసునీల్, నరేష్, రామలక్ష్మి, విజయ్, కృపాల్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు