ఈ ఒక్క వారమైనా డ్యూటీ చేయండి

10 Oct, 2013 03:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి పొంచి ఉన్న తుపాను నేపథ్యంలో సమైక్య సమ్మెకు కొంత విరామం ప్రకటించి ఈ ఒక్క వారమైనా పూర్తిస్థాయి విధుల్లోకి రావాలని డిప్యూటీ కలెక్టర్లకు సర్కారు విజ్ఞప్తి చేసింది. సమ్మె చేస్తూనే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవ చేస్తామన్న డిప్యూటీ కలెక్టర్ల సంఘం వాదనతో ప్రభుత్వం ఏకీభవించలేదు. సమ్మెలో ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టడం కష్టమని, ఆయా కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది కనుక, సమ్మె చేస్తూ ఆర్థిక పరమైన అంశాల జోలికి పోరాదని పేర్కొంటూ ఈ వారం రోజులు విధుల్లో చేరాలని కోరింది.
 
 ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా బుధవారం విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సంఘం గురువారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇదిలావుంటే, సంఘం ప్రతినిధు లు బుధవారం సీఎంతో భేటీ అయ్యారు. సమైక్య రాష్ట్రంపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ సమ్మె విరమించేది లేదని సంఘం అధ్యక్షుడు పిడుగు బాబూరావు, ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వర నాయుడు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు